– అచ్చంపేట అభివృద్ధికి రూ.128 కోట్లతో విద్యుత్ పనులు
– ఎల్‌నినో.. తాగునీటి అవసరాలపై అప్రమత్తంగా ఉండాలి
– అచ్చంపేటలో విద్యుత్ ఉద్యోగుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి
అచ్చంపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగి నుంచి సీఎండీ వరకు ప్రతి ఒక్కరినీ ఒక కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ప్రభుత్వం వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా విద్యుత్ శాఖ ఉద్యోగులందరికీ రూ.కోటి ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించినట్లు వెల్లడించారు. అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విద్యుత్ ఉద్యోగుల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే సుమారు రూ.78 కోట్ల విలువైన పనులు చేపట్టామని, తాజాగా మరో రూ.75 కోట్ల విలువైన పనులకు అనుమతులు మంజూరు చేశామని, విద్యుత్ శాఖ పరిధిలోనే సుమారు రూ.128 కోట్ల విలువైన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. విద్య, వైద్యం, రహదారులు, వసతి గృహాలు, వ్యవసాయం, సంక్షేమ రంగాల్లోనూ వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రజల అవసరాలను గుర్తించి ఆయా శాఖల మంత్రులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. నియోజకవర్గంలో మరో పెద్ద సబ్‌స్టేషన్‌తోపాటు 132/33 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
విద్యుత్ ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా
విద్యుత్ ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని భట్టి విక్రమార్క తెలిపారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ లైన్‌మన్ కుటుంబానికి రూ.కోటి బీమా పరిహారం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకూడదనే ఉద్దేశంతో ఈ బీమా సదుపాయాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. ఉద్యోగుల ప్రమోషన్లు, ఇతర సంక్షేమ అంశాలపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు. ఉద్యోగులు కూడా అదే నిబద్ధతతో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, సేవారంగం.. ఇలా ప్రతి రంగం విద్యుత్తుపైనే ఆధారపడి ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని, వారు అభివృద్ధికి మూలస్తంభాలుగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఉద్యోగుల పనితీరును ప్రభుత్వం గుర్తిస్తుందని, అదే సమయంలో బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించబోదని స్పష్టం చేశారు.
ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి
ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో తాగునీరు, వ్యవసాయ అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉందని, మరోవైపు వ్యవసాయం, తాగునీటి సరఫరాపైనా ప్రభావం పడవచ్చని తెలిపారు. ఈ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కార్యాచరణ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్ గరిష్ఠ డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని, డిమాండ్‌కు అనుగుణంగా నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. గత ఏడాదిగా ట్రాన్స్మిషన్ లైన్లను ఆధునికీకరించడం, సామర్థ్యాన్ని పెంచడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా విద్యుత్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేశామని, విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినప్పటికీ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడటంలో ఈ చర్యలు కీలకంగా నిలిచాయని వివరించారు. ఎల్‌నినో ప్రభావం కొనసాగినంతకాలం అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ సరఫరా వ్యవస్థపై పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.
1912కు ఫోన్ చేస్తే తక్షణ స్పందన
విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రజలు 1912 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పవర్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ వాహనాల్లో అవసరమైన సాంకేతిక సిబ్బంది, పనిముట్లు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన సమస్యలు సహా అత్యవసర విద్యుత్ అంతరాయాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడుతున్నాయని వివరించారు. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే విమర్శలకు సరైన సమాధానమని అన్నారు.
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం
విద్యుత్ ఉద్యోగులకు ఏవైనా సమస్యలు ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని భట్టి విక్రమార్క సూచించారు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం, అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమన్నారు. సమావేశంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్, నాగర్‌కర్నూల్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





