– గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామనడం పెద్ద జోక్
– రాహుల్, రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : రాహుల్ నోట వినిపించిన ఆరు గ్యారంటీలన్నీ గాలి మూటలుగానే మిగిలిపోయాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. వరంగల్, కామారెడ్డి డిక్లరేషన్ ల అమలు సంగతి సరేసరి.. ఆరోగ్యశ్రీ పథకానికి పైసలివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది నిజం కాదా అని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకే ఆరోగ్య భద్రత లేదు, జర్నలిస్టుల హెల్త్ కార్డులకే దిక్కు లేదు అని విమర్శించారు.. ఆటో వర్కర్లను ఆదుకుంటామని గాలికొదిలేసిన విషయం మర్చిపోయారా అని అడిగారు. ఇక గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామంటే నమ్మేదెలా అని ప్రశ్నంచారు. గిగ్ వర్కర్లకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు సరే.. నిధులేవి అని నిలదీశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ సంక్షేమ బోర్డులకు చిల్లిగవ్వ అయినా ఇచ్చారా అని అడిగారు. ఆటోడ్రైవర్లు, గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తూ రాజస్థాన్ తరహా చట్టాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏమైంది అని ఆయన అడిగారు. రాజస్థాన్ లో గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని, ఓలా, ఉబెర్, వంటి అగ్రిగేటర్ సంస్థల నుంచి ప్రతి లావాదేవీపై నిర్ణీత శాతం సంక్షేమ రుసుము వసూలు చేస్తోందని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో గిగ్ వర్కర్లకు అర్హత కల్పిస్తోందని, కంపెనీలు చెల్లింపులు చేయకపోయినా, ఇతర సమస్యలు ఎదురైనా ఫిర్యాదు చేస్తే పరిష్కరించే వ్యవస్థ ఉందదని, చట్టాన్ని ఉల్లంఘించే అగ్రిగేటర్ సంస్థలకు పెద్ద ఎత్తున జరిమానా విధిస్తున్నదని వివరించారు. తెలంగాణలో గిగ్ వర్కర్లకు ఆ సౌకర్యాలన్నీ కల్పించే దమ్ముందా అని ప్రశ్నించారు. గిగ్ వర్కర్లు తెలివైన వాళ్లు.. ఎవరు ఎలాంటి వాళ్లో తెలుసుకునే మానసిక పరిపక్వత కలిగినోళ్లు అని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ప్రతినెలా గిగ్ వర్కర్లకు భ్రుతి ఇవ్వాలి, ఓలా, ఉబెర్, స్విగ్గీ, జొమాటో వంటి దళారీ సంస్థలకు కమీషన్ ఇచ్చే పనిలేకుండా కస్టమర్లు చెల్లించే సొమ్ము అంతా గిగ్ వర్కర్లకు అందేలా చర్యలు తీసుకోవాలి, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలి అని బండి డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





