– తుంగతుర్తికి గోదావరి జలాలు
– సూర్యాపేటలో రూ.2,392 కోట్లతో 3 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు
– నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : తొమ్మిది జిల్లాలకు సాగునీటి ప్రయోజనం చేకూర్చే దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా దేవాదుల ఫేజ్-6ను ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి ప్రసంగించారు. ‘సూర్యాపేట ప్రజలకు నేను మాట ఇస్తున్నా.. ఈ ప్రభుత్వ కాలంలోనే దేవాదుల ఫేజ్-6ను పూర్తి చేసి కార్యరూపంలోకి తీసుకొస్తాం.. దీనిద్వారా గోదావరి జలాలను తుంగతుర్తికి తీసుకొచ్చి రైతులకు సాగునీరు అందిస్తాం’ అని ప్రకటించారు. వర్షపాతం, స్థానిక జలవనరులు, సీజనల్ నీటి లభ్యతపై ఎక్కువగా ఆధారపడే తుంగతుర్తి ప్రాంతానికి గోదావరి జలాలు చేరితే సాగునీటి రంగంలో గణనీయమైన మార్పు వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న ఆయకట్టుకు స్థిరీకరణతోపాటు ప్రస్తుతం సాగునీటి సదుపాయం తక్కువగా ఉన్న ప్రాంతాలకు కూడా నీరందించే అవకాశం ఏర్పడుతుందన్నారు. దేవాదుల జలాలను సూర్యాపేట జిల్లా సాగునీటి వ్యవస్థతో అనుసంధానం చేయడం ద్వారా జిల్లా మొత్తానికి జలభద్రత మరింత బలోపేతమవుతుందని చెప్పారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతాన్ని పరిరక్షించి మరింత బలోపేతం చేసేందుకు తక్షణ నీటి నిర్వహణ చర్యలతోపాటు దీర్ఘకాలిక సాగునీటి మౌలిక వసతుల అభివృద్ధిని ప్రభుత్వం చేపడుతోందన్నారు. ప్రస్తుత వర్షపాతం, జలాశయాల్లో నీటి నిల్వలను దృష్టిలో పెట్టుకుని తాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇస్తామని, మిగిలిన నీటిని అత్యంత ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తామని చెప్పారు. నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ స్టేజ్-2, మూసీ తదితర వ్యవస్థల్లో నీటి లభ్యతను నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు.
రూ.2,392 కోట్లతో సూర్యాపేట సాగునీటికి కొత్త ఊపు
దేవాదుల ఫేజ్-6తోపాటు సూర్యాపేట జిల్లాలో సుమారు రూ.2,392 కోట్లతో మూడు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని మంత్రి వెల్లడించారు. వీటి ద్వారా దాదాపు 77 వేల ఎకరాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందన్నారు. రూ.1,649 కోట్లతో చేపట్టే మహాత్మాగాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా సుమారు 53 వేల ఎకరాలు, రూ.292 కోట్ల జవహర్ జంపాడు బ్రాంచ్ కెనాల్ ద్వారా మరో 10 వేల ఎకరాలు, రూ.451 కోట్ల రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు 14 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. మోతె, రెడ్లగుంట, రాజీవ్ శాంతినగర్ ఆర్-9 ఎత్తిపోతల పనులను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందన్నారు. సాగర్ ఎడమ కాల్వతోపాటు అనుబంధ కాల్వల ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.396 కోట్లు, మూసీ ప్రాజెక్టు కాల్వల ఆధునికీకరణకు రూ.70 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
రైతు సంక్షేమం-ఆహార భద్రత రెండు కళ్లుగా..
ఒకవైపు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆహార భద్రత కల్పిస్తూనే మరోవైపు పంట పండించే రైతుకు గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు భరోసా కల్పించే విశిష్ట విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లాలో 3.82 లక్షలకు పైగా ఆహార భద్రత కార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డుల ప్రవేశంతో ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత సులభతరం, పారదర్శకం, సమర్థవంతంగా మారుతుందన్నారు. ఈ యాసంగి సీజన్‌లో జిల్లాలో 314 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 66,635 మంది రైతుల నుంచి సుమారు రూ.900 కోట్ల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ కింద రూ.118 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు తెలిపారు. 2026-27 వానాకాలం సీజన్‌లో రైతు భరోసా కింద సూర్యాపేట జిల్లాలోని 2.90 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో రూ.364 కోట్లకు పైగా జమ చేసినట్లు వెల్లడించారు. రైతు బీమా కింద మరణించిన 689 మంది రైతుల కుటుంబాలకు సుమారు రూ.34 కోట్ల ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. వర్షపాతం, నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకొని వరి సాగుకు అనుకూలత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పప్పుధాన్యాలు, మొక్కజొన్న, నూనె గింజలు, మిర్చి, ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్, కూరగాయల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.
ప్రతి కుటుంబానికీ సంక్షేమ ఫలాలు
జిల్లాలో మహిళలు ఇప్పటివరకు సుమారు 5.68 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేయగా, తద్వారా వారికి రూ.343 కోట్లకు పైగా ఆర్థిక ప్రయోజనం కలిగిందని మంత్రి తెలిపారు. 5.52 లక్షలకు పైగా ఎల్పీజీ సిలిండర్లు రూ.500కే సరఫరా చేయగా 1.91 లక్షలకు పైగా కుటుంబాలు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రయోజనం పొందుతున్నాయని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జిల్లాకు 12,868 ఇళ్లు కేటాయించగా 7,928 ఇళ్లు మంజూరయ్యాయని, ఆరు వేలకుపైగా ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని తెలిపారు. హుజూర్‌నగర్‌లో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 2,160 ఇళ్ల ప్రాజెక్టును పూర్తి చేశామని, అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ కె.నరసింహ, ఇతర ఉన్నతాధికా రులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




