కవిత టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి చిక్కులు

– పార్టీ గుర్తింపుపై ఈసీకి అభ్యంతరాలు

న్యూదిల్లీ,జూన్‌ 11: ఎమ్మెల్సీ కవిత కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌)కు ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ పేరుపై ఇప్పటికే పలు అభ్యంతరాలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కవిత పార్టీ ప్రకటనకు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్‌ ‌కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన కూడా టీఆర్‌ఎస్‌ పేరు తమ పార్టీకి కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. షోలాపూర్‌కు చెందిన దయానంద్‌ ‌మహాదేవ్‌ ‌మామ్‌డ్యాల్‌ ఈ ‌మేరకు కవిత పార్టీ ప్రకటనకు ఒక రోజు ముందే ఈసీఐకి దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. ఇక కవిత పార్టీ పేరుపై భారత్‌ ‌రాష్ట్ర సమితి  కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టిఆర్‌ఎస్‌ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, ఇప్పటికీ గ్రాణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ను టీఆర్‌ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది. అంతేకాక పత్రికల్లో కవిత ఇచ్చిన ప్రకటనపై కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. టీఆర్‌ఎస్‌ ‌పేరును కేటాయించడంపై దాదాపు 600 నుంచి 700 వరకు ప్రజా అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి అందినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే ఈ పేరుతో నమోదైన మరికొన్ని పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రాజ్య సమితి పేరుతో నమోదైన మరో పార్టీ కూడా టీఆర్‌ఎస్‌ పేరును ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు కవిత ప్రతినిధుల బృందం ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. భారీ సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో కవిత పార్టీకి టీఆర్‌ఎస్‌ పేరు దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ ‌టాపిక్‌గా మారింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *