వారి వ్యాఖ్యలు సభా మర్యాదలకు విరుద్ధం

– సభాపతిని కించపరిచిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలి
– శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి దామోదర్
– మధుసూదన్, నవీన్ కుమార్ రెడ్డిలపై చర్యలకు రంగం సిద్ధం

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : శాసనమండలిలో బీఆరఎస్ సభ్యులు తాతా మధుసూదన్, ఎన్.నవీన్ కుమార్ రెడ్డిలు శాసనసభ ప్రాంగణంలోని గేట్ నంబర్ 3 సమీపంలో శాసనసభాపతిని ఉద్దేశించి అత్యంత అవమానకరంగా, కించపరిచేలా చేసిన దూషణలను ఈ సభ తీవ్రంగా ఖండిస్తున్నదంటూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శాసనసభలో మంగళవారం తీర్మానం ప్రవేశపెట్టారు. సభా మర్యాదలకు విరుద్ధమైన వ్యాఖ్యలపై నిరసన నమోదు చేస్తోందని అన్నారు. ఈ ఇద్దరు సభ్యులు మహిళల ఎదుట చొక్కాలు విప్పి అనుచితంగా, అసభ్యకరంగా, సమాజం తలదించుకునేలా ప్రవర్తించడాన్ని కూడా ఈ సభ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇలాంటి ప్రవర్తన శాసనమండలి సభ్యుని హోదాకు ఏమాత్రం తగదని, గౌరవ శాసన సభాపతి గౌరవం, అధికారం రాజ్యాంగబద్ధ హోదాకు తీవ్ర భంగం కలిగించిందని ఈ సభ భావిస్తోందని పేర్కొన్నారు. ఇది శాసనసభ గౌరవం, సభా హక్కులు, సంస్థాగత సమగ్రతకు విఘాతం కలిగించే చర్యగా ఈ సభ పరిగణిస్తోందన్నారు. రాజకీయ విభేదాలు, వ్యక్తిగత అభ్యంతరాలు, భిన్నాభిప్రాయాలు ఏవైనా సరే సభాపతి హోదాలో ఉన్న వ్యక్తి గౌరవాన్ని, అధికారాన్ని తగ్గించే ఉద్దేశంతో సభ్యులు ప్రవర్తించడాన్ని సమర్థించబోమని ఈ సభ స్పష్టం చేస్తోందని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించటాన్ని సహించేది లేదని సభ అభిప్రాయపడుతున్నదన్నారు. తమ పార్టీ సభ్యుల అనుచిత ప్రవర్తనకు ప్రతిపక్ష నేత కె.చంద్రశేఖర్ రావు బాధ్యత స్వీకరించి ఈ సభ హుందాతనం, సభా మర్యాదలను పరిరక్షించేందుకు శాసన సభాపతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సభ తీర్మానిస్తోందన్నారు. మధుసూదన్, నవీన్ కుమార్ రెడ్డిలు ప్రస్తుతం శాసన మండలి సభ్యులుగా ఉన్నందున ఈ తీర్మానం ప్రతితోపాటు సభ ముందు ఉంచిన ఆధారాలు, సభా హక్కుల ఉల్లంఘన నోటీసు, వాటికి సంబంధించిన కార్యకలాపాల వివరాలను శాసనమండలి చైర్మన్‌కు పంపించాలని ఈ సభ తీర్మానిస్తోందని తెలిపారు. ఈ అంశంపై శాసనమండలి సభా హక్కులు, సభా విధానాలు, క్రమశిక్షణకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా శాసనమండలి చైర్మన్ తదుపరి చర్యలు తీసుకోవాలని ఈ సభ తీర్మానిస్తున్నట్లు మంత్రి దామోదర్ తీర్మానంలో పొందుపరిచారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *