– నిన్నటి ఘటనపై వాస్తవాలు బయటకు రావాలి
– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : అసెంబ్లీ వద్ద సోమవారం జరిగిన ఘటనలకు సంబంధించి వాస్తవాలు బయటకు రావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క డిమాండ్ చేశారు. శాసనసభలో మంగళవారం ఆమె మాట్లాడుతూ స్పీకర్‌ను దూషించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇప్పుడు మాట మారుస్తున్నారన్నారు. మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టుకుని రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరగాలని కోరారు. పొట్టకూటి కోసమో, లేక ప్యాషన్‌తోనో మహిళలు పోలీసులు అయితే వారిపై చేతులు వేసి అవమానపరుస్తారా అని నిలదీశారు. మహిళా పోలీసుల మీద కేటీఆర్ చేతులు వేశారంటూ కావాలంటే విజువల్స్‌ను సభకు సమర్పిస్తానన్నారు. మహిళా పోలీసుల మీద చేతులు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో రభస దేనికి అని ప్రశ్నించారు. సొంత ఇంటి ఆడబిడ్డ కవితను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారో వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. శాసనమండలిలో మంత్రి సీతక్క మాట్లాడుతూ బీఆర్ఎస్ తీరుపై నిప్పులు చెరిగారు. స్పీకర్‌ను దూషించిన వారిని సభ నుంచి బహిష్కరించాలన్నారు. మహిళా పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి చేతులు వేసి నెట్టివేశారని, దీనిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా వ్యవహరిస్తే విచారణ జరిపి చర్యలు తీసుకోండన్నారు. గిరిజన, దళిత వ్యతిరేక నైజం మీదేనని, ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలు ఎదిగితే ఓర్చుకోలేని భూస్వామ్య విధానం బీఆర్ఎస్ దని అన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కేటీఆర్ మహిళా పోలీసులపై చేతులు వేశారని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ వ్యక్తులను దూషిస్తే యాక్ట్ వర్తిస్తుందన్నారు. వీళ్లకు తల్లులు లేరా.. వీళ్ల తల్లులను తిడితే వారు బాధపడరా అని అడిగారు. 2018లో స్పీకర్‌పై దాడి చేశారని నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అర్టికల్ 194(3) ప్రయోగించి సస్పెండ్ చేశారు.. అదే రూల్ బీఆర్ఎస్ సభ్యులకు వర్తింప చేయాలన్నారు. అసెంబ్లీలో హరీష్ రావు స్పీకర్ పోడియం మీదకు ఉరుకుతున్నారంటూ ఏం.. స్పీకర్ ను కొడుతరా అని సీతక్క ప్రశ్నించారు. ని నైతిక విలువలు ఉండాలి.. సభ సంప్రాదాయాలు ఉండాలి.. ఇప్పటివరకు స్పీకర్‌కు క్షమాపణ చెప్పలేదు.. బీఆర్ఎస్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నా అని మంత్రి సీతక్క అన్నారు.
గాయపడ్డ మహిళా పోలీసులకు పరామర్శ
అసెంబ్లీ వద్ద సోమవారం జరిగిన తోపులాటలో గాయపడిన మహిళా పోలీసులను మంత్రి సీతక్క మంగళవారం పరామర్శించారు. ఘటన పూర్తి వివరాలను మంత్రికి మహిళా పోలీసు అధికారులు వివరించారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను అసభ్యంగా తాకారంటూ ఆ విజువల్స్ చూపి మంత్రి సీతక్కకు ఫిర్యాదు చేశారు. టీ షర్టులు విసిరేసి మీదిమీదికి వచ్చారని, విధి నిర్వహణలో చాలా ఇబ్బందులు పడ్డామని మంత్రికి వివరించారు. తాము అధికారంలోకి వచ్చాక అంతు చూస్తామని బీఆర్ఎస్ నాయకులు బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఫొటోలు, విజువల్స్ చూసి తమ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారని మహిళా పోలీసులు తెలిపారు. ఇలాంటి డ్యూటీలు చేయాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తున్నదన్నారు. తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మహిళా పోలీసులకు మంత్రి సీతక్క ధైర్యం చెప్పారు. మీ డ్యూటీ మీరు చేయండి.. ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





