– యుద్దప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి
– అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25 : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఈ నెల 27న శ్రీకారం చుడుతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, భద్రాచలం ఆలయ అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమశాస్త్ర నియమాలను కచ్చితంగా పాటిస్తూ అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. భద్రాచలం ఆలయ వైభవం, ఆధ్యాత్మికతకు ఎలాంటి భంగం కలగకుండా, సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రాతి నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. రాబోయే 200 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకు భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలిచేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారని, ఈ మేరకు ఈ నెల 27న ఆలయ పునరుద్ధరణ పనులను అధికారికంగా ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోనే పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.351 కోట్లను మంజూరు చేశారని తెలిపారు. వచ్చే శ్రీరామ నవమి నాటికి నిర్దేశించిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి ముందస్తుగానే పనుల విభజన చేసుకుని సమర్థవంతంగా అన్ని పనులు చేపట్టాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





