– టపాసుల వెలుగుల్లో ఆరోగ్యాన్ని మరిచిపోవద్దు
– ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తప్పనిసరి
– కేర్ హాస్పిటల్స్ వైద్యుల సూచనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాలిన గాయాలు, కంటి సమస్యలతోపాటు శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని కేర్ హాస్పిటల్స్ వైద్యులు హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, ఆస్తమా, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదం జరిగిన వెంటనే సరైన ప్రథమ చికిత్స అందించకపోవడం, హాస్పిటల్‌కు తీసుకెళ్లడంలో ఆలస్యం చేయడం వల్ల సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
టపాసులు కాల్చేవారికే కాదు.. పక్కన ఉన్నవారికీ ప్రమాదమే
టపాసుల వల్ల చేతులు, ముఖం, కళ్లకు తీవ్ర గాయాలయ్యే అవకాశం ఉందని కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ సీనియర్ కన్సల్టెంట్, అత్యవసర వైద్య విభాగాధిపతి డాక్టర్ పి.శివకుమార్లిలి తెలిపారు. టపాసులు కాల్చేవారితో పాటు సమీపంలో నిలబడినవారు, ముఖ్యంగా చిన్నారులు కూడా నిప్పురవ్వలు, పేలుడు పదార్థాల కారణంగా గాయపడవచ్చని వివరించారు. టపాసులను బహిరంగ ప్రదేశాల్లోనే కాల్చాలని, వాటికి తగిన దూరంలో ఉండాలని సూచించారు. చిన్నారులను పెద్దల పర్యవేక్షణ లేకుండా టపాసులు కాల్చేందుకు అనుమతించకూడదన్నారు. సింథటిక్, వదులుగా ఉండే దుస్తులకు బదులుగా కాటన్ దుస్తులు ధరించడం మంచిదని చెప్పారు. ఒకసారి వెలిగించినా పేలని టపాసుల దగ్గరకు వెంటనే వెళ్లడం, మళ్లీ వెలిగించేందుకు ప్రయత్నించడం ప్రమాదకరమని హెచ్చరించారు.
కాలిన గాయాలపై టూత్‌పేస్ట్, నూనె రాయొద్దు
టపాసుల వల్ల కాలిన గాయాలైతే వెంటనే చల్లటి పారే నీటిలో సుమారు 20 నిమిషాలపాటు గాయపడిన భాగాన్ని ఉంచాలని డాక్టర్ శివకుమార్ సూచించారు. గాయాలపై ఐస్, టూత్‌పేస్ట్, నూనె, పసుపు వంటి వాటిని రాయకూడదన్నారు. వీటివల్ల గాయం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాలినచోట ఏర్పడిన బొబ్బలను పగులగొట్టకూడదని, శుభ్రమైన, గాయానికి అంటుకోని డ్రెస్సింగ్‌తో వదులుగా కప్పాలని సూచించారు. కాలిన గాయం మొదట చిన్నదిగా కనిపించినా లోపలి కణజాలం తీవ్రంగా దెబ్బతిని ఉండవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే అందించే ప్రథమ చికిత్స ఎంతో కీలకం. ముఖ్యంగా చేతులు, ముఖంపై గాయాలు, లోతైన కాలిన గాయాల విషయంలో ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి ఆయన అన్నారు.
కంటికి గాయమైతే నిర్లక్ష్యం వద్దు
టపాసుల నుంచి వెలువడే నిప్పురవ్వలు, చిన్నచిన్న పేలుడు పదార్థాలు కంటికి తగిలితే చూపు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. కంటికి గాయమైనప్పుడు రుద్దడం, ఒత్తిడి చేయడం, లోపలికి చొచ్చుకుపోయిన పదార్థాలను స్వయంగా తొలగించేందుకు ప్రయత్నించడం చేయకూడదన్నారు. వైద్యుల సలహా లేకుండా కంటి చుక్కల మందులు వాడకూడదని సూచించారు. కంటి నొప్పి, రక్తస్రావం, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.
టపాసుల పొగతో ఊపిరితిత్తులకు ముప్పు
టపాసుల నుంచి వెలువడే సూక్ష్మ ధూళికణాలు, హానికర వాయువులు శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని కేర్ హాస్పిటల్స్ మలక్‌పేట సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సుధీర్ ప్రసాద్ తెలిపారు. ఈ సూక్ష్మ కణాలు ఊపిరితిత్తుల లోతైన భాగాల వరకు చేరి శ్వాసనాళాల్లో మంట, చికాకు కలిగిస్తాయని తెలిపారు. దీనివల్ల దగ్గు, ఆయాసం, ఛాతీలో బిగుతు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చన్నారు. ముఖ్యంగా ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) వంటి వ్యాధులతో బాధపడే వారిలో టపాసుల పొగ కారణంగా సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. చిన్నారుల ఊపిరితిత్తులు ఇంకా అభివృద్ధి దశలో ఉండటం, వృద్ధుల్లో ఊపిరితిత్తుల పనితీరు తగ్గే అవకాశం ఉండటంతో వీరు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి కూడా అధిక వాయు కాలుష్యం అదనపు ముప్పుగా మారవచ్చని తెలిపారు. ఆస్తమా, సీఓపీడీ బాధితులకు టపాసుల పొగ వల్ల ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పెరగవచ్చు. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. ఇన్హేలర్లను అందుబాటులో ఉంచుకోవాలి. ఆయాసం పెరగడం, శ్వాస తీసుకునేటప్పుడు ఈలలాంటి శబ్దం రావడం, ఛాతీలో అసౌకర్యం వంటి లక్షణాలను సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు అని వైద్యులు హెచ్చరించారు.
పొగ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లొద్దు
వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో బయట తిరగడం తగ్గించాలని డాక్టర్ సుధీర్ ప్రసాద్ సూచించారు. టపాసుల పొగ అధికంగా ఉన్నప్పుడు ఇంటి తలుపులు, కిటికీలు మూసి ఉంచడం మంచిదన్నారు. టపాసులు ఎక్కువగా కాల్చే ప్రాంతాలకు చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండాలని తెలిపారు. బయటకు వెళ్లాల్సి వస్తే సరిగ్గా అమరే ఎన95 మాస్కు సూక్ష్మ ధూళికణాల నుంచి కొంత రక్షణ కల్పిస్తుందని, అయితే హానికర వాయువుల నుంచి రక్షించలేదని వివరించారు.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలి
తీవ్రమైన కాలిన గాయాలు, కంటి గాయాలు, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తితే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సేవలు పొందాలని వైద్యులు సూచించారు. ప్రతి ఇంట్లో ప్రాథమిక చికిత్సకు అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. దీపావళిని ఆనందంగా జరుపుకోవడంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కేర్ హాస్పిటల్స్ వైద్యులు సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులను టపాసుల పొగ, ప్రమాదాల నుంచి రక్షించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





