రాజకీయ రహిత గుర్తింపుతోనే ఇందిరమ్మ జీవిత బీమా సార్థకత!

తెలంగాణ సమాజంలో అత్యధిక శాతం ప్రజలు గ్రామీణ, వ్యవసాయ ఆధారిత, అసంఘటిత రంగాలపైనే జీవనం సాగిస్తున్నారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకాల మరణం చెందితే, ఆ ఇల్లు రోడ్డున పడే పరిస్థితులు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేద కుటుంబాలకు ఆర్థిక కొండంత అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ఒక విప్లవాత్మకమైన అడుగు. రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఉచిత జీవిత బీమా కల్పించాలనే కేబినెట్ నిర్ణయం, నవంబర్ 19న దీని ప్రారంభోత్సవం సామాజిక భద్రతా రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది.

ఏ సంక్షేమ పథకమైనా కాగితాల మీద ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, దాని విజయం అంతా క్షేత్రస్థాయి అమలు తీరుపైనే ఆధారపడి ఉంటుంది. గతంలో అనేక ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బీమా పథకాలు కేవలం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, దలారుల కనుసన్నల్లో  సాగాయి. అయితే, ఈ పథకం కోసం ప్రభుత్వం నవంబర్ 20 నుండి 30 వరకు పది రోజుల పాటు ఇందిరమ్మ కమిటీల ద్వారా నిర్వహించ తలపెట్టిన ‘ఇంటింటి గ్రామీణ పర్యటనలు’ అభినందనీయం. లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా, యంత్రాంగమే ప్రజల ముంగిటకి వెళ్లి దరఖాస్తులు సేకరించడం వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుంది.

అయితే, ఈ బృహత్తర పథకం విజయవంతం కావడానికి ప్రభుత్వం కొన్ని కీలకమైన సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. మొదటిది, పారదర్శకత, రాజకీయ రహిత గుర్తింపు. గ్రామాల్లో ఏర్పాటయ్యే ఇందిరమ్మ కమిటీలలో స్థానిక పౌరులు, స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వామ్యం చేయడం మంచి పరిణామమే అయినా, అక్కడ ఎలాంటి రాజకీయ పక్షపాతానికి తావులేకుండా చూడాలి. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి, వారి రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించాలి. రెండోది, సాంకేతిక అనుసంధానం , క్లెయిమ్ ప్రక్రియ సరళీకరణ. బీమా అనేది కేవలం బాండ్లు పంచడంతో ముగిసిపోయేది కాదు. కుటుంబంలో ఒకరు మరణించినప్పుడు, ఆ దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా, అత్యంత వేగంగా, వారం పది రోజుల్లోనే బీమా సొమ్ము వారి ఖాతాల్లో జమ అయ్యేలా పటిష్టమైన ఆన్‌లైన్ మెకానిజం రూపొందించాలి. దీనికోసం ప్రత్యేకంగా ఒక నోడల్ ఆఫీసర్ లేదా హెల్ప్ డెస్క్ గ్రామ స్థాయిలో అందుబాటులో ఉండాలి.

ఈ పథకం కేవలం ఒక ఉచిత సదుపాయం కాదు, ఇది ఒక రాష్ట్రం తన పౌరులకు ఇచ్చే జీవన భరోసా. ఒక పేద కుటుంబంలో సంపాదించే వ్యక్తి కోల్పోయినప్పుడు వొచ్చే ఐదు లక్షల రూపాయలు, ఆ కుటుంబం అప్పుల పాలు కాకుండా, పిల్లల చదువులు ఆగిపోకుండా కాపాడుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలకుండా ఆదుకునే రక్షణ కవచం ఇది. ఈ పథకంలో ఎలాంటి కుల, మత లేదా ఆర్థిక వివక్షలు ఉండవు. తెల్ల రేషన్ కార్డుకలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ఇది వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.15 కోట్ల నుండి 1.5 కోట్ల కుటుంబాలు ఈ ఉచిత బీమా పరిధిలోకి రానున్నాయి. కుటుంబంలో సంపాదించే వ్యక్తి లేదా కుటుంబ పెద్ద పేరు మీద ఈ బీమా కవరేజీ అమలవుతుంది. లబ్ధిదారులైన కుటుంబాలు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. బీమా కంపెనీలకు చెల్లించాల్సిన పూర్తి ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. దీని కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 4,000 కోట్ల నిధులను కేటాయించింది.

కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల సమయంలో ‘ఆరు గ్యారంటీల’ తో పాటు తన సుదీర్ఘ మేనిఫెస్టోలో గ్రామీణ పేదలు, రైతులు, అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత కోసం వివిధ బీమా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ముఖ్యంగా కౌలు రైతులు, వ్యవసాయ కూలీలను కూడా బీమా పరిధిలోకి తెస్తామని ‘రైతు భరోసా’ డిక్లరేషన్‌లో పేర్కొంది. అధికారంలోకి వొచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలను మరింత విస్తృతం చేస్తూ… కేవలం ఒక వర్గానికే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి రూ. 5 లక్షల ఉచిత జీవిత బీమా అందించేలా ఈ ‘యూనివర్సల్ లైఫ్ ఇన్సూరెన్స్’ పథకానికి (ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం) రూపకల్పన చేసింది. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లోనే ప్రభుత్వం ఈ పథకం గురించి చారిత్రాత్మక ప్రకటన చేసింది. అనంతరం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్-కమిటీ దీని విధివిధానాలను ఖరారు చేసింది. ఇప్పుడు నవంబర్ 19న (ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా) దీనిని అధికారికంగా ప్రజల్లోకి తీసుకువొస్తున్నారు.

ప్రభుత్వం ఈ పథకాన్ని కేవలం ఒక రాజకీయ ప్రచార సాధనంగా కాకుండా, పూర్తి నిబద్ధతతో, ప్రభుత్వ యంత్రాంగాన్ని , స్థానిక కమిటీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలి. నవంబర్ 20 నుండి ప్రారంభం కాబోయే ప్రత్యేక డ్రైవ్‌ను విజయవంతం చేసి, లబ్ధిదారుల డేటాను పక్కాగా సేకరించినప్పుడే ఇందిరమ్మ జీవిత బీమా పథకం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుంది. పేదరికం లేని, సామాజిక భద్రత గల తెలంగాణ నిర్మాణంలో ఈ పథకం ఒక బలమైన పునాదిగా మారాలని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *