– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
– దిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శితో భేటీ
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులను గణనీయంగా పెంచడంతోపాటు ఫిలిప్పీన్స్–తెలంగాణ మధ్య వాణిజ్య సంబంధాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి (క్యాబినెట్ మంత్రి హోదా) ఫ్రాన్సిస్కో పి. టు లారెల్ జూనియర్‌తో మంగళవారం సమావేశమయ్యారు. భారతదేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేసే సామర్థ్యం, ఆధునిక రైస్ మిల్లింగ్ వ్యవస్థ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. దీనిపై స్పందించిన ఫిలిప్పీన్స్ కార్యదర్శి లారెల్.. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున బియ్యం దిగుమతి చేసుకునే అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. బియ్యంతోపాటు తెలంగాణ నుంచి నాణ్యమైన విత్తనాలు, మాంసం ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడంపై కూడా ఫిలిప్పీన్స్ ప్రతినిధులు ఆసక్తి చూపారు. కొనుగోలు విధానాలు, నాణ్యతా ప్రమాణాలు, రవాణా, శానిటరీ నిబంధనలపై ఇరు దేశాల అధికారులు, పరిశ్రమ ప్రతినిధుల భాగస్వామ్యంతో త్వరలోనే స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు.
తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు ఆహ్వానం
డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ సమ్మిట్’కు హాజరు కావాల్సిందిగా ఫ్రాన్సిస్కో లారెల్‌కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానం అందించారు. అంతర్జాతీయ మార్కెట్లలో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులకు అవకాశాలు కల్పించడం వల్ల రాష్ట్రంలోని రైతులు, రైస్ మిల్లర్లు, విత్తన రంగానికి తీవ్ర ప్రయోజనం చేకూరుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





