
సామాజిక వేత్త,విశ్లేషకులు.
సెల్ : 9949194327.
అయితే ఎల్‌నినో ప్రభావం కారణంగా రుతుపవనాల బలం తగ్గడం, వర్షాల పంపిణీ అసమానంగా మారడం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిణామాలు సాధారణమవుతున్నాయి. దీంతో రైతు పంట ఎప్పుడు వేయాలి? ఏ పంట వేయాలి? ఎంత పెట్టుబడి పెట్టాలి? అనే సందిగ్ధంలో పడుతున్నాడు. ఈ ఏడాది అనేక ప్రాంతాల్లో తొలి వర్షాలను నమ్ముకుని రైతులు విత్తనాలు వేశారు. కానీ తర్వాత వర్షాలు లేకపోవడంతో మొలకలు ఎండిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు అతిగా కురవడంతో విత్తనాలు కొట్టుకుపోయాయి. ఫలితంగా మళ్లీ విత్తనాలు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇప్పటికే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, కూలీల ఖర్చులతో సతమతమవుతున్న రైతుకు ఇది అదనపు భారంగా మారింది. ప్రకృతి వైపరీత్యం వల్ల కలిగే నష్టాన్ని రైతు ఒక్కడే భరించడం సమంజసం కాదు.
వాతావరణ మార్పులు ఇప్పుడు తాత్కాలిక సమస్య కాదు; శాశ్వత సవాలు. కాబట్టి వ్యవసాయ విధానాల్లో కూడా మార్పు అవసరం. ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి. అధిక నీరు అవసరమయ్యే పంటల స్థానంలో తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలి.చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును పెంచేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అవసరం. ఇదే భవిష్యత్ ఆహార భద్రతకు కూడా దోహదపడుతుంది.ప్రభుత్వాల పాత్ర ఈ సమయంలో అత్యంత కీలకం. రైతులకు వాతావరణ సమాచారాన్ని గ్రామ స్థాయిలో అందించాలి. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలపై సూచనలు ఇవ్వాలి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా చూడాలి. పంట బీమా పథకాలు పారదర్శకంగా అమలు కావాలి. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందే వ్యవస్థను బలోపేతం చేయాలి.అలాగే చెరువులు, కుంటలు, కాలువల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ, సూక్ష్మ సాగునీటి పద్ధతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు అభివృద్ధి చేస్తున్న వాతావరణ అనుకూల వంగడాలను రైతులకు చేరవేయాలి. మొబైల్ సందేశాలు, గ్రామ సభలు, రైతు వేదికల ద్వారా శాస్త్రీయ సలహాలను విస్తృతంగా అందించాలి.తెలంగాణలో వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటలు ప్రధానంగా ఖరీఫ్‌లో సాగవుతాయి. వర్షాలు ఆలస్యమైతే విత్తనాల విత్తకం ఆలస్యం అవుతుంది. విత్తిన తర్వాత వర్షాలు లేకపోతే మొలకలు దెబ్బతింటాయి. కొన్ని సందర్భాల్లో రైతులు మళ్లీ విత్తనాలు వేయాల్సి వస్తుంది. దీనివల్ల సాగు వ్యయం పెరిగి రైతులు అప్పుల భారంలో కూరుకుపోతున్నారు. ఎర్లీ ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాల వినియోగం కూడా పెరుగుతుంది. బోర్లు,మోటార్లపై ఆధారపడాల్సి రావడంతో విద్యుత్, డీజిల్ ఖర్చులు అధికమవుతాయి.నీటి లభ్యత తగ్గితే పంట దిగుబడులు కూడా తగ్గే ప్రమాదం ఉంది. ఇది రైతుల ఆదాయాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది.ఇలాంటి పరిస్థితుల్లో రైతులు సంప్రదాయ పంటలతో పాటు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను కూడా పరిశీలించాలి.పెసలు,మినుములు, కందులు,జొన్న,సజ్జ,రాగి వంటి పంటలు తక్కువ వర్షపాతాన్ని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. వ్యవసాయ శాఖ,శాస్త్రవేత్తలు సూచించే పంటల ఎంపిక రైతులకు మేలు చేస్తుంది.వాతావరణ హెచ్చరికలను రైతు సకాలంలో అందుకునేలా సాంకేతిక వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి.
“వాతావరణ మార్పులు ఇప్పుడు తాత్కాలిక సమస్య కాదు; శాశ్వత సవాలు. కాబట్టి వ్యవసాయ విధానాల్లో కూడా మార్పు అవసరం. ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి. అధిక నీరు అవసరమయ్యే పంటల స్థానంలో తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలి.”-డాక్టర్ మోటె చిరంజీవి
గత అనుభవాల ప్రకారం, దేశవ్యాప్తంగా బలహీన ఎల్‌నినో పరిస్థితుల్లో వ్యవసాయ ఉత్పత్తి సుమారు 3 నుంచి 5 శాతం,మోస్తరు ఎల్‌నినోలో 5 నుంచి 10 శాతం,తీవ్రమైన ఎల్‌నినో పరిస్థితుల్లో 10 నుంచి 15 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.పూర్తిగా వర్షాధార ప్రాంతాల్లో ఈ నష్టం 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు.తెలంగాణ పరిస్థితి మరింత సున్నితమైనది.రాష్ట్రంలో గణనీయమైన సాగు విస్తీర్ణం ఇప్పటికీ వర్షాలపై ఆధారపడుతోంది. ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉన్న సంవత్సరాల్లో వరి సాగు విస్తీర్ణం 10 నుంచి 15 శాతం,పత్తి దిగుబడి 15 నుంచి 25 శాతం,మొక్కజొన్న 15 నుంచి 25 శాతం,సోయాబీన్ 10 నుంచి 25 శాతం, పప్పుధాన్యాల్లో 5 నుంచి 15 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు.కొన్ని వర్షాభావ మండలాల్లో ఈ నష్టం 30 శాతం వరకు చేరే ప్రమాదం ఉంది.దిగుబడులు తగ్గడం అంటే కేవలం రైతు ఆదాయం తగ్గడమే కాదు. ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గితే మార్కెట్లో ధరలు పెరుగుతాయి. పశువుల మేత కొరత ఏర్పడుతుంది. గ్రామీణ ఉపాధి దెబ్బతింటుంది. వ్యవసాయంపై ఆధారపడిన చిన్న వ్యాపారులు కూడా నష్టపోతారు. ఒక ప్రకృతి సంఘటన మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే స్థాయికి చేరుతుంది.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవడం అత్యంత అవసరం. వాతావరణ అంచనాలను రైతులకు వేగంగా చేరవేయడం, ప్రాంతానుకూల ప్రత్యామ్నాయ పంటలను సూచించడం, నాణ్యమైన విత్తనాలు అందించడం, పంట బీమా అమలును బలోపేతం చేయడం,చెరువులు,కుంటలను పునరుద్ధరించడం,సూక్ష్మ సాగునీటి పద్ధతులను విస్తరించడం వంటి చర్యలు రైతుకు భరోసా కల్పిస్తాయి.రైతులు కూడా మారుతున్న వాతావరణానికి అనుగుణంగా సాగు పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకే పంటపై ఆధారపడకుండా మిశ్రమ సాగు,తక్కువ నీటితో పెరిగే పంటల సాగు, నేల తేమను కాపాడే పద్ధతులను అవలంబించడం, వ్యవసాయ శాఖ సూచనలను పాటించడం ద్వారా నష్టాలను కొంతవరకు తగ్గించుకోవచ్చు.వాతావరణ సంక్షోభాన్ని కేవలం ప్రకృతి సమస్యగా కాకుండా ఆర్థిక, సామాజిక సవాలుగా చూడాల్సిన అవసరం ఉంది.రైతు ఆదాయం తగ్గితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది. దాని ప్రభావం మార్కెట్ల నుంచి వినియోగం వరకు అన్ని రంగాలపై పడుతుంది.
కాబట్టి రైతును ఆదుకోవడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే. ఎల్‌నినో ప్రభావం ఖరీఫ్ సీజన్‌ను అనిశ్చితిలోకి నెడుతోంది. వర్షాలు ఎప్పుడు పడతాయో,ఎంత పడతాయో అంచనా వేయడం కష్టమవుతున్న పరిస్థితుల్లో రైతు ఒంటరిగా పోరాడలేడు. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని “నీటి ఆధారిత వ్యవసాయం” నుంచి “వాతావరణ అనుకూల వ్యవసాయం” వైపు అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది. శాస్త్రీయ సలహాలు, ప్రభుత్వ సహకారం, రైతుల అవగాహన – ఈ మూడు కలిసొస్తేనే ఎల్‌నినో కష్టకాలాన్ని అవకాశంగా మార్చుకోవచ్చు. లేకపోతే ఖరీఫ్ ప్రతి ఏడాది రైతుకు పరీక్షగా మారే ప్రమాదం ఉంది.ఎర్లీ ఎల్‌నినో ప్రభావం రైతాంగానికి హెచ్చరిక మాత్రమే కాదు.వ్యవసాయ విధానాలను పునఃసమీక్షించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్న సంకేతం. శాస్త్రీయ ప్రణాళిక, సమర్థవంతమైన ప్రభుత్వ విధానాలు,సమయానుకూల వాతావరణ సమాచారం, రైతుల అవగాహన,ఈ నాలుగు అంశాలు కలిసొస్తేనే ఖరీఫ్ కష్టకాలాన్ని అవకాశంగా మార్చుకోవచ్చు.రైతు బాగుంటేనే వ్యవసాయం బాగుంటుంది. వ్యవసాయం బాగుంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. అందుకే ఎర్లీ ఎల్‌నినో సవాల్‌ను ఎదుర్కోవడం కేవలం రైతు బాధ్యత కాదు.ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు,సమాజం కలిసి నిర్వర్తించాల్సిన జాతీయ బాధ్యత.


-డాక్టర్ మోటె చిరంజీవి 


