“ఇప్పటికీ మొంపా కుటుంబంలో రెండవ సంతానం మగబిడ్డ పుడితే ఆ పిల్లవాడిని మూడేళ్ల తర్వాత బౌద్ధమతానికి విరాళంగా ఇవ్వడం ఆచారంగా వస్తోందని తెలిసి ఆశ్చర్యపోయాను. నేను వెళ్ళినప్పుడు కూడా ఒక స్థానిక కుటుంబం మూడు, నాలుగేళ్ళ వయస్సు పిల్లవాడిని తీసుక వచ్చి ప్రస్తుతం అక్కడున్న లామాతో పూజ చేయించడం చూసి, మన దగ్గర జరిపే ” పుట్టువెంట్రుకలు తీయడం ” లాంటిదేదో చేస్తున్నారని అను కున్నాను. రాహుల్ ను అడిగితే అసలు విషయం తెలిసింది. ఇదే విషయాన్ని మేము బసచేసిన ఇంటి యజమాని రోమాను అడిగి నిర్ధారించు కున్నాను..”
గిరియానం – 25
బూమ్లా పాస్ నుంచి తిరిగి వచ్చి, తవాంగ్ లోనే ఉన్న బౌద్ధ విహారానికి వెళ్ళాం. ఇది భారత దేశంలోనే అతి పెద్ద బౌద్ధ మొనాస్టరీ. టిబెట్ లో లాసా లోని పోటాలా ప్యాలెస్ తర్వాత ప్రపంచంలోని రెండవ అతిపెద్ద బౌద్ధ విహారం. ” దీనిని గాల్డెన్ నామ్గ్యాల్ లాత్సే” అని కూడా పిలుస్తారు. ఉదయం ఏడు గంటలనుంచి సాయంత్రం ఏడు గంటలవరకు లోపలికి అనుమతిస్తారు. ఇది కేవలం మొనాస్టరీ కాదు, నాలుగువందల యేళ్ళ బౌద్ధ చరిత్ర, జ్ఞానం, సంస్కృతి, విశ్వాసాలతో జీవిస్తున్న ప్రదేశం. ఆధ్యాత్మికత, చరిత్ర, ప్రకృతి ఈ మూడింటి సమ్మిళిత ప్రాంతమే తవాంగ్ చూ లోయ. మొనాస్టరీ పది అడుగుల ఎత్తైన మూడు అంతస్తుల భవనం. అరవైయైదు నివాస భవనాలు ఉన్న ప్రాంగణం. పదిహేడు గొంపాలు ఉన్నాయి. ముంపా భాషలో గొoపా అంటే బౌద్ధ మఠం అని అర్థం. శత్రువుల దాడిని తట్టు కోవడానికి తొమ్మిది వందల ఇరవై అయిదు అడుగుల ప్రహరీ గోడను మూడు మీటర్ల ఎత్తులో నిర్మించారు. మొత్తం కలప, రాయి, మట్టితో కట్టారు. ఎక్కడా ఇనుము వాడలేదట.
ప్రధాన ప్రార్థనా (డ్యూకాంగ్ ) మందిరంలో ఎనిమిది అడుగుల బుద్ధ విగ్రహం దర్శనం ఇస్తుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద బుద్ధ విగ్రహాలలో ఒకటి. రాగి, బంగారం లోహాలతో చేశారు. లోపల గోడల పైన ఉన్న థాంగ్ కా పెయింటింగ్స్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇవి రెండు వందల ఏళ్ళ కంటే ప్రాచీనమైనవి. సుమారు ఐదు వందల మంది బౌద్ధ సన్యాసులు ఇక్కడ జీవిస్తున్నారు. వారి వయసు ఆరేళ్ళ నుంచి ఎనభై యేళ్ళ వరకు ఉంటుంది . ఉదయం ఐదుగంటలకు కొమ్ములు, డ్రమ్స్, లాంటి వివిధ గిరిజన సంగీత వాయిద్యాలతో చేసే ప్రార్థన తవాంగ్ చూ లోయలో ప్రతిధ్వనిస్తూ ప్రకృతి చేస్తున్న సంగీత కచేరీలాగా వినిపిస్తుంది. దీనితోనే ఇక్కడి ప్రజల దినచర్య మొదలవుతుంది. తూర్పు హిమాలయాల మధ్యలో పదకొండువేల అడుగుల ఎత్తులో ప్రార్థనా శబ్దాల ధ్వని వింటే శాంతి అంటే ఏమిటో అర్థమవుతుంది.
ఇక్కడి బౌద్ధ విద్యార్థులకు బౌద్ధ తత్వశాస్త్రం, ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, క్యాలిగ్రఫీ నేర్పిస్తారు కాబట్టి దీనిని లామా లేదా బౌద్ధ విశ్వ విద్యాలయం అని కూడా పిలుస్తారు. ఒక వైపు మ్యూజియం ఉంది. ఇందులో నాలుగు వందల ఏళ్ళనాటి చేతితో రాసిన నూటా ఎనిమిది బౌద్ధ సంపుటాలు భద్రపరిచారు. ఆరవ దలైలామా ఉపయోగించిన వస్తువులు ఇక్కడ ఉన్నాయి. తోర్గ్యా పండుగలో ధరించే ముసుగులు ఇక్కడ ఉన్నాయి. ఇవి మూడు వందల ఏళ్ళనాటివి, ఒక్కొక ముసుగు పది కిలోల బరువు ఉంటుందట. జనవరి 10, 11, 12 తేదీలలో మూడురోజుల పాటు ప్రజల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కొరకు ఈ పండుగను నిర్వహిస్తారట. బౌద్ధ సన్యాసులు అప్పుడు ఈ ముసుగులు ధరించి నృత్యం చేస్తారట.
1959 లో పధ్నాలుగవ దలైలామా టిబెట్ నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చేటప్పుడు ఈ మొనాస్టరీలోనే కొన్ని రోజులు ఉన్నాడు. 1962 లో ఇండో – చైనా యుద్ధసమయంలో చైనా సైన్యం ఇక్కడికి వచ్చింది. బౌద్ధ సన్యాసులను గౌరవించి ఈ మొనాస్టరీకి ఎలాంటి హాని చేయలేదు. ఇది ఇప్పటికీ బౌద్ధ సన్యాసుల అధీనంలోనే ఉన్నది. కానీ 1951 నుంచి భారత పురావస్తు సర్వే శాఖ ( ఏ ఎస్ ఐ ), అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రెండూ దీనిని కాపాడుతున్నాయి.మొనాస్టరీ చుట్టూ నూటాఎనిమిది ప్రార్థనా చక్రాలు ఉన్నాయి. ఒక్కొక్క దానిని తిప్పితే ఒక మంత్రం చదివిన పుణ్యం వస్తుందని స్థానికుల నమ్మకం. బౌద్ధ సన్యాసులు లోపల వెన్నతో దీపాలు వెలిగిస్తారు. పైనుంచి చూస్తే కింద తవాంగ్ గ్రామం కనిపిస్తుంది.ఈ మొనాస్టరీకి సంబంధిoచిన కథ ఒకటి స్థానికంగా ప్రచారంలో ఉంది.
అదే ‘ స్కై హార్స్’ కథ. క్రీశ పదిహేడవ శతాబ్దంలో ఐదవ దలైలామా మెరాగ్ లామా మెరాగ్ లోడ్రే గియాస్టోను పిలిచి అరుణాచల్ లో పెద్ద బౌద్ధ విహారాన్ని నిర్మించమని ఆదేశించాడట. అంతా హిమాలయ పర్వత ప్రాంతం. ఎక్కడ నిర్మించాలో అర్థం కాలేదు. అయినప్పటికీ చోటు ఎంపిక చేసి మూడు సార్లు మూడు చోట్ల పునాది వేశారు. మరుసటి రోజుకు ఆ రాళ్ళు కిందపడిపోయాయట. ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్న లామా కలలో ఒకరోజు రాత్రి తెల్లని గుర్రం కనిపించి, ” నా గిట్టల గుర్తులు ఎక్కడ కనిపిస్తే అక్కడ మొనాస్టరీ నిర్మించు. అదే అతి పవిత్ర స్థలం.” అని చెప్పిందట. తెల్లవారి ఉదయం ఆయనకు నిజంగానే తెల్లని గుర్రం కనిపించింది. దానిని స్థలo ఎంపికకొరకు వదిలిపెట్టారట. అది పరిగెడుతూ పరిగెడుతూ తవాంగ్ చూ లోయలోని ఒక కొండ చుట్టూ మూడుసార్లు తిరిగి అదృశ్యమై పోయిందట. అక్కడ ఇప్పటికీ గుర్రం గిట్టల గుర్తులు ఉండడం విశేషం. అప్పుడు లామా మెరాగ్ లోడ్రే గియాస్టో క్రీ శ 1680 – 1681లో ఈ మొనాస్టరీని నిర్మించారు. అందుకే కాబోలు ముంపాజాతి ప్రజలు గుర్రాన్ని పవిత్ర జంతువుగా భావిస్తారు. కేదార్ నాథ్, యమునోత్రి లాంటి ప్రదేశాలకు గుర్రాలపైన వెళ్ళినట్లుగా అరుణాచల్ ప్రదేశ్ లో వెళ్ళరు. మాకు చాలా గుర్రాలు, జడల బర్రెలు, గాడిదలు కనిపించాయి. నవంబర్ నుంచి జనవరి మధ్యలో అయితే మంచు చిరుతలు కనిపిస్తాయని రాహుల్ చెప్పాడు.
ఆరవ దలైలామా త్స్యో నాంగ్ గియాస్టో తవాంగ్ చూ లోయ లోని మొంపాతెగ కుటుంబంలో 1683 – 1706 ప్రాంతంలో జన్మించారు. ఇప్పటికీ మొంపా కుటుంబంలో రెండవ సంతానం మగబిడ్డ పుడితే ఆ పిల్లవాడిని మూడేళ్ల తర్వాత బౌద్ధమతానికి విరాళంగా ఇవ్వడం ఆచారంగా వస్తోందని తెలిసి ఆశ్చర్యపోయాను. నేను వెళ్ళినప్పుడు కూడా ఒక స్థానిక కుటుంబం మూడు, నాలుగేళ్ళ వయస్సు పిల్లవాడిని తీసుక వచ్చి ప్రస్తుతం అక్కడున్న లామాతో పూజ చేయించడం చూసి, మన దగ్గర జరిపే ” పుట్టువెంట్రుకలు తీయడం ” లాంటిదేదో చేస్తున్నారని అను కున్నాను. రాహుల్ ను అడిగితే అసలు విషయం తెలిసింది. ఇదే విషయాన్ని మేము బసచేసిన ఇంటి యజమాని రోమాను అడిగి నిర్ధారించు కున్నాను. వాళ్ళ బంధువుల అబ్బాయిని కూడా ఇచ్చారని, ప్రస్తుతం ఆ అబ్బాయి జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో ఉన్నాడని చెప్పింది. అలా ఇవ్వని పక్షంలో పదిలక్షల జరిమానా చేస్తారట. సాయంత్రం ఏడుగంటలకు ముంపా సాంస్కృతిక కార్య క్రమానికి వెళ్ళాo. వీళ్ల సంస్కృతిలో జడల బర్రెలు, మంచు చిరుతలు భాగం. కాబట్టి వాటితోనే ఆ కార్యక్రమం ఆద్యంతం నలభై నిముషాలు సాగింది. కళాకారులు చాలా రక్తి కట్టించారు.





