“తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వాన్ని యాచించడం లేదు.. తాము చేసిన త్యాగానికి కనీస గుర్తింపును, ఆత్మగౌరవాన్ని మాత్రమే ఆశిస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రకటించిన రూ. 25,000 పెన్షన్, ఇండ్ల స్థలాలు, కేసుల ఉపసంహరణ మరియు ప్రభుత్వ ఉద్యోగాల హామీలు నిజమైన యోధులకు అందాలన్నా.. నకిలీలను ఏరివేయాలన్నా నిబంధనల సరళీకరణ అత్యంత అవసరం.”
తెలంగాణ తొలి – మలి దశ ఉద్యమం (1969 – 2014) ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన, సుదీర్ఘమైన ప్రజాస్వామ్య పోరాటం. కోట్లాది మంది ఆకాంక్షలు, వేలాది మంది బలిదానాలు, లక్షలాది మంది త్యాగాల పునాదుల మీద ‘తెలంగాణ రాష్ట్రం’ ఆవిర్భవించింది. నాడు జైలు గోడల మధ్య నలిగిన వారు, లాఠీ దెబ్బలకు గురైన వారు, కోర్టుల చుట్టూ తిరిగిన వారు, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, కార్మికులు తమ సర్వస్వాన్ని పణంగా పెట్టి పోరాడారు. అయితే, స్వరాష్ట్రం సిద్ధించి ఇన్నేళ్లవుతున్నా.. క్షేత్రస్థాయిలో నిజమైన ఉద్యమకారులను గుర్తించడం, వారికి దక్కాల్సిన గౌరవాన్ని అందించడం అనే ప్రక్రియ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. సంక్లిష్టమైన నిబంధనలు, అధికార యంత్రాంగం చుట్టూ తిరగాల్సిన దుస్థితి వల్ల అసలైన పోరాట యోధులు విస్మరణకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విప్లవాత్మక హామీల నేపథ్యంలో, ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను మరింత సరళంగా, పారదర్శకంగా మరియు గౌరవప్రదంగా మార్చేందుకు ప్రభుత్వం తక్షణమే కొన్ని నిబంధనలను, ప్రతిపాదనలను అమలు చేయాల్సిన అవసరం ఉంది.
మేనిఫెస్టో హామీల అమలుకు సులభతర మార్గం
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఉద్యమకారుల కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన అంశాలను చేర్చింది. అందులో ముఖ్యంగా అమరవీరుల కుటుంబాలకు భరోసా. మొదటి మరియు మలిదశ ఉద్యమ అమరవీరుల కుటుంబాలను అధికారికంగా గుర్తించి, ఆయా కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, అలాగే వారి తల్లి/తండ్రి/భార్యకు నెలకు రూ. 25,000 గౌరవ పెన్షన్ అందిస్తామని ప్రకటించింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన అన్ని కేసులను బేషరతుగా ఉపసంహరించుకుని, వారికి అధికారిక ‘తెలంగాణ ఉద్యమకారుడి గుర్తింపు కార్డు’ జారీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి 250 చదరపు గజాల ఇండ్ల స్థలాన్ని కేటాయిస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది.
ఈ మహత్తరమైన హామీలు నిజమైన అర్హులకు త్వరితగతిన చేరాలంటే, గుర్తింపు నిబంధనలను ప్రభుత్వం సులభతరం చేయాల్సి ఉంది. అందుకోసం సంక్లిష్టమైన దరఖాస్తు విధానానికి స్వస్తి పలకాలి. పారదర్శకత కోసం ప్రభుత్వం ఒక కేంద్రీకృత ఆన్‌లైన్ పోర్టల్ (తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి పోర్టల్’) ను ఏర్పాటు చేయాలి. కేసులు ఉపసంహరణకు మరియు 250 గజాల స్థలాల కేటాయింపునకు కావలసిన దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారానే స్వీకరించాలి. దరఖాస్తు ఏ దశలో ఉందో (జిల్లా కమిటీ పరిశీలన లేదా తుది ఆమోదం) దరఖాస్తుదారునికి ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందేలా ట్రాకింగ్ వ్యవస్థను రూపొందించాలి.
కేసుల రికార్డులతో పాటు ఆధారాల సరళీకరణ చేయాలి. కేవలం పోలీస్ రికార్డులు, ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నవారిని మాత్రమే ఉద్యమకారులుగా పరిగణించడం సరైనది కాదు. ఎందుకంటే నాటి ఉద్యమంలో తెరవెనుక ఉండి నడిపిన వారు, కళాకారులు, కవులు, పోస్టర్లు అంటించిన వారు, వంటా-వార్పులో పాల్గొన్న మహిళలపై కేసులు నమోదు కాలేదు. కాబట్టి గుర్తింపు నిబంధనలను కింది విధంగా విస్తరించాలి
ఇప్పటికే గుర్తింపు పొందిన లేదా నాటి జేఏసీ నాయకులు, ముగ్గురు ప్రముఖ ఉద్యమకారులు సదరు వ్యక్తి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారని ధృవీకరిస్తూ ఇచ్చే అఫిడవిట్ (సహ-ఉద్యమకారుల సాక్ష్యం) ను ప్రామాణికంగా తీసుకోవాలి. నాటి పత్రికల వార్తా క్లిప్పింగులు, ఛాయాచిత్రాలు , లేదా స్థానిక ప్రజా సంఘాల రికార్డులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ప్రజా భాగస్వామ్యంతో ‘గ్రామసభల’ ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేయాలి. నకిలీ ఉద్యమకారుల నిరోధానికి మరియు అర్హులకు న్యాయం చేయడానికి క్షేత్రస్థాయి పరిశీలన అత్యంత కీలకం. దరఖాస్తుల ప్రాథమిక పరిశీలన అనంతరం, సదరు గ్రామంలో లేదా మున్సిపల్ వార్డులో ‘గ్రామసభ’ నిర్వహించి, ప్రజల సమక్షంలో అర్హుల జాబితాను చదివి వినిపించాలి. గ్రామానికి తెలుసు—ఎవరు ఉద్యమంలో జైలుకు వెళ్లారో, ఎవరు పోరాడారో! దీనివల్ల రాజకీయ సిఫార్సులకు, అక్రమాలకు తావుండదు.
ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా అధికారిక ‘గౌరవ గుర్తింపు కార్డులు’ కేవలం రాయితీల కోసమే కాకుండా, వారి ఆత్మగౌరవాన్ని పెంచేలా ఉండాలి. సగర్వ సన్మానంతో పాటు అధికారిక ప్రోటోకాల్ వర్తించాలి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో (స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో) వీరికి ప్రత్యేక ఆసనాలు, గౌరవప్రదమైన ఆహ్వానాలు దక్కేలా ప్రోటోకాల్ నిబంధనలను రూపొందించాలి.
మేనిఫెస్టోలో పేర్కొన్న రూ. 25,000 పెన్షన్ మరియు ఇండ్ల స్థలాలతో పాటు వయసు పైబడిన ఉద్యమకారుల ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సామాజిక భద్రత మరియు ఆరోగ్య హక్కు కల్పించాలి. గుర్తింపు పొందిన ప్రతి ఉద్యమకారునికి, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ హాస్పిటల్స్ ల్లో సైతం ఉచిత వైద్యం అందేలా ‘ప్రత్యేక హెల్త్ కార్డులు’ జారీ చేయాలి. ప్రభుత్వ కమిటీలలో ప్రాధాన్యత కల్పించాలి. వివిధ కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు లేదా ప్రభుత్వ సలహా సంఘాల్లో నామినేటెడ్ పదవుల కేటాయింపులో ఉద్యమకారులకు నిర్దిష్ట ప్రాధాన్యత ఇవ్వాలి.
తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వాన్ని యాచించడం లేదు.. తాము చేసిన త్యాగానికి కనీస గుర్తింపును, ఆత్మగౌరవాన్ని మాత్రమే ఆశిస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రకటించిన రూ. 25,000 పెన్షన్, ఇండ్ల స్థలాలు, కేసుల ఉపసంహరణ మరియు ప్రభుత్వ ఉద్యోగాల హామీలు నిజమైన యోధులకు అందాలన్నా.. నకిలీలను ఏరివేయాలన్నా నిబంధనల సరళీకరణ అత్యంత అవసరం. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను స్వీకరించి, పారదర్శకమైన విధానం ద్వారా నిజమైన యోధులను గౌరవించుకుంటేనే.. అది నాడు అమరులైన వీరులకు మనం ఇచ్చే అసలైన నివాళి అవుతుంది. మేనిఫెస్టో హామీలను చట్టబద్ధమైన మార్గదర్శకాలుగా మార్చి, ఉద్యమకారుల ముఖాల్లో ఆనందాన్ని నింపాల్సిన చారిత్రక బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.
విశ్వ జంపాల
న్యాయవాది
రాష్ట్ర ఉపాధ్యక్షులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
మొబైల్ నెం. 7793968907





