రాష్ట్రంలో వికేంద్రీకృత ప్రగతి అవసరం

తెలంగాణ సమాజం నేడు ఒక నిశ్శబ్దంగా తీవ్రస్థాయి పరివర్తనకు లోనవుతున్నది . ప్రభుత్వ సామాజిక-ఆర్థిక సర్వేలతో పాటు వివిధ జాతీయ గణాంక సంస్థల నివేదికల ప్రకారం, దేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రాల కంటే దశాబ్దం ముందే తెలంగాణలో సగానికి పైగా జనాభా (50.08 శాతం) పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. జాతీయ సగటు (సుమారు 35 శాతం) కంటే ఇది ఎంతో ఎక్కువ. శరవేగంగా జరుగుతున్న ఈ పట్టణీకరణ రాష్ట్ర ఆర్థిక వృద్ధికి, ఆధునికతకు ప్రతీకగా అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించబడుతున్నప్పటికీ, దీని వెనుక ఒక కలవరపరిచే సామాజిక సంక్షోభం దాగి ఉంది. ఆకాశహర్మ్యాల నీడన విస్తరిస్తున్న తీవ్రమైన ఆర్థిక అసమానతలు, వనరుల సంక్షోభం, కొత్త తరం శ్రామిక వర్గాల అభద్రతాభావం నేడు తెలంగాణ పట్టణీకరణ ముఖచిత్రంపై వేలాది ప్రశ్నలను సంధిస్తున్నాయి.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలను చూస్తే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక నూతన ప్రపంచం కనిపిస్తుంది. ఐటీ కారిడార్లు, బహుళజాతి కంపెనీల క్యాంపస్‌లు, కోకాపేట ఆకాశహర్మ్యాలు, వెయ్యి కోట్లకు పైగా విలువచేసే రియల్ ఎస్టేట్ లావాదేవీలు, మెట్రో రైళ్లు , విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలు నవ తెలంగాణ ఆర్థిక శక్తికి అద్దం పడుతున్నాయి. అయితే, సరిగ్గా ఇదే నగరాల శివార్లలో, ఐటీ టవర్లకు కొన్ని వందల మీటర్ల దూరంలోనే మరో భిన్నమైన ప్రపంచం విస్తరిస్తున్నది . కనీస తాగునీరు, సరైన డ్రైనేజీ వసతులు, కనీస పారిశుధ్యం , ఇరుకైన గదులతో కూడిన మురికివాడలు  ఈ నగరాల మెరుపుల వెనుక ఉన్న చీకటి కోణాన్ని నిరంతరం గుర్తు చేస్తున్నాయి. రాష్ట్ర సంపద కేవలం కొన్ని నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాల్లో, కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవడం వల్ల ఒకే నగరంలో సమాంతరంగా కనిపిస్తున్న రెండు విభిన్న ప్రపంచాలు సామాజిక అసమతుల్యతను కళ్లకు కడుతున్నాయి.

ఈ వేగవంతమైన పట్టణీకరణ తెచ్చిన అతిపెద్ద సామాజిక ఉపద్రవం ‘గిగ్ ఎకానమీ’ , అసంఘటిత రంగ శ్రామికులు. నగరాల విలాసవంతమైన, వేగవంతమైన ఆధునిక జీవనానికి వెన్నెముకగా నిలుస్తున్నది ఈ శ్రామిక వర్గమే. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు పనిచేసే డెలివరీ రైడర్లు, క్యాబ్-ఆటో డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, నిర్మాణ రంగ కూలీలు , గృహ కార్మికులు లేకపోతే మహానగరం ఒక్క క్షణం కూడా ముందుకు సాగలేదు. కానీ, ఆధునిక తెలంగాణ ఆర్థిక పీఠంపై వీరికి దక్కుతున్న గౌరవం, భద్రత ఎంత? శ్రామిక చట్టాల పరిధిలోకి రాని ఈ ‘నూతన తరం’ కార్మికులకు ఎలాంటి ఈఎస్‌ఐ, పీఎఫ్ లేదా కనీస ఆరోగ్య భీమా వంటి సామాజిక రక్షణలు లేవు. తీవ్రమైన ఎండలు, అకాల వర్షాలు, ట్రాఫిక్ కాలుష్యం మధ్య రోజుకు 12 నుండి 14 గంటలు రక్తాన్ని చెమటగా మారుస్తున్నా, వారి నెలవారీ ఆదాయాలు కనీస జీవన ప్రమాణాలకు కూడా సరిపోవడం లేదు.

మరోవైపు, నగరాల అడ్డగోలు విస్తరణ పర్యావరణ వ్యవస్థను , సహజ వనరుల పంపిణీని తీవ్రంగా దెబ్బతీస్తున్నది . ఐటీ కారిడార్ చుట్టుపక్కల వందలాది చెరువుల కబ్జాలు, కాంక్రీట్ జంగిల్‌గా మారిన భౌగోళిక పరిస్థితుల వల్ల స్వల్ప వర్షాలకే నగరాలు మునిగిపోతుండగా, వేసవి రాకముందే భూగర్భ జలాలు వందలాది అడుగుల లోతుకు పడిపోతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యాంశం .. ఈ వనరుల సంక్షేమ భారం కేవలం పేద, మధ్యతరగతి వర్గాలపైనే పడుతున్నది . సంపన్నులు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు, కార్పొరేట్ హాస్పిటల్స్ , అత్యాధునిక ప్యూరిఫైయర్లను సులభంగా కొనుగోలు చేయగలరు. కానీ బస్తీల్లోని పేదలు, శ్రామికులు ప్రభుత్వ నల్లా నీటి కోసం లేదా మున్సిపల్ ట్యాంకర్ల కోసం గంటల తరబడి వీధుల్లో వేచి చూడాల్సిన దుస్థితి నెలకొన్నది . ఇది కేవలం వనరుల కొరత కాదు, పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన.

అభివృద్ధి అంటే కేవలం నగరాల విస్తీర్ణం పెరగడం, జీడీపీ గణాంకాలు ఎగబాకడం లేదా మెరిసిపోయే ఫ్లైఓవర్లు నిర్మించడం మాత్రమే కాదు. నిజమైన పట్టణ ప్రగతి నగరంలో నివసించే ప్రతి పౌరుడికి, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు నాణ్యమైన కనీస సౌకర్యాలను, సామాజిక భద్రతను అందించగలగాలి. ఈ అంతరాలను తగ్గించాలంటే ప్రభుత్వం కేవలం హైదరాబాద్‌ కేంద్రంగా కాకుండా తక్షణమే “సమగ్ర వికేంద్రీకరణ”  విధానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలి. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, ఉన్నత విద్యాసంస్థలు , ఉపాధి అవకాశాలను కేవలం ఒకే రాజధానికి పరిమితం చేయకుండా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు వేగంగా తరలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
దీంతో పాటు, పట్టణ పేదలకు నగర పరిధిలోనే సరసమైన ధరల్లో ఇళ్లు, నాణ్యమైన ప్రభుత్వ ఉచిత విద్య,  సూపర్‌ స్పెషాలిటీ ఉచిత వైద్య సదుపాయాలు పెద్ద ఎత్తున కల్పించాలి. గిగ్ కార్మికుల హక్కుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉనికిలోకి రావాలి. పట్టణీకరణ అనేది గ్రామీణ ఉపాధి కోల్పోయిన జనం శరణార్థులుగా మారే సంక్షేమ వేదిక కాకూడదు; అది సామాజిక సమానత్వంతో కూడిన నిజమైన ప్రగతి ప్రయాణంగా మారాలి. అప్పుడే నవ తెలంగాణ స్వప్నం సంపూర్ణంగా సాకారమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *