సత్యాగ్రహం బలహీనత కాదు, ఇది నైతిక శక్తి

సిహెచ్. వి. ప్రభాకర్ రావు,
సీనియర్ జర్నలిస్ట్,
మొబైల్ : 9391533339

భారత ప్రజాస్వామ్యం ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. అధికారాన్ని ప్రశ్నించే స్వరాలను వినడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం. కానీ నేడు ఆ స్వరాలు క్రమంగా బలహీనపడే వరకు వేచి చూసే రాజకీయ సంస్కృతి పెరుగుతోందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకప్పుడు సత్యాగ్రహం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించింది. నేడు అదే సత్యాగ్రహం ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కదిలించలేకపోతోందా? గాంధీ చూపిన అహింసా మార్గంలో నిరాహార దీక్ష చేసే వారికి చివరకు మరణమే శరణ్యమవుతోందా? ఈ ప్రశ్నలు ఒక్క వ్యక్తి గురించినవి కాదు; భారత ప్రజాస్వామ్య నైతిక ఆరోగ్యాన్ని ప్రశ్నించే అంశాలు.

భారతదేశానికి స్వాతంత్ర్యం కేవలం ఆయుధ పోరాటంతో రాలేదు. ప్రపంచ చరిత్రను మార్చిన ఒక నైతిక శక్తి “సత్యాగ్రహం” ద్వారా వచ్చింది. మహాత్మా గాంధీ సత్యం, అహింస, నైతిక ధైర్యాన్ని ఆయుధాలుగా మార్చి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేశారు. “సత్యం ముందు ఏ అధికారం నిలవదు” అనే ఆయన విశ్వాసం దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష వ్యతిరేక ఉద్యమాల నుంచి అమెరికాలో మార్టి న్ లూథర్ కింగ్ జూనియర్ నేతృత్వంలోని పౌరహక్కుల ఉద్యమం వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రజాస్వామ్య పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది. గాంధీ అహింస ప్రపంచ రాజకీయాల్లో నైతిక శక్తికి ప్రతీకగా నిలిచింది. అయితే, గాంధీ జన్మించిన నేలపై గాంధీ మార్గాన్ని అనుసరించే వారిని వినే సంస్కృతి క్రమంగా క్షీణిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిరాహార దీక్షలు, సత్యాగ్రహాలు, శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్యంలో అత్యంత గౌరవనీయమైన నిరసన రూపాలు. వాటి ఉద్దేశం ప్రభుత్వాన్ని అవమానించడం కాదు; ప్రజల మనోవేదనను అధికార వ్యవస్థకు చేరవేయడం. కానీ అవి ఇప్పుడు అధికార యంత్రాంగంలో స్పందన కలిగించలేకపోతే, ప్రజాస్వామ్యం తన నైతిక పునాదులను కోల్పోతుందనే సందేహం సహజమే.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET పరీక్షా వివాదం ఒక ముఖ్యమైన ఉదాహరణ. పరీక్షా నిర్వహణపై వచ్చిన ఆరోపణలు, పారదర్శకతపై తలెత్తిన సందేహాలు లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాల్లో ఆందోళన కలిగించాయి. ఆ వెంటనే సీబీఎస్సీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకలనలో జరిగిన పొరపాట్లు, ఇలా విద్య వ్యవస్థలో జరుగుతున్న లోపాలను ఎట్టి చూపడమే యువత, విద్యార్థులు బాద్యతగా తీసుకోండి. అలా ప్రశ్నించిన వారిని, లోపాలను ఎట్టి చూపిన వారిని దేశద్రోహులుగా, పాకిస్తానీలుగా ప్రధాన మీడియా అభివర్ణించింది. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని, జరిగిన లోపాలపై బాధ్యత వహించాలని, పరీక్షా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలని కోరడం ప్రజాస్వామ్య విరుద్ధం కాదు. అది పౌర సమాజం నిర్వహించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత.

యువతే ముందుండి నడిపించైన కాక్ రొచ్ జనతా పార్టీ ఈ ప్రశ్నలను మరింత విస్తృత ప్రజా చర్చలోకి తీసుకువచ్చింది. ఏదో సామాజిక మధ్యమ ఉద్యమం అనుకొన్న దానికి ఎందరో ప్రముఖులు జత కురారు. వారిలో విద్యావేత్త, పర్యావరణవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్‌చుక్ ఒకరు. లడఖ్‌లో స్థానిక అవసరాలకు అనుగుణంగా విద్యా నమూనాలను అభివృద్ధి చేసి అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆయన, ప్రజా ప్రయోజనాల కోసం నిరంతరం గళం వినిపిస్తున్నారు. ఆయన పోరాటం అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం కాదు; విద్య, పర్యావరణం, పరిపాలనా బాధ్యత, ప్రజాస్వామ్య జవాబుదారీతనంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలనే లక్ష్యంతో సాగుతోంది. అలాంటి వ్యక్తి శాంతియుత నిరసన చేపట్టినప్పుడు, దానిని రాజకీయ కళ్లజోడుతో మాత్రమే చూడడం ప్రజాస్వామ్యానికి మేలు చేయదు. భారత చరిత్రలో ఇటువంటి సంఘటనలు కొత్తవి కావు. 2018లో గంగానది పరిరక్షణ కోసం మాజీ ఐఐటీ ప్రొఫెసర్ జి.డి. అగర్వాల్ (స్వామి సానంద్) 111 రోజులకుపైగా నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయారు. గంగ సహజ ప్రవాహాన్ని కాపాడాలని ఆయన చేసిన విజ్ఞప్తి కేవలం పర్యావరణ ఉద్యమం మాత్రమే కాదు; భవిష్యత్ తరాల జీవన హక్కును కాపాడాలనే నైతిక పిలుపు. కానీ ఆయన త్యాగం దేశ రాజకీయాలను కదిలించలేకపోయింది. ఆ సంఘటన తర్వాత కూడా ప్రజా సమస్యలపై అహింసా ఉద్యమాలకు తగిన స్పందన కనిపించకపోవడం ఆందోళన కలిగించే విషయం.

ఇక్కడ అసలు ప్రశ్న ప్రభుత్వం స్పందించిందా లేదా అన్నది మాత్రమే కాదు. ప్రతిపక్షాలు, విశ్వవిద్యాలయాలు, మేధావులు, పౌరసంఘాలు, మీడియా వంటి ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఇతర స్తంభాలు తమ బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తున్నాయన్నది కూడా అంతే ముఖ్యం. ప్రతి సమస్యను ఎన్నికల లాభనష్టాల కోణంలోనే చూడటం వల్ల ప్రజా ప్రయోజనాల కోసం జరిగే రాజకీయేతర ఉద్యమాలు ఒంటరిగా మిగిలిపోతున్నాయి. ప్రజాస్వామ్యంలో పౌర సమాజం బలహీనపడితే, అధికార వ్యవస్థపై ప్రజల నైతిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. గాంధీ ఒక సందర్భంలో, “సత్యాగ్రహం బలహీనుల ఆయుధం కాదు; అత్యంత ధైర్యవంతుల మార్గం” అని అన్నారు. మరోచోట, “ప్రజల స్వరం వినడానికి నిరాకరించే ప్రభుత్వం చివరికి తన నైతిక హక్కును కోల్పోతుంది” అనే భావాన్ని వ్యక్తం చేశారు. ఈ రెండు వ్యాఖ్యలు నేటి భారత ప్రజాస్వామ్యానికి కూడా సమానంగా వర్తిస్తాయి. ప్రజల ప్రశ్నలను అణచివేయడం కంటే వాటిని వినడం, సమాధానం ఇవ్వడం, తప్పు జరిగితే సరిదిద్దుకోవడం ప్రజాస్వామ్య బలం.

భారతదేశం ప్రపంచానికి అహింసను, సత్యాగ్రహాన్ని నేర్పిన దేశం. కానీ గాంధీని కేవలం విగ్రహాలకు, జయంతులకు పరిమితం చేసి, ఆయన చూపిన మార్గంలో నడిచే వారిని నిర్లక్ష్యం చేస్తే అది గాంధీ ఆలోచనలకు చేసే అతిపెద్ద అన్యాయం అవుతుంది. గాంధీని గౌరవించడం అంటే ఆయన చిత్రపటానికి పూలమాల వేయడం కాదు; సత్యం కోసం నిలబడిన స్వరాలను వినడం, ప్రజా సమస్యలపై నైతికంగా స్పందించడం. ప్రజాస్వామ్యం ఎన్నికలతో మాత్రమే జీవించదు; ప్రశ్నించే పౌరులతో, వినే ప్రభుత్వాలతో, స్పందించే సమాజంతో జీవిస్తుంది. ఒక విద్యావేత్త, ఒక పర్యావరణవేత్త, ఒక విద్యార్థి లేదా ఒక సాధారణ పౌరుడు అహింసా మార్గంలో తన బాధను వ్యక్తం చేస్తే, అతడిని ప్రత్యర్థిగా కాకుండా ప్రజాస్వామ్య మనస్సాక్షిగా చూడగలిగినప్పుడే గాంధీ చూపిన భారతదేశం సజీవంగా ఉంటుంది. లేకపోతే అహింస చరిత్ర పుస్తకాలలోనే మిగిలిపోతుంది; ప్రజాస్వామ్యం తన నైతిక శక్తిని క్రమంగా కోల్పోతుంది. భారతదేశం ముందు ఉన్న అసలు సవాలు ఇదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *