దోచుకున్న‌ది చాల‌క మ‌ళ్లీ అధికారం కోసం క‌ల‌లు

– సీఎం కుర్చీ కోసం ప్రతిపక్ష నేత ప్రమాణస్వీకార రిహార్సల్స్
– ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు నింపుదాం
– రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : పేదల కష్టనష్టాలను గమనించి గతంలో ఇందిరమ్మ ప్రభుత్వాలు ఇళ్లు, ఇళ్ల స్ధలాలు మంజూరు చేస్తే బీఆర్‌ఎస్ పాలకులు పేదల ఇళ్లు, స్ధలాలను కొల్లగొట్టారని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ధరణి పేరిట భూ దోపిడీ, కాళేశ్వరం పేరిట అవినీతికి పాల్పడి రాష్ట్రానికి రూ.8.25లక్షల కోట్ల అప్పులు మిగిల్చిన ఆ ప్రభుత్వం కారణంగా నెలకు రూ.6,500 కోట్లను ప్రజాప్రభుత్వం వడ్డీ రూపేణా చెల్లిస్తోందని వివరించారు. రంగారెడ్డి జిల్లా నందిగామలో ఎంపీడీవో కార్యాలయ ప్రారంభం, ఎమ్మార్వో కార్యాలయ భవన శంకుస్ధాపనతోపాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలను మంత్రి పొంగులేటి శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కష్టపడుతుంటే మరో వైపు రానున్న కాలంలో తానే ముఖ్యమంత్రిని అవుతానన్న భ్రమతో ఓ ప్రముఖుడు ఇప్పటినుంచి ప్రమాణస్వీకారోత్సవంపై రిహార్సల్స్ వేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో రెండేసి జిల్లాలను పంచుకుని దోపిడీకి పాల్పడిన నాటి మంత్రులు, ప్రముఖులు ఇప్పుడు కనీసం నాలుగేసి జిల్లాలు కావాలంటూ అప్పుడే ఆ నేతపై ఒత్తిడి తెస్తున్నారని, అయితే వారి కలలు కల్లలు కాక తప్పదని మంత్రి పొంగులేటి జోస్యం చెప్పారు. ముందు నీ నియోజకవర్గంలో గెలువు.. తర్వాత సీఎం పీఠం గురించి ఆలోచించవచ్చని ఆయనకు హితవు పలికారు. ప్రజా ప్రభుత్వంపై అబద్దాలు చెప్పకపోతే తల వేయి ముక్కలవుతుందన్న భయంతో ప్రతిపక్ష నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజల సంక్షేమం విషయంలో ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం భేషజాలకు పోదని, గత ప్రభుత్వపు షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పధకాల కొనసాగింపే దీనికి నిదర్శనమని అన్నారు. గత 33 నెలల్లో ఈ ప్రజా ప్రభుత్వం పేదలు ముఖ్యంగా మహిళల కోసం వివిధ సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టిందని, రానున్న కాలంలో మరిన్ని పధకాలు అమలు చేస్తామని చెప్పారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు ఇప్పటివరకు రూ.73వేల కోట్లను సున్నా వడ్డీకి డ్వాక్రా మహిళల ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటికి 2,25,100 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, రానున్న కాలంలో మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ తరుణంలో ఆనందోత్సాహాలు జరుపుకునేందుకు శనివారం నుంచి పూర్తయిన ఇళ్ళ ముందు మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పేరిట కార్యక్రమాలు నిర్వహించాలని, దీనిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కమిటీల సభ్యులు అందరూ పాల్గొనాలని మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు. ధరణి పేరిట గత ప్రభుత్వం దోచుకుంటే తాము భూ సమస్యే లేకుండా చేసేందుకు భూభారతి పేరిట సంస్కరణలు తెస్తున్నామని, ఏడాదిన్నరలో 10,456 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి ప్రతి భూమికి పట్టా, మ్యాప్‌లతోపాటు ఆధార్ నెంబర్ వలే భూధార్ నెంబర్ ఇస్తామని వెల్లడించారు. ఈనెల 19న సిద్దిపేట వేదికగా అద్భుతమైన చిలక పచ్చరంగు బతుకమ్మ చీరలను మహిళా లోకానికి అందిస్తామని చెప్పారు.

నందిగామ ప్రాంతానికి మంత్రి వరాల వెల్లువ

స్ధానిక ఎమ్మెల్యే శంకరన్న అభ్యర్ధన మేరకు ఈ ప్రాంతానికి ఒక ఆర్డీవో కార్యాలయ భవనం, ఎమ్మార్వో కార్యాలయ భవనం మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. సిద్దాపురంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయకుండా వేరే ప్రాంతానికి తరలిస్తామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. వెంగిరాలలోని భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వేదికపై నుంచే అధికారులను ఆదేశించారు. వెంజెళ్లలో కూడా భూసమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళల భవనంలోనూ, పాఠశాల ఆవరణలోనూ మహిళలు, విద్యార్ధినీవిద్యార్ధులతో మంత్రి ఫొటో దిగారు. పలువురు మహిళలకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. పర్యటనలో మంత్రికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకరన్న, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే మా సంకల్పం

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలనే గొప్ప సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇల్లు అనేది నాలుగు గోడల నిర్మాణం మాత్రమే కాదని, ప్రతి పేద కుటుంబానికి ఆత్మగౌరవం, భద్రత, భరోసా కల్పించే చిరునామా అని పేర్కొన్నారు. పేదల కష్టాలను అర్థం చేసుకుని, వారి సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రూపొందించిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యాచరణలో పెట్టి అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంపై సచివాలయంలో హౌసింగ్ అధికారులతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు నివాసాన్ని కల్పించడమే కాక వారి కుటుంబాల్లో ఆనందం, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తుపై భరోసా నింపడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అందులో భాగంగానే మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమానికి రూపకల్పన చేశామని తెలిపారు. పేదల ఇళ్లలో వెలుగులు నింపుతూ వారి కుటుంబాలతో కలిసి పండుగ సంతోషాలను పంచుకోవాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *