– సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క
– మంత్రులు, పార్టీ సీనియర్లు, ప్రముఖులు, జర్నలిస్టులకు రాఖీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : ఒక ఆదివాసి బిడ్డగా, మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఆడబిడ్డగా తనను ఈ స్థాయికి తీసుకురావడంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర, కృషి ఎంతో ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క చెప్పారు. ఆయన అందించిన సహకారం, ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువలేనన్నారు. ములుగు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, సమ్మక్కసారలమ్మ దీవెనలతో తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేస్తున్నానని మంత్రి సీతక్క అన్నారు. తనను ఇంతటి స్థాయికి తీసుకొచ్చిన ములుగు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. రాఖీ పండగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి శుభా కాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో శుక్రవారం జరిగిన రాఖీ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ సోదరుడు సంతోషంగా, ఆనందంగా ఉండాలని ప్రతీ ఆడబిడ్డ కోరుకుంటుందని, వారి రక్షణ కోసం కట్టే రాఖీ ప్రేమ, ఆప్యాయత, నమ్మకానికి ప్రతీక అని అన్నారు. తాను పన్నెండేళ్లుగా రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్నానని మంత్రి సీతక్క తెలిపారు. ప్రతి ఏడాది రాఖీ పండగ సందర్భంగా ములుగు నియోజకవర్గ ప్రజలకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపే సంప్రదాయాన్ని కొనసాగిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన రాఖీ వేడుకల్లో మంత్రి కొండా సురేఖతోపాటు కాంగ్రెస్ మహిళా నాయకులు, బ్రహ్మకుమారీలు, పలువురు మహిళలు సీఎం రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. వందలాది మంది మహిళలు రాఖీలు కట్టేందుకు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపికగా అందరి నుంచి రాఖీలు స్వీకరించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం నివాసంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు సీతక్క రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపి మీడియాతో మాట్లాడారు. మహిళల శ్రమకు గుర్తింపు, గౌరవం, భద్రతతో కూడిన వాతావరణం ప్రతి చోటా ఉండాలన్నారు. తన హోదాను పక్కనపెట్టి సామాన్యులకు సైతం ఆమె రాఖీలు కట్టడంతో వారంతా ఆనందం వ్యక్తం చేశారు. అంతకుముందు మంత్రి సీతక్క తన అధికారిక నివాసం ప్రజాభవన్‌లోనూ రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తన వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యుల మాదిరిగా తనతో కలిసి పనిచేస్తున్న సిబ్బందితో ఆత్మీయంగా మెలిగిన మంత్రి వారి సేవలను అభినందించారు. ప్రజా జీవితంలో తనతో కలిసి పనిచేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, ఇతర ప్రముఖులకు కూడా మంత్రి సీతక్క రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ బంధం కేవలం అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధానికే పరిమితం కాదని, పరస్పర గౌరవం, నమ్మకం, ఆప్యాయత, ఒకరికి ఒకరు అండగా నిలిచే బంధానికి ప్రతీక అని అన్నారు. తనకు రాఖీలు కట్టిన మహిళా సిబ్బందికి మంత్రి సీతక్క నూతన వస్త్రాలను బహూకరించారు. మహిళా సిబ్బందితో ఆప్యాయంగా మాట్లాడి పండగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
మహిళా కమిషనప్ చైర్‌పర్సన్ గద్వాల రాఖీ
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి, సభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బ్రహ్మకుమారీస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, మలక్‌పేట్‌లోని గవర్నమెంట్ హైస్కూల్ ఫర్ ది బ్లైండ్ గర్ల్స్ విద్యార్థినులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




