– సర్వే నంబర్ 325లో మాభూములు కలిపేశారు’
– శివారు వెంకటాపూర్ రైతుల ఆందోళన
– అధికారుల నిర్లక్ష్యంతో 113 ఎకరాలు విలీనం!
– న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి
మర్కుక్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని సర్వే నంబర్ 325లో గల 388 ఎకరాల భూమిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ పరిధిలో రెవెన్యూ అధికారులు ఐదవ రోజు సర్వేను ముమ్మరం చేశారు. ఏడీ సుదర్శన్ రాథోడ్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ సేవ్య నాయక్ సమక్షంలో, మర్కుక్ ఎమ్మార్వో సరిత పర్యవేక్షణలో సర్వేయర్లు నాలుగు బృందాలుగా విడిపోయి క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు. ఈ సర్వేలో సంచలన విషయం బయటపడింది. ఫీల్డ్ లో సర్వే జరుగుతుండగానే శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతులు అక్కడికి చేరుకుని తమ ఆవేదనను అధికారుల ముందు వెళ్లబోసుకున్నారు. అప్పట్లో ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ గ్రామానికి చెందిన 113 ఎకరాల భూమిని ఎర్రవల్లి సర్వే నంబర్ 325లో విలీనం చేశారు.. దీంతో తమ గ్రామ రైతులు తీవ్రంగా నష్టపోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు. పాత నక్షా ప్రకారం తమ భూమి సర్వే నంబర్లు 38,41,47,48,85,86,88,89, 100,101,162 గా ఉండేవని, ఈ సర్వే నంబర్ల భూమిని ఎర్రవల్లి 325లో కలపడం వల్లే 388 ఎకరాలు అయిందని, నిజానికి ఎర్రవల్లికి ఉండాల్సింది 250 ఎకరాలు మాత్రమేనని రైతులు స్పష్టం చేశారు. అంతకు ముందున్న తమ గ్రామ సర్వే నంబర్లు కూడా ఇప్పుడు రికార్డుల్లో లేవని, పాత నక్షాలు, రికార్డులను మార్చి తమకు అన్యాయం చేశారని వారు ఆరోపించారు. తమ వద్ద ఉన్న పాత రికార్డులను, పాత నక్షాను మీడియా ముందు ఆధారాలుగా చూపారు. తాజాగా నిర్వహిస్తున్న సమగ్ర సర్వేలో తాము కోల్పోయిన సర్వే నంబర్లను తిరిగి తమ గ్రామమైన శివారు వెంకటాపూర్ లో విలీనం చేయాలని, తమకు న్యాయం చేయాలని శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతులు ప్రభుత్వాన్ని, రెవెన్యూ అధికారులను వేడుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు