స్పష్టం చేసిన కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్17:బుల్డోజర్ న్యాయాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఆ ఆదేశాలు హైడ్రాకు వర్తించవని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని నేరస్థులు, నిందితుల ఆస్తుల కూల్చివేతలకు మాత్రమే సుప్రీం ఆదేశాలు వర్తిస్తాయన్నారు.చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి నిర్మించిన వాటిని మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని స్పష్టం చేశారు. నేరస్థులు, నిందితులకు సంబంధించిన ఎలాంటి ఆస్తుల జోలికి హైడ్రా వెళ్లడం లేదని రంగనాథ్ పేర్కొన్నారు.
బహిరంగ స్థలాలు, రైల్వే ఆస్తులు, నీటి వనరుల ఆక్రమణల తొలగింపులో తమ ఆదేశాలు వర్తించవన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రంగనాథ్ గుర్తుచేశారు. హైడ్రా కూల్చివేతలపై ఇటీవల పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా కూల్చివేతలు చేస్తుందని, న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు రావడంతో రంగనాథ్ స్పందించారు. ఆ ఆదేశాలు హైడ్రాకు వర్తించవని స్పష్టం చేశారు.
ములుగు జిల్లాలో తొలి కంటెయినర్ స్కూల్
లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సీతక్క
ములుగు,ప్రజాతంత్ర,సెప్టెంబర్17: జిల్లాలో తొలి కంటైనర్ స్కూల్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు . కన్నాయిగూడెం మండలంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి ఆవాస గ్రామంలో రూ.13 లక్షలతో ఏర్పాటు చేసిన కంటైనర్ స్కూల్ ను సీతక్క మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపి బలరాంనాయక్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ పాల్గొన్నారు. ప్రస్తుతం గుడిసెలో నడుస్తున్న పాఠశాల శిధిలావస్థకు చేరుకుంది.
అటవి ప్రాంతం కావడంతో కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతులివ్వలేదు. దీంతో ఇక్కడ కంటెయినర్ పాఠశాలను సీతక్క ఏర్పాటు చేశారు. ఈ కంటెయినర్ స్కూల్ 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో ఇద్దరు టీచర్లు పనిచేస్తుండగా..వారితో పాటు విద్యార్ధులు సౌకర్య వంతంగా కూర్చునే విధంగా కంటేయినర్ స్కూల్ ను ఏర్పాటు చేశారు.