– పుష్కరాల ఏర్పాట్లు ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలి
– ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అలాగే గోదావరి పుష్కరాల ఏర్పాట్లను వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తి చేయా లని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరంలోని దేవస్థానం ఈవో కార్యాలయంలో ఆయన పలు శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.200 కోట్ల నిధులు మంజూరు చేసిందని, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.1,000 కోట్లతో గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తెలిపారు. కాళేశ్వరం క్షేత్రానికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని పుష్కరాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. అభివృద్ధి పనులకు అవసరమైన మట్టి సేకరణతోపాటు ఇతర అనుమతుల ప్రక్రియను అటవీ శాఖ అధికారులు సమన్వయంతో వేగవంతం చేయాలని కోరారు. ఇంజినీరింగ్ అధికారులు కాళేశ్వరంలోనే ఉంటూ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. పనుల పురోగతిని సబ్ కలెక్టర్ గౌరవ్ శర్మ ఎప్పటికప్పుడు పరిశీలించి సమన్వయం చేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి కాళేశ్వరం క్షేత్ర ప్రాశస్త్యాన్ని మరింత పెంచాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, ఎస్పి సిరిశెట్టి సంకీర్త్, ధార్మిక సలహాదారు గోవింద హరి, అటవీ శాఖ అధికారి కిష్టా గౌడ్, కాటారం సబ్ కలెక్టర్ గౌరవ్ శర్మ, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ దండు రమేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు, ఆలయ స్థపతి బాలసుబ్రహ్మణ్యం, దేవాలయ చైర్మన్ మోహన్ శర్మ, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పంతగాని తిరుమల, సింగిల్ విండో చైర్మన్ తిరుపతి రెడ్డి, దేవస్థానం డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, దేవాదాయ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ అండ్ బి. ప్రణాళిక, ఆర్కిటెక్చర్ సూర్య నారాయణమూర్తి, సర్పంచ్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





