– కేంద్ర మంత్రి బండి తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : తెలంగాణ శాసనసభలో జరుగుతున్న పరిణామాలపై, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతల వ్యవహారశైలిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభను ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కాకుండా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ బజారు భాష మాట్లాడటం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. నువ్వు కొట్టినట్లు చెయ్. నేను ఏడ్చినట్లు చేస్తా అన్నట్లుగా ఆ రెండు పార్టీలు కలిసి నాటకాలాడుతున్నాయని, ప్రజా సమస్యలను చర్చించకుండా సభా సమయాన్ని వృథా చేస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాను ఎప్పుడో కోల్పోయిందని, అసెంబ్లీకి రాని కేసీఆర్‌కు ఆ హోదా ఎందుకు అని ప్రశ్నించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయిచేసుకున్న ఎమ్మెల్సీ తాతా మధుతోపాటు ఇతర బీఆర్ఎస్ నేతలను వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని, స్పీకర్‌ను అసభ్య పదజాలంతో దూషించడాన్ని ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేరని అన్నారు. 22ఎ భూముల దందా, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగం, సాగునీటి కొరత, డీఏలు, 6 గ్యారెంటీల అమలు, నిత్యావసరాల ధరల పెరుగుదల వంటి కీలక అంశాలపై చర్చ జరపకపోవడం దుర్మార్గమన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు రక్తం కారేలా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రెండు పార్టీల అవినీతిని, డ్రామాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, రాష్ట్రంలో రాబోయే రోజుల్లో డబుల్ ఇంజిన్ బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





