– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఫైర్
– తార్నాక డివిజన్‌లో బీజేపీలో చేరిన పలువురు విద్యావంతులు, స్థానికులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : రాబోయే మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే కేంద్ర పథకాలు మరింత పారదర్శకంగా ప్రజలకు అందుతాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అందుతున్న సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై విద్యావంతులు, మేధావులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. తార్నాక డివిజన్‌లో మాదాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో పలువురు విద్యావంతులు, స్థానిక ప్రముఖులు బీజేపీలో శుక్రవారం చేరగా వారికి ఆయన కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని గొప్పలు చెప్పి గత బీఆరఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ మహానగరాన్ని విషాద నగరంగా మార్చేశాయని ధ్వజమెత్తారు. జీహెచఎంసీ పరిధిలో మౌలిక వసతులు లేక, అధ్వానపు రోడ్లు, అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భాగ్యనగరం అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారన్నారు. రాబోయే మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో ప్రజలు బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





