– తాతా మధు, నవీన్ రెడ్డిల అరెస్టుపై మండిపడ్డ హరీశ్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : శాసన సభ్యులను, మండలి సభ్యులను సభలోకి రానివ్వకుండా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు క్రూరంగా దాడి చేసి, సభా హక్కులను కబళించారని బీఆర్‌ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు ఓ ప్రకటనలో మండిపడ్డారు. నేడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు మండలి సభ్యులు తాతా మధు, నవీన్ రెడ్డిలను అరెస్టు చేయడం తీవ్ర దురదృష్టకరమని అన్నారు. హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం అంటే చట్టాన్ని, న్యాయస్థానాలను ధిక్కరించడమేనని హరీశ్ రావు ఆరోపించారు. ప్రతిపక్షం అంటే ఎందుకింత కక్ష రేవంత్ రెడ్డి గారూ.. బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రాకుండా చేసి ప్రజా సమస్యలు సభలో చర్చకు రాకుండా చేయడమే మీ కుట్రా నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలు, 22-ఎ భూముల వ్యవహారం, భూ కుంభకోణాలు, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు, రైతుల సమస్యలు అసెంబ్లీలో చర్చకు వస్తాయనే భయంతోనే ఈ అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు. మహిళా శాసనసభ్యుల చీరలు లాగి, గొంతు పట్టుకున్న వారిపై చర్యలు తీసుకోకుండా రివర్స్‌లో బీఆర్‌ఎస్ నేతలపైనే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రతిపక్ష గొంతు నొక్కే ఎమర్జెన్సీ రాజ్యం అని విమర్శించారు. బీఆర్ఎస్ శాసనసభ్యుల ఇళ్లను పోలీసులు చుట్టుముట్టడాన్ని తప్పుబడుతూ ఖాకీలను ప్రైవేట్ సైన్యంగా వాడుకుంటూ రేవంత్ రెడ్డి రజాకార్ పాలనను, హిట్లర్ పాలనను తలపిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులు చేస్తూ ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తున్నారని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్‌ఎస్ పోరాటం ఆగదని, ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని హరీష్ రావు హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




