– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
కరీంనగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే రేవంత్ రెడ్డి సర్కార్ మెడలు వంచుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రాష్ట్రంలోని విద్యార్థి లోకం ఎదుర్కొంటున్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో కరీంనగర్‌లో బుధవారం నిర్వహించిన ఫీజు బకాయి – బీజేపీ లడాయి మహా ధర్నా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ముందు సంక్షేమ రాజ్యం తెస్తామని చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి హయాంలో ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలు పెడితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆయన మండిపడ్డారు. హైకోర్టు మొట్టికాయలు వేయడంతోనే రూ.2 వేల కోట్లు అడ్వాన్స్‌గా ఇస్తామని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని, అయితే ఇప్పటివరకు పైసా కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు బకాయిల కోసం ఎదురు చూస్తున్నారని, కాలేజీ యాజమాన్యాలకు నిధులు అందక అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేక విద్యాసంస్థలు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక, మానసిక క్షోభను అనుభవిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన ‘యూత్ డిక్లరేషన్’ హామీలు గాలికి కొట్టుకుపోయాయని, కాంగ్రెస్ పార్టీ వలసవాద ఆలోచనా ధోరణితో వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్తును విస్మరిస్తోందని విమర్శించారు. ఫీజు బకాయిలను సాధించే వరకు విద్యార్థుల పక్షాన బీజేపీ పోరాడుతూనే ఉంటుందని రామచందర్‌రావు స్పష్టం చేశారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల సాధనకు, స్కాలర్‌షిప్‌ల విడుదల కోసం నెల రోజులుగా బీజేవైఎం క్షేత్రస్థాయిలో అలుపెరగని పోరాటం చేస్తోందని తెలిపారు. విద్యార్థుల ఆందోళనలను చూసి భయపడి కాలేజీ యాజమాన్యాలకు, విద్యార్థులకు పోలీసులు నోటీసులు జారీ చేయడం దుర్మార్గమని అన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే కలెక్టరేట్లను ముట్టడించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలు, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని, లేనిపక్షంలో సీఎం రేవంత్.. తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతికుమార్, జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, నగర మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతోపాటు వేలాదిమంది విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



