పొంగులేటి కంపెనీకి అనుచిత‌ లబ్ధి

– కొడంగల్-నారాయణపేట-మక్తల్ టెండర్లలో మిగతా కంపెనీలన్నీ నామమాత్రమే
– రూ.1,450 కోట్ల నుంచి రూ.6,825 కోట్లకు పెరిగిన ప్రాజెక్టు వ్యయం
– చుక్క నీరు అందకముందే ఐదు రెట్లకు చేరిన అంచనా వ్యయం
– ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ సంపద దోపిడీ
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకం టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యవహారంపై ఆయన సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తలకిందులుగా పడినా తమదే గెలుపు అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం ఉందని వ్యాఖ్యానించారు. కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే మంత్రి పొంగులేటికి చెందిన సొంత కంపెనీ కూడా టెండర్లలో పాల్గొన్నదని ఆరోపించారు. మిగతా కంపెనీలన్నీ కాగితాలపైనే ఉన్న నామమాత్రపు సంస్థలని, చివరకు ఒక్క కంపెనీ మాత్రమే పోటీలో మిగిలి విజయం సాధించేలా వ్యవహారం నడిచిందని విమర్శించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగిపోవడంపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014లో సుమారు రూ.1,450 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతం రూ.6,825 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. అంటే దాదాపు ఐదు రెట్లు వ్యయం పెరిగిందని, ప్రజాధనాన్ని ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క నీరు కూడా అందలేదని విమర్శించారు. అంచనా వ్యయాన్ని భారీగా పెంచుతూ టెండర్ల ప్రక్రియను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. టెండర్లలో పారదర్శకతకు తావులేకుండా తమకు అనుకూలమైన కంపెనీలకే పనులు దక్కేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని మండిపడ్డారు. ఒకవైపు ప్రజలు తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంటే మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రాజెక్టుల అంచనా వ్యయాలను పెంచి కాంట్రాక్టుల ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించి ఇలాంటి దోపిడీకి సరిపోయే కొత్త పదాన్ని సూచించాలని కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు. జరుగుతున్న ఈ దోపిడీని వివరించడానికి క్రోనీ క్యాపిటలిజం, బహిరంగ దోపిడీ, క్లెప్టోక్రసీ వంటి పదాలు కూడా సరిపోవడం లేదని వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *