తెలంగాణలో బీజేపీకి కష్ట కాలం!

– బండి సంజయ్ కు ‘సన్ స్ట్రోక్‌’
– రాష్ట్ర నాయకుల మధ్య కొరవడిన స‌మ‌న్వ‌యం
– తలపట్టుకుంటున్న కేంద్ర నాయకులు

                                                                                        (మండువ రవీందర్ రావు)

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రస్తుతం క్లిష్టపరిస్థితిని ఎదుర్కుంటున్నది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన తర్వాత ఇక తనకన్నీ విజయలేనన్న జోష్ లో ఉండింది. బెంగాల్ తర్వాత తెలంగాణనే తన నెక్స్ట్ టార్గెట్ గా నిర్ణయించుకుంది. ఆమేరకు కేడ‌ర్‌ను సన్నాహపర్చే ప్రక్రియను మొదలుపెట్టింది. ప్రధాని నరేంద్రమోదీ తాజా తెలంగాణ పర్యటన తమ ల‌క్ష్య‌  గమనాన్ని సూచించేదిగా ఉంటుందనుకున్నారు. కానీ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు ఆ పార్టీ దూకుడుకు కళ్ళెం వేసినట్టైంది. రాష్ట్రంలో బండి సంజయ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత స్త‌బ్దుగా ఉన్న బీజేపీని రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఆయన ఉరుకులు పెట్టించారు. ఒక సందర్భంలో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే సత్తా ఉన్న వ్యక్తిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ పార్టీ ఉన్నతి కోసం తీవ్రంగా కష్టపడిన వ్యక్తి. కానీ గత శాసనసభ ఎన్నికలకు ముందే ఆయనను అ పదవినుండి తొలగించడం ఆ పార్టీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఆయన చేసిన కృషి ఫలితంగా పార్టీ అధికారంలోకి రాకపోయినా గుర్తింపు స్థాయిలో ఎంపి, ఎంఎల్యే స్థానాలను సాధించుకుంది. పార్టీ అధిష్టానంకూడా ఆయన గౌరవాన్ని ఏమాత్రం తగ్గించకుండా పార్టీ జాతీయ కార్యదర్శిగా, ఎంపీగా, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా సముచిత స్థానాన్నిచ్చి గౌరవించింది. అంచలంచలుగా ఎదుగుతున్న తరుణంలో ఆయనకిప్పుడు ‘సన్ స్ట్రోక్‌’ తగిలింది. దీంతో తెలంగాణలో ముందుకు పోవాలనుకుంటున్న ఆ పార్టీకి కాస్తా బ్రేకులు పడినట్లు అయింది. ఇదిప్పుడు బిఆర్ఎస్‌కు ఆయుధంగా మారింది. భగీరథ్ సంఘటనకు నాలుగు అయిదు రోజుల ముందే బండి సంజయ్ కెటిఆర్ పై విరుచుకు క్‌పడ్డాడు. నిజంగా నువ్వు కేసిఆర్ కొడుకువే అయితే అన్న ఆయన మాటలు కెటిఆర్ తో పాటు ఆ పార్టీ వర్గాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడవల్సిన మాటలు కావని పలువురు రాజనీతిజ్ఞులు, సామాజిక వేత్తలు తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ఆ సంఘటన జరిగిన తర్వాత సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై బాదితురాలు ఫిర్యాదు చేయడం మొదలు బిఆరఎస్ దాన్ని అందిపుచ్చుకుంది. భగీరథకు కేసుకు సంబందించిన ఒక్కో అంశాన్ని తీసుకుని ఆందోళనను తీవ్రతరం చేస్తూ వస్తున్నది . ఫిర్యాదుదారు కంప్లెయింట్ పై పోలీసులు ఆలస్యంగా స్పందించడం వెనుక అధికార కాంగ్రెస్, బిజెపి ఒక్కటేనన్న విషయాన్ని బిఆర్‌ఎస్ విజయవంతంగా ప్రచారం చేయగలిగిందనే చెప్పాల. దాంతోపాటు ఇంతకాలంగా బిఆర్‌ఎస్, బిజెపి ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టగలిందనే చెప్పవచ్చు. కాగా ,భగీరథ్ ను వారం రోజులపాటు దాచిపెట్టిన విషయాన్ని తీసుకుని సంజయ్ మంత్రి పదవికి అనర్హుడని, వెంటనే రాజీనామా చేయాలని బిఆర్‌ఎస్ డిమాండ్ చేస్తున్నది. ఆయనను ఆ పదవి నుండి వెంటనే భర్తరఫ్ చేయాలని కేంద్రాన్ని కూడా డిమాండ్ చేస్తుండడం బిజెపిని ఇరుకున పెట్టినట్టైంది. ఎలాంటి తప్పు చేయలేదని తన కుమారుడు తనతో చెప్పినట్లు బండి సంజయ్ చెబుతున్నప్పటికీ, బండి భగీరథ్ ను జైల్లో పెట్టడం, కొత్త కొత్త సెక్షన్లను అతనిపై నమోదు చేస్తున్నతీరు భగీరథ్ నేరస్తుడన్న విషయాన్ని బలపర్చేవిగా ఉన్నాయి.

ఇదిలాఉంటే బిజెపి రాష్ట్ర నాయకుల మధ్య సయోధ్య లేకపోవడంకూడా ఆ పార్టీని ఇబ్బంది పెడుతున్నది. జిల్లా, అధ్యక్షుల మధ్య సమన్వయం లేకపోవడం, ప్రధాని మోదీ పర్యటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై అధిష్టానం ఇప్పుడు దృష్టి సారిస్తున్నది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును ఢిల్లీకి పిలిపించుకుని వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నట్లు తెలుస్తున్నది. 2029లో రానున్న ఆసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ అధినేతలు ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణపై మరింత దృష్టిని సారించడంలో భాగంగా గవర్నర్ లేదా పార్టీపరంగా మరికొన్ని ముఖ్య పదవులను ఇక్కడి వారికి కల్పించాలన్న ఆలోచనలో కేంద్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. బిఆర్‌ఎస్ ను పడదోసి తిరుగలేని మెజార్టీతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్న దశలో ఇక్కడ పటిష్టం చేసుకోవాలని బిజెపి ఆలోచిస్తున్నది.
——————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *