సంపన్న అమ్మాయిలే టార్గెట్

– ఇన్‌స్టా వేదికగా వలపు వల
– ట్రాప్ చేసి రూ.లక్షల్లో వసూళ్లు
– ఇద్దరు నిందితుల అరెస్ట్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యువతులను ముఖ్యంగా సంపన్న కుటుంబాలకు చెందిన వారిని మాయమాటలతో ట్రాప్ చేసి రూ.లక్షలు వసూలు చేస్తున్న ముఠా గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. కీలక నిందితులుగా ఉన్న అర్జున్, అతని సోదరుడు రాజీవ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకర్షణీయమైన ప్రొఫైల్‌ను నిర్వహిస్తూ అమ్మాయిలను బుట్టలో వేసుకుంటారని పోలీసులు చెప్పారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ మోసాల్లో రాజీవ్ క్రియాశీలకంగా వ్యవహరించాడని దర్యాప్తులో తేలింది. పరారీలో ఉన్న రాజీవ్‌ను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి బెంగళూరులో పట్టుకున్నారు. నిందితులు యువతులను ట్రాప్ చేయడానికి పక్కా ప్లాన్ ప్రకారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఖరీదైన కార్లు, బ్రాండెడ్ దుస్తులు, విలాసవంతమైన హోటల్స్‌లో దిగిన రీల్స్, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసేవారని, తాము పెద్ద ధనవంతులమని యువతులను నమ్మించేవారని చెప్పారు. హైదరాబాద్‌లోని విలాసవంత ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో నివసించే సంపన్న కుటుంబాల పిల్లలను ఈ నిందితులు ప్రధానంగా లక్ష్యంగా చేసుకునేవారని వెల్లడించారు. అమ్మాయిలను పరిచయం చేసుకున్న కొద్ది రోజులకే ప్రేమ నటిస్తూ పెళ్లి చేసుకుంటామని నమ్మబలికేవారని, యువతుల నమ్మకాన్ని పొందిన తర్వాత అసలు పని మొదలుపెట్టేవారని తెలిపారు. సాన్నిహిత్యం పెరిగిన తర్వాత అమ్మాయిల వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించి వాటిని అడ్డం పెట్టుకుని భయపెడుతూ అత్యవసరాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసేవారని పోలీసులు వివరించారు. నిందితులు పదిమందికిపైగా యువతులను ట్రాప్ చేసినట్లు గుర్తించారు. ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను కూడా ప్రేమ పేరుతో వేధించి బ్లాక్‌మెయిల్ చేస్తూ సుమారు రూ.13 లక్షలు వసూలు చేశారని తెలిపారు. అర్జున్‌పై జూబ్లీహిల్స్‌లోనే కాక, నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయన్నారు. నిందితులను సమగ్రంగా విచారించేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇంకా ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారు, ఈ ముఠాలో ఇంకా ఎవరైనా సభ్యులు ఉన్నారా, వీరు వసూలు చేసిన సొమ్మును ఏం చేశారు అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజీవ్‌ను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలించి అర్జున్‌తో కలిపి విచారించే అవకాశం ఉంది.
——————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *