– గచ్చిబౌలిలో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్
– టీజీఎల్ఐపీసీ సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : రాష్ట్రంలో లెదర్ ఇండస్ట్రీని మరింత బలోపేతం చేయడంతోపాటు ఔత్సాహిక ఎస్సీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు గచ్చిబౌలిలో ప్రత్యేకంగా కామన్ ఫెసిలిటీ సెంటర్(సీఎఫ్‌సీ)ను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్‌లో సుమారు వేయిమందికి ఉపాధి కల్పించేలా అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో పర్యావరణహిత చర్మ శుద్ధి కర్మాగారాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్(టీజీఎల్ఐపీసీ) ఉన్నతాధికారులతో సచివాలయంలో ఆయన శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో లెదర్ ఇండస్ట్రీ అభివృద్ధికి, ఆర్టిజన్లను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఎస్సీ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. అంతర్జాతీయ హంగులతో గచ్చిబౌలిలో హబ్ అండ్ స్పోక్ విధానంలో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న సీఎఫ్‌సీ ద్వారా రాష్ట్రంలోని ఆర్టిజన్ల ఉత్పత్తులకు అదనపు విలువ(వాల్యూ యాడెడ్)ను జోడిస్తామన్నారు. డిజైనింగ్ మొదలు బ్రాండింగ్ వరకు వారికి మార్గనిర్దేశం చేస్తామన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట, ఆర్మూర్‌లో మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలెప్మెంట్ ప్రోగ్రాం(ఎంఎసఈసీడీపీ) కింద ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో లిడ్ క్యాప్‌కు ఎక్కడెక్కడ భూములు కేటాయించారు.. వాటి ప్రస్తుత పరిస్థితి ఏంటనే అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన నివేదిక అందజేయాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, టీజీఎల్ఐపీసీ వీసీ అండ్ ఎండీ ప్రశాంత్ కుమార్, తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆరేపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





