– పంట కొనుగోళ్లపై ఎన్నాళ్లీ మొద్దునిద్ర
– కేబినెట్ మీటింగ్‌లోనైనా కళ్ళు తెరవండి
– సీఎంకు కేటీఆర్ లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21 : రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లపాటు కొండంత ధైర్యంతో బతికిన అన్నదాత ఇవాళ అత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డున పడ్డాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆరు దశాబ్దాలపాటు పడ్డ కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయని సంబరంగా సాగు చేసుకుంటున్న రైతు నోట్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మట్టి కొట్టిందన్నారు. రైతుకు రక్షణగా కేసీఆర్ అమలు చేసిన ఒక్కో పథకానికిá రెండేన్నరేళ్లుగా పాతరేసి అన్నదాత వెన్నువిరిచారని విమర్శించారు. పంటను కొనే దిక్కులేక రెండు నెలలుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆర్తనాదాలు చేస్తున్నారని, మీ సర్కారు నిర్వాకం వల్ల రాష్ట్ర్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈరోజు రైతులు నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారని తెలిపారు. పంట అమ్ముకుందామనే ఆశతో వచ్చిన రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే గుండెపగిలి కుప్పకూలుతున్నా సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. 70 సార్లు దిల్లీకి చక్కర్లు కొట్టడంలో మీకున్న శ్రద్ధలో ఒక్క శాతం రైతులపై పెట్టి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. మీ కుర్చీని కాపాడుకోవడానికి దిల్లీకి మూటలు మోయడం తప్ప రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనాలన్న సోయి మాత్రం మీలో కనిపించడం లేదు అని లేఖలో విమర్శించారు. పెట్టుబడి సాయాన్ని వరుసగా నాలుగుసార్లు ఎగ్గొట్టినా, యూరియా కష్టాలపాలు జేసినా రైతులు అన్నింటినీ దిగమింగి పండించిన ఏ పంటనూ మీ ప్రభుత్వం కొనుగోలు చేసిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద దాదాపు పదిమంది రైతులు వడదెబ్బకుతోడు సర్కారు చేసిన ద్రోహానికి తమ నిండు ప్రాణాలు కోల్పోయారని, అయినా కనీసం ఒక్కసారైనా మీరు ఏ ఒక్క కొనుగోలు కేంద్రం వైపు కన్నెత్తి చూసిన దాఖలా లేదని అన్నారు. అందుకే రైతులు మరో మార్గం లేక పంటను తమ చేతులతోనే తగలబెట్టుకుంటున్నారని తెలిపారు. ఈ 30 నెలల్లోనే సమైక్య రాష్ట్రం నాటి సకల కష్టాల్లో మళ్లీ రైతులను ముంచెత్తారని విమర్శించారు. పగలూ రాత్రి ప్రజాసంపదను దోచుకోవడంపై తప్ప పరిపాలనపై మీకు కనీస పట్టు లేకపోవడం అన్నదాతకు శాపంగా మారింది.. విలువైన భూములను తెగనమ్మి వేల కోట్లు దోచుకోవాలన్న ఉత్సాహం తప్ప రైతుల పంటలను కొనాలన్న ధ్యాస మీలో ఏమాత్రం కనిపించడం లేదు అని వ్యాఖ్యానించారు. రోడ్లపై నిరసనలనుంచి తప్పించుకునేందుకు మంత్రులు హెలికాప్టర్‌లో షికార్లు కొడుతున్నారు.. చివరికి మీ సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కూడా రైతులు రోడ్డెక్కి దుమ్మెత్తి పోసే దుస్థితి వచ్చిందంటే సాగు ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవచ్చునన్నారు. వరంగల్ నుంచి ఖమ్మం దాకా అనేక జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో రోజుకు కనీసం ఒక్కటంటే ఒక్క లారీ లోడ్ కూడా ఎత్తడం లేదు.. ఇక అడపాదడపా చేసే కొనుగోళ్లలోనూ ఒక్కోచోట పది కిలోలకు పైగా తరుగు తీస్తే రైతులకు మిగిలేదేంటో మీరే సమాధానం చెప్పాలి అని నిలదీశారు. చివరికి గన్నీ బ్యాగు కోసం రైతులే రూ.50ల చొప్పున డిపాజిట్ చేసే దుస్థితి తెచ్చినందుకు మీరు, మీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోనస్ ఇచ్చే ముఖం మీ సర్కారుకు ఎలాగూ లేదని ఇప్పటికే తేలిపోయిందంటూ చివరికి పంట కొనుగోలు కూడా చేయడం చేతకానందున రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతులకు మీరు క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయండి అని ఆయన సీఎంకు హితవు పలికారు. అన్నదాతలు అడుగడుగడునా పడిగాపులు పడుతుంటే వాటిని వదిలేసి పర్యాటక వారోత్సవాలు నిర్వహించాలన్న మీ సర్కారుకు ప్రాధాన్యతలే కాదు.. చివరికి సోయి కూడా లేదని తేలిపోయిందన్నారు. కేసీఆర్ హయాంలో మూడు నెల ముందు నుంచే పంటల కొనుగోలు ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేసే వారని, గన్నీ బ్యాగులు మొదలుకుని రైతుల ఖాతాల్లో పంట డబ్బులు సకాలంలో జమ అయ్యేదాకా నిరంతర సమీక్షలతో పర్యవేక్షించేవారని తెలిపారు. రైతులు తమ పంటకు నిప్పు పెట్టుకుంటున్నా మొద్దు నిద్ర వీడని ముఖ్యమంత్రి రేవంత్‌ని చూసి యావత్ రైతాంగం శాపనార్థాలు పెడుతోందన్నారు. అకాల వర్షాల నుంచి కొనుగోలు కేంద్రాల్లోని పంటను కాపాడేందుకు టార్పాలిన్లు కూడా సమకూర్చలేని మీ కాంగ్రెస్ సర్కారు ఉండి రైతులకు ఏం ప్రయోజనం అని కేటీఆర్ ప్రశ్నించారు. మొత్తంగానే వ్యవసాయాన్ని పాతాళంలోకి నెట్టిన మీ దద్దమ్మ పాలనపై ఇప్పటికే రైతుల్లో తిరుగుబాటు మొదలైందని, కాంగ్రెస్ సర్కారుకు మరణశాసనం రాసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 23న నిర్వహించే కేబినెట్ సమావేశంలోనైనా లెంపలేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ప్రతీ పంటను కొని వెంటనే రైతుల కష్టానికి ప్రతిఫలాన్ని అందించాలని, కన్నుమూసిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మీరు చరిత్రలో రైతు ద్రోహిగానే మిగిలిపోతారని కేటీఆర్ సీఎం రేవంత్‌ను హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





