కేంద్ర నిధుల సాధనకు ప్రాధాన్యత ఇవ్వాలి

– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరితగతిన రాబట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో, యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎస్ఎస్ అమలు, ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ, వ్యయ వివరాల నమోదు, సింగిల్ నోడల్ ఏజెన్సీ(ఎస్ఎన్‌ఏ) ఖాతాల ముగింపు తదితర అంశాలపై సీనియర్ అధికారులతో సమీక్షించారు. నిధుల విడుదలకు అవసరమైన అన్ని ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేసి పెండింగ్‌లో ఉన్న అంశాలను తక్షణమే పరిష్కరించాలని సీఎస్ సూచించారు. వ్యవసాయం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్య, ఉపకార వేతనాలు, హోం, గ్రామీణ నీటి సరఫరా, గృహ నిర్మాణం, మున్సిపల్ పరిపాలన , పట్టణాభివృద్ధి, రవాణా, పశుసంవర్ధక, మత్స్య తదితర శాఖల వారీగా కేంద్ర నిధుల పరిస్థితిని ఆయన సమీక్షించారు. ప్రతి శాఖలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న ప్రక్రియలు, వ్యయ వివరాల నమోదు, ఎసఎనఏ ఖాతాల ముగింపు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.
కేంద్ర నిధుల సాధనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
ముఖ్యమంత్రి సమీక్షా కార్యక్రమం, సీఎం డ్యాష్‌బోర్డులో కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశాల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అన్ని శాఖల కార్యదర్శులు తమ పరిధిలోని అంశాలపై తక్షణమే సమీక్ష నిర్వహించి నిధుల విడుదలకు అవసరమైన ప్రక్రియలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్ అంశాల పరిష్కారానికి సంబంధిత కేంద్ర అదనపు కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాలని, అవసరమైన సందర్భాల్లో తన తరఫున డీవో లేఖలు పంపిస్తానని తెలిపారు. దిల్లీలోని సంబంధిత కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో తాను కూడా మాట్లాడి రాష్ట్రానికి నిధుల విడుదలకు కృషి చేస్తానని వెల్లడించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అందుబాటులో ఉన్న నిధులు రాష్ట్రంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును మరింత బలోపేతం చేస్తాయంటూ నిధుల సాధనలో జాప్యం జరగకుండా అన్ని శాఖలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఎస్ ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్‌లు బి.ఎం.డి.ఎక్కా, దానకిషోర్, ముఖ్య కార్యదర్శులు రాహుల్ బొజ్జా, సందీప్ కుమార్ సుల్తానీయా, యోగితారాణా, అహ్మద్ నదీమ్, క్రిస్టినా చొంగ్తు, కార్యదర్శులు గౌరవ్ ఉప్పల్, సురేంద్ర మోహన్, శృతిఓజా, దివ్య, ఇలంబర్తి, లా సెక్రటరీ పాపిరెడ్డి, విజయేందిర, కాంతి వెస్లీ, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *