ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పన్నెండేళ్లు గడుస్తున్నా, 2014 పునర్వ్యవస్థీకరణ చట్టం నాటి సమస్యలు నేటికీ తెలుగు రాజకీయాలను వెంటాడుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లోని వేల కోట్ల విలువైన 589 ప్రభుత్వ భవనాల అప్పగింతపై నెలకొన్న వివాదం.. రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు పెద్ద అడ్డంకిగా మారింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌కు ఉన్న పదేళ్ల గడువు ముగిసిపోయినప్పటికీ, ఈ భవనాల బదిలీ ప్రక్రియ మాత్రం అంగుళం కూడా ముందుకు కదలకపోవడం పరిపాలనా పక్షపాతానికి, సమాఖ్య స్ఫూర్తి లోపానికి అద్దం పడుతున్నది. ఈ వివాదానికి ప్రధాన కారణం ఆరు దశాబ్దాల పాటు తమ ప్రాంత ప్రజల పాలన కోసం నాలుగు వందల సంవత్సరాల సుసంపన్న చరిత్రగలిగిన హైదరాబాద్ నగరాన్ని వాడుకుని..ఇప్పుడు హైదరాబాద్ ఆస్తుల పై కన్ను వేయడం…!
భౌగోళికంగా హైదరాబాద్ తెలంగాణలో భాగం కాబట్టి, ఇక్కడున్న స్థిరాస్తులు, భూములు, ప్రభుత్వ భవనాలపై పూర్తి హక్కులు తమకే ఉంటాయని తెలంగాణ వాదనలో వాస్తవముంది. చట్టం ప్రకారం కేవలం ప్రధాన కార్యాలయాలను మాత్రమే విభజించాలని, అంతేకాని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ ఆస్తులు, వర్క్‌షాపులు లేదా చట్టంలో పేర్కొనని 12 వివాదాస్పద భవనాలలో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి వాటా ఇచ్చే ప్రసక్తే లేదని తెలంగాణ స్పష్టం చేస్తున్నది . దీనికి భిన్నంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఉమ్మడి పెట్టుబడుల సూత్రం’ ను బలంగా నమ్ముతోంది. మదరాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తరువాత పరిపాలనా సౌలభ్యం ఉన్న రాజధాని నిర్మించుకోలేని దుస్థిలో హైదరాబాద్ లో ఆశ్రయం పొంది..ఈ రోజు బంజాహిల్స్, సైఫాబాద్ వంటి అత్యంత ఖరీదైన ప్రాంతాలలో ఉన్న ఈ ఆస్తులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో …తెలంగాణా ప్రజల పన్నులు ఏవీ లేనట్లుగా..కేవలం ఆంధ్ర ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించినవేనట్లు ఏపీ వాదిస్తున్నది . చట్టంలోని సెక్షన్ 47 ప్రకారం జనాభా నిష్పత్తి (58:42) ప్రాతిపదికన ఈ ఆస్తులను పంచాలని డిమాండ్ చేస్తున్నది .
2016లో ఉన్నత విద్యామండలి (ఏపీఎస్ సీహెచ్ ఈ) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ అస్త్రంగా వాడుకుంటున్నది.. కేవలం హైదరాబాద్‌లో ఉన్నంత మాత్రాన ఆస్తులన్నీ తెలంగాణకే చెందవని ఆ తీర్పు స్పష్టం చేసింది. దీనితో, తమ ఆధీనంలో ఉన్న 221 భవనాలను ఏపీ ఒక ‘బేరసారాల అస్త్రం’ గా మార్చుకుంది. విద్యుత్ బకాయిలు, షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తుల వివాదం పూర్తిగా తేలే వరకు ఈ భవనాలను అప్పగించబోమని ఏపీ పట్టుబడుతున్నది .ఈ సుదీర్ఘ ప్రతిష్టంభన వల్ల రెండు రాష్ట్రాల ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదు …వందలాది భవనాలు వృధాగా పడి ఉంటే, ప్రజా మౌలిక వసతులు దెబ్బతింటున్నాయి. తెలంగాణ ఈ విలువైన భూములను అభివృద్ధి చేసుకోలేకపోతున్నది, అటు ఏపీ తన పరిధిలో లేని ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన సమయాన్ని, వనరులను వృధా చేసుకుంటున్నది . కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అనేక త్రైపాక్షిక సమావేశాలు విఫలం కావడంతో, ఈ వివాదం సుప్రీంకోర్టులో చట్టపరమైన సందిగ్ధతలో చిక్కుకుంది. కోర్టు పరిధిలో ఉండటం వల్ల ఏ రాష్ట్రమూ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదు.తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు కావలసింది కోర్టు తీర్పులు లేదా చట్టపరమైన గొడవలు కాదు, ఒక ఉన్నతమైన రాజకీయ పరిణతి. కోర్టుల తీర్పులు ఒకరికి గెలుపు, మరొకరికి ఓటమిని ఇచ్చి ప్రాంతీయ విద్వేషాలను పెంచుతాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ప్రాంతీయ రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి, టేబుల్ మీద కూర్చోవాలి.
ఉమ్మడి రాజధాని గడువు ముగిసిన తర్వాత కూడా తమ సొంత భౌగోళిక పరిధిలోని భవనాలు పక్క రాష్ట్ర ఆధీనంలో ఉండటం తెలంగాణా కు కలుగుతున్న తీవ్ర నష్టం.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచేందుకు, నగర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఆ భవనాలను వేగంగా వాడుకోవాలని తెలంగాణ భావించడంలోనూ తప్పు లేదు. కేంద్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తిగా కాకుండా, సమస్య తీవ్రతను తగ్గించేందుకు ఇరు రాష్ట్రాలకు తగిన ఆర్థిక ప్యాకేజీలు లేదా ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తూ క్రియాశీలక పాత్ర పోషించాలి. అప్పుడే రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సత్సంబంధాలు బలపడతాయి. సమస్యల సుదీర్ఘ కాలయాపన ఇరు రాష్ట్రాల అభివృద్ధిని కుంటుపరుస్తుంది. కాబట్టి, మొండి పట్టుదలను వీడి, పరస్పర విశ్వాసంతో ముందడుగు వేయాలి. రెండు సార్వభౌమ రాష్ట్రాలు శత్రువులుగా కాకుండా, ప్రగతి పథంలో భాగస్వాములుగా సాగినప్పుడే ఇరు రాష్ట్రాల ప్రజల భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుంది.





