“ఉపాధ్యాయులందరు ఒక విషయం గమనించాలి ప్రభుత్వ బడులకు వస్తున్న పేద వర్గాలకు చెందిన పిల్లలు ‘టీచర్లకు బోధించే అవకాశాన్ని బోధించే హక్కును’ కల్పిస్తున్నారు’. తరతరాల వెనుకబాటు తనాన్ని గండి కొట్టే అవకాశం లభిస్తుంది.ఈ మార్పుకు చరిత్రలో ఈ తరగతి గదులు సాక్ష్యం గా నిలిచాయి నిలుస్తాయి. ఇలాంటి అవకాశం ఏ ప్రైవేటు కార్పొరేట్ బడుల టీచర్లకు లభించదు, పేద వర్గాల పిల్లలే మన బడులకు వస్తున్నారనే నిరాశ నుండి బయటపడి ముందు తరాలను గౌరవప్రదమైన జీవితాలను తీర్చిదిద్దే యజ్ఞం లో ఉన్నామని గర్వపడాలి. బాల్యానికి బాసటగా నిలిచి భరోసానివ్వాలి. ఈ యజ్ఞం లో ఉన్న బాటసింగారం ఉపాధ్యాయులను కలిసే అవకాశం కలిగినందుకు కృతజ్ఞతలతో.”
బడి అంటే భద్రత బడి అంటే విశ్వాసం బడి అంటే సమానత్వం, బడి అంటే భయం లేని స్థలం బడి అంటే ప్రేమ బడి అంటే తెగిపోనీ బంధం ఇవన్నీ సాధ్యమేనా అంటే అవుననే అంటున్నారు బాటసింగారం విద్యా నిపుణులు. టీచర్లు అనకుండా విద్య నిపుణులు ఎందుకు అంటున్నానంటే టీచర్లు పాఠాలు చెప్తారు,క్రమశిక్షణ నేర్పుతారు కానీ ఇక్కడ పనిచేస్తున్న టీచర్లు టీచర్ల నిర్వచనాన్ని బడి నిర్వచనాన్ని పునర్నిర్వచించారు. ఈ టీచర్లను కలిసిన ఆనందం అద్భుతం. అందరూ మహిళా టీచర్లే. యాదృచ్ఛికమే కానీ ఇలాంటి పనిచేసే వాతావరణం లో ఎవరైనా ఇలాగే ఉంటారని నా నమ్మకం.
నేను ఉన్న రెండు గంటలలో కొన్ని అద్భుతాలు జరిగాయి. నాకు అవి అద్భుతాలే. బడి వీడి ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థి టీచర్ల కు తన బడి గురుంచి చెప్పుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం లో ఫెయిల్ అయి ఇంటి దగ్గర దుఖం లో ఉన్న తన బిడ్డను ఓదార్చే చోటు తన బిడ్డ ప్రాథమిక స్థాయి లో చదివిన ఊర్లో ఉన్న బడే అని ఒక తల్లి తన బిడ్డను టీచర్ల దగ్గరకు తీసుకొస్తే ప్రధానోపధ్యాయురాలు కనపడగానే ఆ అమ్మాయి దుఖం కట్టలు తెంచుకున్నది. వచ్చిన అమ్మాయే కాదు ప్రధాన ఉపాధ్యాయురాలుతో పాటు ఆ టీచర్లు అందరూ దుఖం లో మునిగారు. ఈ దృశ్యం ఇంకా కళ్ళలో మెదులుతూనే ఉంది. కొన్ని మంచి మాటలతో ధైర్యం చెప్పిన కొన్ని నిమిషాలలో నే ఆ అమ్మాయి నవ్వుతూ కనిపించింది. తల్లి సంతోషానికి అవధులు లేవు. హాస్పిటల్ కి అనారోగ్యం తో వచ్చి ఆరోగ్యం గా సంతోషం గా ఇంటికి వెళ్తున్నట్లు అనిపించింది ఆ తల్లీబిడ్డలు ఇంటికి వెళ్ళిన దృశ్యం. ఈ రోజు బడి చేసిన సహాయం మరువగలరా ఆ తల్లి బిడ్డలు. తమ బడిలో ఉన్న ప్రతి బిడ్డ భద్రత ఎంత ముఖ్యమో కొన్ని సంఘటలు చెప్తూ భావోద్వేగానికి గురయ్యారు టీచర్లు. .
అందుకే ఈ టీచర్లు బడి నిర్వచనాన్ని తిరగ రాశారు అనిపించింది. పిల్లలతో గడిపే సమయం పాలనా పనుల వల్ల చాలా సార్లు బోధన చేసే అవకాశం కోల్పోతామని వాళ్ళలో బాధ కనిపించింది. ప్రతి సంవత్సరం పిల్లలను టూర్ తీసుకెళ్లడం ఎన్జీఓ లతో సంప్రదించి అదనపు బోధన సామగ్రి ల్యాబ్ లు సమకూర్చుకోవడం తో పిల్లలలో ఆసక్తి కలిగిస్తున్నారు. అన్నీ బడులలాగే మౌలిక వసతుల సమస్యలు ఈ బడికి ఉన్నాయి. స్థానికంగా ప్రజా ప్రతినిధులతో ఇతర సామాజిక సంస్థలతో వ్యక్తులతో బడి సమస్యలను తీర్చుకోవడం లో చొరవ తీసుకుంటున్నారు. ఇంకా చాలా అవసరాలే ఉన్నాయి. ఇటువంటి బడుల సమస్యలను తీర్చడానికి విద్యాశాఖ ప్రాధాన్యత నివ్వాలి.
ప్రీ స్కూల్ అనుమతి లభించినందుకు సంతోషం లో ఉన్నారు. ప్రీ స్కూల్ గది పెయింటింగ్ వివరాలు టీచర్లకు వదిలేస్తే స్థానిక పిల్లల అవసరాల కనుగుణంగా వేయించుకుందుమన్నారు. మన వ్యవస్థలో అంత స్వేచ్ఛ వాతావరణం లేదని మళ్ళీ వెంటనే అమ్మో ఇస్తే మళ్ళీ అదనపు పని కూడా అనుకున్నారు.
టీచర్ల మీద ప్రభుత్వ బడి మీద ఈ సంవత్సరం జరిగినంత చర్చ మారెప్పుడు జరగలేదు. విద్యా శాఖ మొత్తానికి ప్రతినిధులుగా సమాజం లో ప్రతి రోజు కనిపించేది టీచర్లు. వ్యవస్థ లోపాలు మోసేది టీచర్లే. అనేక ప్రతికూల పరిస్థితులలో పనిచేస్తన్నా కూడా ప్రభుత్వ ప్రాధాన్యత క్రమం లో చివరన ఉన్నందు వలన విధాన నిర్ణయాల జాప్యము విధాన లోపలా వల్ల సమాజంలో టీచర్ల పట్ల సానుకూల దృక్పథ లోపం కనిపిస్తూ ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేక చెప్పినా వినే వారు ఉండరని మౌనంగా భరిస్తుంటారనిపించింది.
సానుకూలత ఉన్నా లేకున్నా మడమ తిప్పని ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టే అతి పేద వర్గాలకు ప్రభుత్వ బడి అంటే విశ్వాసం తో ఉన్నారని బాటసింగారం పాఠశాల వెళ్తే అక్కడ పనిచేస్తున్న టీచర్లను కలిస్తే అర్థం అవుతుంది. రాష్ట్రం లో ఇలా చాలా బడులు ఉంటాయి. ఇటువంటి బడులను సందర్శించడం టీచర్లతో మనసు విప్పి మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. ఈ టీచర్లతో గడిపినంత సేపు వాళ్ళ బడి పిల్లలకు న్యాయం చేయమనె తపన తప్ప ఒక్క విషయం కూడా టీచర్ల అవసరాల గురించి అడుగలేదు.బడికి గదులకు పేయింట్ వేసి రంగు రంగుల బొమ్మలు ఉంటే మా పిల్లలు సంతోషంగా ఉంటారని, సరిపడ శౌచాలయాలు కావాలని డైనింగ్ హాల్ ఉంటే బాగుంటుందని అడిగారు. విద్యా శాఖ ఇటువంటి పాఠశాలలను గుర్తించి అన్నీ సౌకర్యాలు కల్పించాలి.ఎవరైనా దాతలు కూడా ఇటువంటి బడులకు సహాయం చేస్తే బాగుండు అనిపించింది. బడులను మూసివేయడం కాదు ఉన్న వాటిని కాపాడుకోవడం ముఖ్యం అని ప్రభుత్వ పెద్దలు గ్రహించాలి. మా బడి సమస్యలు లేని బడి అని టీచర్లు తల్లి దండ్రులు సమాజం గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలి.
చివరగా..
విద్య ద్వారానే విముక్తి అని ఇప్పుడు అతి పేద వర్గాలు కూడా నమ్మి పిల్లలను బడులకు పంపుతున్నారు. మా లాగా మా పిల్లల బ్రతుకులు ఉండొద్దని వారి భవిష్యత్తును కలలు కంటున్నారు. ఆ కలల సాకారం కేవలం మీ లాంటి టీచర్ల వల్లనే సాధ్యం అని నమ్మాలి. బడి అంటే సామాజిక న్యాయం కోసం ఏర్పడిన సంస్థ. ఉపాధ్యాయులందరు ఒక విషయం గమనించాలి ప్రభుత్వ బడులకు వస్తున్న పేద వర్గాలకు చెందిన పిల్లలు ‘టీచర్లకు బోధించే అవకాశాన్ని బోధించే హక్కును’ కల్పిస్తున్నారు’. తరతరాల వెనుకబాటు తనాన్ని గండి కొట్టే అవకాశం లభిస్తుంది.ఈ మార్పుకు చరిత్రలో ఈ తరగతి గదులు సాక్ష్యం గా నిలిచాయి నిలుస్తాయి. ఇలాంటి అవకాశం ఏ ప్రైవేటు కార్పొరేట్ బడుల టీచర్లకు లభించదు, పేద వర్గాల పిల్లలే మన బడులకు వస్తున్నారనే నిరాశ నుండి బయటపడి ముందు తరాలను గౌరవప్రదమైన జీవితాలను తీర్చిదిద్దే యజ్ఞం లో ఉన్నామని గర్వపడాలి. బాల్యానికి బాసటగా నిలిచి భరోసానివ్వాలి. ఈ యజ్ఞం లో ఉన్న బాటసింగారం ఉపాధ్యాయులను కలిసే అవకాశం కలిగినందుకు కృతజ్ఞతలతో.
ఆర్. వెంకట రెడ్డి
సామాజిక కార్యకర్త





