ఎంజేపీ అగ్రి కాలేజీల్లో ఎంజేపీ విద్యార్థులకే అవకాశం

– గురుకులాలు ఇకపై బీసీ సంక్షేమ మహాత్మా జ్యోతిరావు పూలే విద్యా సంస్థల సొసైటీగా మార్పు
– ఐఐటీ, ఐఐఐటీ, ఎన్‌ఐటీలకు ఎంపికైన గురుకుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు
– ఎంజేపీ బోర్డు ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో కీలక తీర్మానాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25: ఎంజేపీ వ్యవసాయ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఎంజేపీ గురుకుల విద్యాసంస్థల విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించే ప్రతిపాదనకు మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ(MJPTBCWREIS) బోర్డు ఆమోదం తెలిపింది. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సచివాలయంలో సొసైటీ 6వ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం గురువారం జరిగింది. ఇతర విద్యాసంస్థల సంఘాల తరహాలోనే సంస్థ పేరును తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీగా మార్చాలని బోర్డు నిర్ణయించింది. విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతుల అభివృద్ధి, పరిపాలనా బలోపేతానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ప్రాంతీయ సమన్వయ కార్యాలయాల(ఆర్సీవో) వివిధ విభాగాలకు బడ్జెట్ పరిమితులను బోర్డు ఆమోదించింది. ఎంజేపీ బీసీ గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు మరణించిన సందర్భాల్లో వారి తల్లిదండ్రులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరుకు ఆమోదం తెలిపింది. ప్రిన్సిపాల్(పాఠశాల) నియామకాలకు ప్రస్తుతం అమలులో ఉన్న 70 శాతం పదోన్నతులు, 30 శాతం ప్రత్యక్ష నియామకాల విధానాన్నే కొనసాగించాలని సమావేశం నిర్ణయించింది. విద్యా పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పదవీ విరమణ చేసిన ప్రిన్సిపాల్స్ సేవలను అకడమిక్ కన్సల్టెంట్లుగా వినియోగించుకునే అంశంపై నియామక నిబంధనలను రూపకల్పనకు కమిటీ ఏర్పాటు చేసి తదనుగుణంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఐఐటీలు, ఐఐఐటీలు, ఎనఐటీలు వంటి జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు సాధించిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించాలని బోర్డు నిర్ణయించింది. ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలల్లో డెస్క్‌టాప్ కంప్యూటర్ల కొనుగోలు, జూనియర్ కళాశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్(ఐఎఫ్‌పీ) సరఫరాకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 12 సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న ఆమోద స్థితిపై పూర్తి నివేదిక సమర్పిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. విద్యా ప్రమాణాల పెంపు, పోటీ పరీక్షల్లో విజయాలు, జాతీయస్థాయి విద్యాసంస్థల్లో అధిక ప్రవేశాలు సాధించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాలమయాదేవి, ఎంజేపీ బీసీ గురుకులాల కార్యదర్శి సైదులు, వివిధ విభాగాల అధికారులు, బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *