యువతకు ఉపాధి కల్పించాలన్నదే సంకల్పం

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించి కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7,8,9 తేదీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026’ ఏర్పాట్లు, రోడ్ షోలు, ఎంవోయూలు, ఇతర అంశాలపై ఆబిడ్స్‌లోని ఇండస్ట్రీస్ డైరెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2026ను రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింపజేసేలా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను మరింత బలోపేతం చేసేలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా పలు పాలసీలను ఆవిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను విశ్వవ్యాప్తం చేసేలా దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో సమ్మిట్‌కు విస్తృత ప్రచారం లభించేలా రోడ్ షోలను నిర్వహించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలపై ఈ సమ్మిట్ వేదికగా పారిశ్రామికవేత్తలకు విస్తృత అవగాహన కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సమ్మిట్‌లో కుదిరిన ఎంవోయూలను క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో ‘ల్యాండింగ’ అయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఎంవోయూపై ఎప్పటికప్పుడు పకడ్బందీగా ఫాలో అప్ చేస్తున్నామని, భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే రంగాలకు ఈ సమ్మిట్‌లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నామని, విదేశీ డెలిగేట్లు, పారిశ్రామిక దిగ్గజాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లాజిస్టిక్స్, ప్రొటోకాల్, హాస్పిటాలిటీ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. శాఖల మధ్య సమన్వయం లోపించకుండా ప్రతి శాఖకు స్పష్టమైన బాధ్యతలు, టైమ్‌లైన్లు నిర్దేశించామన్నారు. సమ్మిట్ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష.. నిర్దేశిత గడువులో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *