– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో రేపు వర్క్ షాప్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు వీబీ-జీ రామ్‌జీ పథకం కింద చేపట్టాల్సిన పనులు, సమగ్ర వ్యవసాయ చెరువుల నిర్మాణం, వివిధ శాఖల మధ్య సమన్వయం, గ్రామస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ వర్క్‌షాప్‌లో ప్రధానంగా చర్చించనున్నారు. రాజేంద్ర నగర్‌లోని టీజీఐఆర్డీలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్క్‌షాప్ కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించడం, నీటి వనరులను అభివృద్ధి చేయడం, వ్యవసాయానికి అవసరమైన నీటి లభ్యతను పెంచడం, గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. వీబీ-జీ రామ్‌జీ పథకం ద్వారా ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. గ్రామాల అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి, వాటిని సమర్థవంతంగా అమలు చేసేందుకు కార్యాచరణను రూపొందిస్తారు. అదేవిధంగా సమగ్ర వ్యవసాయ చెరువుల నిర్మాణం ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, వ్యవసాయానికి నీటి భద్రత కల్పించడం వంటి అంశాలపై చర్చ జరుగుతుంది. వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్య, పశుసంవర్థక శాఖలు తమ పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా అధికారులు వివరించనున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయడం ద్వారా గ్రామాల్లో నీటి సంరక్షణ, వ్యవసాయ ఉత్పాదకత, పశుసంపద, మత్స్య సంపద అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టేలా ప్రణాళిక రూపొందించనున్నారు. వర్క్‌షాప్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్, వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్య శాఖల కార్యదర్శులు, టీజీఐఆర్డీ సీఈవో, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరవుతారు. జిల్లాల నుంచి అదనపు కలెక్టర్లు(స్థానిక సంస్థలు), జిల్లా సీఈవోలు, డీఆర్‌డీవోలు, డీపీవోలు, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక, మత్స్య శాఖల అధికారులు పాల్గొంటారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ది ప్రణాళిక(జీపీఎస్‌ఏపీ) అంశంపై చర్చ కోసం 31మంది సర్పంచ్‌లు సైతం హాజరవుతారు. ఉదయం మొదటి సెషన్‌లో ఎల్‌నినో పరిస్థితి, దాని ప్రభావం, వీబీ-జీ రామ్‌జీ ద్వారా చేపట్టాల్సిన కౌంటర్ చర్యలను వివరిస్తారు. అనంతరం సమగ్ర వ్యవసాయ చెరువులపై శాఖల వారీగా మార్గదర్శకాలు, సంబంధిత శాఖల సర్క్యులర్లను విడుదల చేస్తారు. సమగ్ర గ్రామ పంచాయతీ ప్రణాళికను ప్రారంభించి దాని విధానం, అమలుపై ప్రజెంటేషన్ ఇస్తారు. రెండో సెషన్‌లో వీబీ-జీ రామ్‌జీ ద్వారా ఎల్‌నినోను ఎదుర్కొనే యాక్షన్ ప్లాన్, సమగ్ర వ్యవసాయ చెరువులపై ప్రజెంటేషన్, వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్య, పశుసంవర్థక శాఖల పాత్రపై విడివిడిగా చర్చలు జరుగుతాయి. మధ్యాహ్నం వీబీ-జీ రామ్‌జీ కింద వికసిత్ భారత్ గ్రామ ప్రణాళిక తయారీపై చర్చిస్తారు. అనంతరం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై చర్చ ఉంటుంది. జీపీఎస్‌ఏపీ ప్రణాళిక, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌పై సంబంధిత అధికారులు వివరిస్తారు. దీంతోపాటు చేయూత పింఛన్లు, గ్రామ పంచాయతీల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులపై చర్చ జరుగుతుంది. ఈ వర్క్‌షాప్‌లో ప్రధానంగా నాలుగు అంశాలపై సెషన్లు ఉంటాయి. వీబీ-జీ రామ్‌జీ ద్వారా ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు వ్యవసాయ చెరువుల వినియోగం, వికసిత్ భారత్ గ్రామ ప్రణాళిక, జీపీఎస్‌ఏపీ, పంచాయతీ అభివృద్ధి, చేయూత పింఛన్ల అవగాహన కల్పిస్తారు. వర్క్‌పాష్ ద్వారా క్షేత్రస్థాయి అధికారుల అభిప్రాయాలు, కార్యాచరణ ప్రణాళికలను సమన్వయం చేయనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



