– వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్
– ‘రైతు నేస్తం’లో ఉచితంగా ప్రకృతి వ్యవసాయ కిట్ల పంపిణీ
– రైతుల కోసం ‘టీజీ ఆర్గానిక్స్’ యాప్ రూపకల్పన
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: ప్రకృతి సేద్యం ద్వారా సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, వీటిని సాగు చేయడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్రమోహన్ తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ 107వ ఎపిసోడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకం కింద ఎంపిక చేసిన రైతులకు ఆయన ప్రకృతి వ్యవసాయ కిట్లను పంపిణీ చేశారు. ఖరీఫ్ సీజన్‌లో ఏడు రకాల సన్న వరి వంగడాలు పండించిన రైతులకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ అందించనుందని తెలిపారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు సంబంధిత డీలర్ల వద్ద, సొంత విత్తనాలు వాడిన వారు వ్యవసాయ విస్తీర్ణాధికారి వద్ద స్వీయ ధ్రువీకరణ పత్రం ద్వారా వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. రైతులు తమ పొలాల వద్దకు వచ్చే వ్యవసాయ వాలంటీర్లకు పంట సాగు వివరాలు అందించాలని కోరారు. నమోదు పూర్తి కాగానే రైతులకు ఫోన్‌కు సందేశం వస్తుందని, వివరాల్లో ఏమైనా వ్యత్యాసాలు ఉంటే 72 గంటల్లోపు వ్యవసాయ విస్తీర్ణాధికారిని కలిసి సరిచేసుకోవాలని కోరారు.
‘టీజీ ఆర్గానిక్స్’ యాప్ ప్రారంభం
ఈ సందర్భంగా సురేంద్రమోహన్ మాట్లాడుతూ.. సేంద్రియ ఉత్పత్తులను దళారీల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకే విక్రయించేలా ‘టీజీ ఆర్గానిక్స్’ యాప్‌ను రూపొందించినట్లు వెల్లడించారు. వినియోగదారులు నేరుగా రైతుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. రైతులు ‘రైతు ఉత్పత్తిదారుల సంఘాలు’ (FPO)గా ఏర్పడి స్వయంగా మార్కెటింగ్ చేసుకున్నప్పుడే ఆదాయం పెరుగుతుందని సూచించారు.
గ్రామస్థాయిలో బయో రిసోర్స్ సెంటర్లు
వ్యవసాయ శాఖ సంచాలకుడు డాక్టర్ బి.గోపి మాట్లాడుతూ గ్రామస్థాయిలో బయో రిసోర్స్ సెంటర్లు ఏర్పాటు చేసి ఘన జీవామృతం, జీవామృతం తయారీపై శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌నినో ప్రభావం, నీటి లభ్యత, సన్న రకాలు మరియు కూరగాయల సాగు యాజమాన్యంపై ఐఎండీ, పేజీటీఏయూ శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు చేశారు. అనంతరం రైతులతో అధికారులు ముఖాముఖి నిర్వహించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





