– కాంగ్రెస్ నిర్వహించేది ‘యాంటీ-భారత్ సమ్మిట్’
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు చెబుతున్న ‘భారత్ సమ్మిట్’ ద్వారా రాష్ట్రానికి ఒక్క పెట్టుబడిదారుడు కూడా రావడం లేదని, పరిశ్రమల స్థాపన జరగడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు విమర్శించారు. నాగోల్లో గురువారం జరిగిన భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) రాష్ట్ర కార్యవర్గ సమావేశం(యువ సంవాద్)లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కాంగ్రెస్ తీరుపై, శుక్ర, శనివారాల్లో జరిగే ‘భారత్ సమ్మిట్’పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేవలం ప్రపంచంలో అరాచకాన్ని సృష్టించే ఉద్దేశంతో పనిచేస్తున్న ప్రోగ్రెసివ్ అలయన్స్, ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ వంటి సంస్థల ప్రతినిధులు మాత్రమే ఈ సదస్సుకు హాజరవుతున్నారని తెలిపారు. బంగ్లాదేశ్, నేపాల్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో జరిగిన అస్థిరత, ఆందోళనల వెనుక ఇలాంటి సంస్థల హస్తం ఉందని, సల్మాన్ ఖుర్షీద్, శ్యామ్ పిట్రోడా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సు రాహుల్ గాంధీ అభిప్రాయాలను వినడానికి మాత్రమేనని పేర్కొన్నారు. ఎందులోనూ స్పష్టమైన వైఖరి, దృక్పథం, విజన్ లేని రాహుల్ కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ముమ్మాటికీ ‘యాంటీ-భారత్ సమ్మిట్’ అని ఆయన అభివర్ణించారు. దేశానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వ్యాసాలు రాసిన నార్వేకు చెందిన జర్నలిస్టు హెల్లె లింగ్ను కాంగ్రెస్ పార్టీ ఈ సదస్సుకు ఆహ్వానించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ వ్యతిరేక వైఖరి ఉన్న వ్యక్తులకు వీసా రద్దు సరైన నిర్ణయమేనని సమర్థించారు.
నల్ల జెండాలతో నిరసన తెలపాలి
రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారంటీలు, ఉద్యోగాల పేరిట హామీలిచ్చి అమలు చేయకుండా మోసం చేసిన రాహుల్ గాంధీకి హైదరాబాద్లో అడుగుపెట్టే నైతిక హక్కు లేదని రామచందర్రావు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, ఈ సదస్సును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసనలు తెలపాలని, దిష్టిబొమ్మలను దహనం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. యువత, జెన్ జీ ఆలోచనా విధానంపై మాట్లాడుతూ 1997-2012 మధ్య జన్మించిన జెన్ జీ యువత 2024 ఎన్నికల్లో ఓటు హక్కు పొంది బీజేపీకి అండగా నిలిచినట్లు చెప్పారు. 2024లో జరిగిన 1,100 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 850 స్థానాలను గెలుచుకోగా కాంగ్రెస్ కేవలం 150 స్థానాలకే పరిమితమైందని, యువత ఎవరివైపు ఉందో దీన్నిబట్టే అర్థమవుతోందని అన్నారు. ప్రస్తుతం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్న వారు నిజమైన జెన్ జీ కాదని, వారు ఇతర శక్తుల ప్రోద్బలంతో పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఒక దేశం సోషలిజం, కమ్యూనిజం లేదా క్యాపిటలిజం వల్ల అభివృద్ధి చెందదని, జాతీయవాదం మాత్రమే దేశాన్ని ముందుకు నడిపించగలదని ఆయన ఉద్ఘాటించారు. చిన్న దేశమైన ఉక్రెయిన్ శత్రువులను ఎదుర్కోవడం వెనుక, అణుబాంబు దాడుల తర్వాత జపాన్ అగ్రగామిగా ఎదగడం వెనుక బలమైన జాతీయవాద స్ఫూర్తి ఉందని, మన యువతలో కూడా అదే జాతీయవాద భావనను పెంపొందించాలని పిలుపునిచ్చారు. 2014కు ముందు 6 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు నేడు 3 శాతానికి తగ్గిందని(ప్రపంచ సగటు 4.8 శాతం కంటే తక్కువ), నేడు భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందంటూ మోదీ ప్రభుత్వం పన్నెండేళ్లుగా సాధించిన విజయాలను వివరించారు. క్రీడల రంగంలోనూ ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, పతకాలు సాధించే స్థాయికి దేశాన్ని తీసుకెళ్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, పాలసీ రీసెర్చ్ అంశాలను యువమోర్చా కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




