గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలి!

పటేల్‌ పట్వారీ వ్యవస్థ రద్దుతో తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. రికార్డులకు భద్రత లేకుండా పోయింది. భూముల లెక్కాపత్రం లేదు. జమాబందీ వల్ల భూములు, ప్రభుత్వ ఆస్తులకు లెక్క గట్టేవారు. సరిహద్దులు పక్కాగా ఉండేవి. కానీ అవన్నీ దెబ్బతిన్నా, వాటిని రక్షించే ప్రయత్నం చేయడం లేదు. కెసిఆర్‌ హయాంలో విఆర్‌వో వ్యవస్థ రద్దుతో ఉన్నది కూడా మాయం చేశారు. దీంతో తెలంగాణలో భూదోపిడీ కేసులు పెరిగాయి. ప్రభుత్వ, దేవాదాయ, అసైన్డ్‌ భూములు మాయమయ్యాయి. దీనికి సమాధానం చెప్పకుండా ధరణి పేరుతో మరింతగా దోపిడీ చేశారు. ఈ క్రమంలో మళ్లీ గ్రావిరీణ రెవెన్యూ వ్యవస్థకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ధరణిని రద్దు చేస్తూ భూ భారతి చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టంలో భాగంగా వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో సంస్కరణల పేరిట వీఆర్‌ఏ, వీఆర్వో లాంటి కీలక వ్యవస్థను రద్దు చేసింది. వాటి స్థానంలో ధరణి పోర్టల్‌ తీసుకొచ్చి భూములకు సంబంధించిన అనుమతులు మంజూరు చేసి రిజిస్టేష్రన్లు కొనసాగించారు. ఆ సమయంలో వీఆర్వోలు, వీఆర్‌ఏ లను ఇతర శాఖలకే కేటాయించారు.

ఆ సమాచారాన్ని సేకరించి అర్హత ఉన్న ఉద్యోగులను తిరిగి వీఆర్‌ఏ, వీఆర్వోలుగా విధుల్లోకి తీసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీలైనంత త్వరగా అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి పెట్టాలని తెలంగాణ ల్యాండ్‌ అడ్మినిస్టేష్రన్‌ చీఫ్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌  ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో మొత్తం 10,911 వరకు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని నిర్ణయం  తీసుకుంది. గతంలో ఉన్న వీఆర్‌ఏ, వీఆర్వోలను ఇతర శాఖల్లోకి బదిలీ చేశారు. వారిని తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకువచ్చేందుకు కసరత్తు మొదల్కెంది. వారికి తిరిగి వీఆర్‌ఏ, వీఆర్వోలుగా పోస్టింగ్‌ ఇచ్చే అవకాశం ఉంది. లేకపోతే రెవెన్యూ శాఖలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వేరే ఏద్కెనా కొత్త పేరుతో వారికి తిరిగి రెవెన్యూ అధికారులుగా పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. డిగ్రీ అర్హత ఉన్న మాజీ వీఆర్‌ఏ, వీఆర్వోలను రెవెన్యూ శాఖలో గతంలో నిర్వహించిన విధులు అప్పగించనున్నారు.

రెవెన్యూ శాఖకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను పునరుద్ధించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వీఆర్వో అధికారిని నియమించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాంతో పాత ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.  ఇటీవలే వీఆర్వోలు, వీఆర్‌ఏల పునరుద్ధరణకు గడువు విధిస్తూ తెలంగాణ ల్యాండ్‌ అడ్మినిస్టేష్రన్‌ చీఫ్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్వో, వీఆర్‌ఏలను తిరిగి అదే పోస్టుల్లోకి తీసుకోవడంతో పాటు రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. జూనియర్‌ రెవెన్యూ అధికారి పేరుతో ప్రతి గ్రామంలో విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తద్వారా భూమి సమస్యల పరిష్కారం అవుతాయని అధికారులు చెబుతున్నారు. ధరణి కారణంగా వేలాది మంది భూములు కోల్పోయారని, అందులో జరిగిన తప్పిదాలను గుర్తించి సమస్య పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి పలుమార్లు ప్రస్తావించారు.

-రేగటినాగరాజు
(సీనియర్‌ జర్నలిస్ట్‌)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page