– ఉద్యమకారుల నడుమ ఘనంగా జాతీయ పతాకావిష్కరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం(అమరదీపం) ప్రాంగణంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ వైభవంగా జరిగింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్మరణలో, ఉద్యమకారుల సమక్షంలో మువ్వన్నెల జెండాను ఎగురవేయడం ఒక అరుదైన, భావోద్వేగ ఘట్టంగా నిలిచింది. కార్యక్రమానికి కమిటీ గౌరవ చైర్మన్ డాక్టర్ కె.కేశవరావు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, ఎస్.రాములు నాయక్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డాక్టర్ కేశవరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేశవరావు, సభ్యులు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలతోపాటు, స్వరాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరుల ఆశయాలను స్మరించుకోవడానికే ఈ పతాకావిష్కరణ నిర్వహించినట్లు తెలిపారు. ఉద్యమకారులకు ఇచ్చిన మాట ప్రకారం గుర్తింపు కమిటీని ఏర్పాటు చేసి అమరదీపం వేదికగా పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రోత్సహించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి కమిటీ, ఉద్యమకారులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఘనంగా శోభన్ రెడ్డి జన్మదిన వేడుకలు
పతాకావిష్కరణ అనంతరం ఉద్యమ నేత, కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మోతె శోభన్ రెడ్డి జన్మదిన వేడుకలను అక్కడికి తరలివచ్చిన ఉద్యమకారులు, ప్రజాసంఘాల నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్, సభ్యులు శోభన్ రెడ్డికి శాలువా కప్పి పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు, కవులు కళాకారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




