– గవర్నర్కు బీజేపీ ప్రతినిధి బృందం వినతి
– అసెంబ్లీలో ఒక్క రోజైనా ఫీజు బకాయిలపై చర్చ జరపాలి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థుల రూ.15వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ బీజేపీ ప్రతినిధి బృందం లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు నేతృత్వంలో ఈ ప్రతినిధి బృందం గవర్నర్ను కలిసింది. గవర్నర్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలన నుంచి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ఎదురుచూస్తూ తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. హైకోర్టు చీవాట్లు పెట్టడంతోపాటు బీజేపీ చేపట్టిన నిరంతర ఆందోళనలు, నిరసన కార్యక్రమాల వల్లే ఈ విద్యాసంవత్సరం కొత్తగా చేరిన విద్యార్థులకు నామమాత్రంగా అయినా నిధులు మంజూరయ్యాయని, అయితే దాదాపు రూ.15వేల కోట్ల పాత బకాయిలు విడుదల కాకపోవడంతో లక్షలాదిమంది విద్యార్థులకు కళాశాలల నుంచి సర్టిఫికెట్లు అందక భవిష్యత్తు అంధకారంలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు రాకపోవడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు లెక్చరర్లు, ప్రొఫెసర్లకు సగం జీతాలతోనే నడిపిస్తున్నాయని, దీనివల్ల రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయే ప్రమాదం ఏర్పడిందని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా విద్యా వ్యవస్థను ఇలా నిర్వీర్యం చేయడంపై రామచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను కాపాడేందుకు ఫీజు బకాయిలను విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, తగిన సలహాలు ఇవ్వాలని గవర్నర్ను కోరినట్లు చెప్పారు. దీనిపై సానుకూలంగా స్పందించిన గవర్నర్ ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకునేలా సలహా ఇస్తానని హామీ ఇచ్చారని వెల్లడించారు. అలాగే శాసనసభలో జరుగుతున్న పరిణామాలపై రామచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడానికి కాంగ్రెస్, బీఆ ర్ఎస్ పార్టీలే కారణమని, అందుకే ఆ పార్టీలు కుమ్మక్కై ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగకుండా ప్రజలకు సంబంధం లేని అంశాలపై మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో కనీసం ఒక్క రోజైనా పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రత్యేక చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం లాఠీఛార్జీలు, ముందస్తు అరెస్టులు, అక్రమ కేసులు బనాయిస్తోందని విమర్శించారు. నిన్నటి ఆందోళనలో పోలీసుల దాడితో తీవ్రంగా గాయపడి పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు హాస్పిటల్స్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్కు వినతిపత్రం అందజేశామని, ప్రభుత్వ స్పందన కోసం కొన్ని రోజులు వేచి చూస్తామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని రామచందర్ రావు హెచ్చరించారు. గవర్నర్ను కలిసిన బృందంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్.గౌతమ్ రావు, టి.వీరేందర్ గౌడ్, వేముల అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జయశ్రీ, డాక్టర్ కళ్యాణ్ నాయక్, రాష్ట్ర కార్యదర్శులు మహిపాల్ రెడ్డి, భరత్ ప్రసాద్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్చార్జి ఎన్.వి.సుభాష్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందేలతోపాటు నిన్నటి ఆందోళనలో పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన యువమోర్చా కార్యకర్తలు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





