వరంగల్ డ్రైనేజీ, కోట కందకం పునరుద్ధరణ, హనుమకొండ సీబీడీపై చర్చ
మురుగునీటి శుద్ధి, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు
అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20 : రాష్ట్రంలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పురపాలక శాఖ రూపొందించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) సమీక్షించారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా, పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాలను అభివృద్ధి చేసే ప్రణాళికలపై చర్చించారు.
ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబీ), జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకుతో పాటు దేశీయ ఆర్థిక సంస్థల సహకారంతో దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టేందుకు పురపాలక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, వరంగల్ కోట కందకం పునరుద్ధరణ, హనుమకొండలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు.
రాష్ట్రంలో మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు, ప్రధానంగా టెక్స్‌టైల్ పార్కులకు వినియోగించడం ద్వారా మంచినీటి వనరులపై ఒత్తిడి తగ్గించేందుకు అవకాశముంది. పట్టణాల్లో తాగునీటి సరఫరా, నీటి శుద్ధి, పంపిణీ వ్యవస్థల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించే అంశాలపై చర్చించారు.
వరంగల్ మెగా సిటీ ఎకనామిక్ రీజియన్ పరిధిలో వ్యర్థాల నుంచి 10 నుంచి 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను సమీక్షించారు. బయో సీఎన్‌జీ ఉత్పత్తి, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుపై చర్చించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా పట్టణాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించడం, నీటి వనరులను సంరక్షించడం, వరద ముప్పును నివారించడం, పురపాలక సంస్థల నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంవో కార్యదర్శి మాణిక్ రాజ్, పురపాలక శాఖ కార్యదర్శి టి.కె. శ్రీదేవి పాల్గొన్నారు.




