– దేశవ్యాప్తంగా 1,500 మంది విద్యార్థులు హాజరు
– ‘సెంటల్ ఇండియా’ హైదరాబాద్ భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారి నిర్వహణ
హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : వరంగల్ కిట్స్‌లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ (సీఎస్ఎం) విభాగం, ‘సెంటల్ ఇండియా (ఐఐటీ-ఐఐఎం పూర్వ విద్యార్థుల నేతృత్వంలోని స్టార్టప్)తో కలిసి జాతీయ స్థాయి ‘ట్రై-సిటీ ఏఐ హ్యాకథాన్-2026’ను శనివారం కిట్స్ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభించింది. కిట్స్ వరంగల్ ఆతిథ్యం ఇస్తున్న భారతదేశపు మొట్టమొదటి ‘ట్రై-సిటీ ఏఐ హ్యాకథాన్’ ఇది కావడం గమనార్హం. శని, ఆదివారాల్లో జరిగే ఈ హ్యాకథాన్‌లో దేశవ్యాప్తంగా 1,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
సాంకేతిక ఆవిష్కరణల్లో మహిళలు ముందంజ
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, కిట్స్ అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్, హన్మకొండ, కాజీపేట త్రినగర ప్రాంతాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతిక ఆవిష్కరణలు మరియు పారిశ్రామిక రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చడమే ఈ రెండు రోజుల హ్యాకథాన్ లక్ష్యమన్నారు. ఈ పోటీల్లో నమోదైన వారిలో 60 శాతానికి పైగా మహిళలే ఉండటం, ఏఐ వంటి అత్యాధునిక సాంకేతికతలపై వారికున్న ఆసక్తికి నిదర్శనమని హర్షం వ్యక్తం చేశారు.
రూ.50 వేల నగదు బహుమతి – ఇంటర్న్‌షిప్ అవకాశాలు
సెంటిల్ ఇండియా వ్యవస్థాపకుడు వంశీ గుగులోత్ మాట్లాడుతూ.. ఈ హ్యాకథాన్ విజేతలకు రూ. 50,000 నగదు బహుమతితో పాటు సెంటల్ వ్యవస్థలో ఇంటర్న్‌షిప్, పరిశ్రమ నిపుణుల మార్గదర్శకత్వం, అత్యుత్తమ ప్రాజెక్టులకు ఇంక్యుబేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇది విద్యార్థులను భావి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందన్నారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దామన్నారు. విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు, మార్గదర్శకులు ఒకే వేదికపైకి వచ్చి ఆచరణాత్మక ఏఐ పరిష్కారాలు కనుగొనడానికి ఇది చక్కటి అవకాశమని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవంలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ సీపీ ఎన్. శ్వేత, సీఎస్‌ఈ విభాగ అధిపతి డాక్టర్ ఎ.జ్యోతి ప్రభ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, పరిపాలనా అధికారి ప్రొఫెసర్ పి. రమేష్ రెడ్డి, పీఆర్‌ఓ డాక్టర్ డి. ప్రభాకర చారి పాల్గొన్నారు.
అలాగే గెయిల్ మేనేజర్ జి. రాజన్న, ఆర్టీసీ డీవీఎం జగన్, సీఐ కాశీరామ్, ఓరియంట్ ఇన్సూరెన్స్ మేనేజర్ శ్రీనివాస్, స్పోర్ట్స్ డైరెక్టర్ అశోక్, డీఈఈటీ అదనపు కార్పొరేట్ డైరెక్టర్ వంశీధర్ రెడ్డి, సెంటిల్ ఇండియా సహ-వ్యవస్థాపకుడు జి. సాయి కృష్ణ, బీ-హబ్ ఎండీ కిరణ్ కుమార్, కాండ్యూరా ఆపరేషన్స్ హెడ్ డాక్టర్ సంజన, సీనియర్ అధ్యాపకులు డాక్టర్ వినయ్ కుమార్, డాక్టర్ బి. హనుమంతు, డాక్టర్ ఎం. రాజేష్ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





