యూపీఐ పేమెంట్స్ ఖేల్ ఖతం

“యూపీఐని ఉచితంగా ఉంచడాన్ని గ్లోబల్ కార్డ్ నెట్‌వర్క్‌లు, పెద్ద టెక్ ప్లాట్‌ఫారమ్‌లు జీర్ణించుకోలేక పోతున్నాయి. వీసా, మాస్టర్ కార్డ్ వంటి విదేశీ కార్డ్ కంపెనీల వ్యాపారానికి ఉచిత యూపీఐ గట్టి పోటీగా మారింది.గూగుల్ పే, ఫోన్‌పే వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పటికే డేటా మైనింగ్, ప్రకటనల ద్వారా లాభాలు పొందుతున్నప్పటికీ, ఇంకా మరింత మోనిటైజేషన్ అవకాశాలను కోరుతున్నాయి..”

యూపీఐ భారతదేశంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు ప్రతీకగా, చిన్న వ్యాపారుల నుంచి సామాన్య పౌరుల వరకు అందరికీ ఉచిత, వేగవంత, సురక్షిత చెల్లింపు వేదికగా స్థిరపడింది. 2020 నుంచి అమల్లో ఉన్న “జీరో ఎండీఆర్” విధానం వల్ల ఛార్జీలు లేకుండా లావాదేవీలు చేయడం సాధ్యమై, యూపీఐ దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక చర్యగా గుర్తింపు పొందింది. ఇప్పుడు రూ.2,000 దాటిన లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ విధించాలనే ఆలోచన కారణంగా క్యాష్ లెస్ ఎకానమీకి గండిపడింది.

ఉచిత యూపీఐ విజయానికి సంకేతం

ఉచిత యూపీఐ , జీరో ఎండీఆర్ వల్ల యూపీఐ వాడకం ఎంత పెరిగిందో గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి: 2019–20లో యూపీఐ లావాదేవీల మొత్తం విలువ రూ.21.3 లక్షల కోట్లు.2024–25 నాటికి ఇది రూ.260.56 లక్షల కోట్లకు పెరిగింది.2026 ఆగస్టులో ఒక్క నెలలోనే 24,508.96 మిలియన్ (దాదాపు 2,450.9 కోట్ల) లావాదేవీలు జరిగి, వాటి విలువ రూ.29.82 లక్షల కోట్లుగా నిలిచింది.యూపీఐతో అనుసంధానమైన బ్యాంకుల సంఖ్య 752కు చేరింది. ఇది ఒక సాధారణ చెల్లింపు యాప్ విజయసంకేతం కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో గట్టి నెట్వర్క్ ప్రభావం కలిగించిన “పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్” ఎలా ఉండాలో చూపిన ఉదాహరణ. ఈ స్థాయి వృద్ధికి ప్రధాన కారణం సరళత, వేగం, ముఖ్యంగా యూపీఐని ఉచితంగా ఉంచడమే . యూపీఐ భారతీయ డిజిటల్ విప్లవానికి సంకేతంగా నిలిచింది.

యూపీఐ నిర్వహణ ఖర్చు

యూపీఐ మౌలిక వసతుల సంరక్షణ, సైబర్ భద్రత, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లకు నిరంతరంగా పెట్టుబడి అవసరం. అయితే ప్రభుత్వం చెబుతున్న యూపీఐ నిర్వహణ ఖర్చు వాదన అర్థరహితమైంది. ప్రభుత్వం దీనికోసం 2021నుంచి 2025 వరకు యూపీఐ, రూపే కోసం ప్రభుత్వ ప్రోత్సాహకాల రూపంలో మొత్తం సుమారు రూ.8,730 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం సంవత్సరానికి సిస్టమ్ నిర్వహణ, ప్రోత్సాహక వ్యయం దాదాపు రూ.8,000 కోట్ల వరకు  ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

అయితే ఇదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి రూ.3 లక్షల కోట్ల మిగులు నిధులు బదిలీ చేసింది. యూపీఐలో భాగస్వామ్య బ్యాంకులు 2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం దాదాపు 3.5 లక్షల కోట్లకు సమానమైన లాభాలు (సుమారు 42 బిలియన్ డాలర్లు) ఆర్జించాయి.యూపీఐని నిర్వహించే లాభాపేక్షలేని NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కూడా గత సంవత్సరంలో ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల పన్ను చెల్లించింది.

ఈ నేపథ్యంలో సంవత్సరానికి సుమారు రూ.8,000 కోట్ల యూపీఐ వ్యవస్థ నిర్వహణ వ్యయాన్ని “ప్రభుత్వం భరించలేని సబ్సిడీ భారం”గా చూపించడం పస లేని వాదనగా తేలుతోంది.   ప్రభుత్వానికి, ఆర్బిఐ ద్వారా, బ్యాంకుల భారీ లాభాల ద్వారా, ఆర్థిక వ్యవస్థ నుండి ఇప్పటికే వేల కోట్ల రూపాయల  ప్రవాహం జరుగుతోంది. అలాంటి పరిస్థితిలో, యూపీఐ వంటి కీలక మౌలిక సదుపాయానికి అవసరమైన కొన్ని వేల కోట్లు ప్రభుత్వం లేదా బ్యాంకులు భరించలేవు అనడం నమ్మశక్యంగా లేదు. ఆర్థిక నిపుణులు యూపీఐని “పబ్లిక్ గుడ్”గా, అంటే ప్రభుత్వం, ఆర్బిఐ, బ్యాంకులు కలిసి లాభాల కొంత భాగంతో నిర్వహించాల్సిన ప్రజా మౌలిక వసతిగా చూడాలని వాదిస్తున్నారు.

చిరు వ్యాపారుల తక్కువ లాభాల మార్జిన్లు

చిరు వ్యాపారుల లాభాల మార్జిన్ తక్కువగా ఉంటుంది. వారిపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ రుసుములు విధిస్తే ఆ భారం చివరకు వినియోగదారుడు మోయక తప్పదు. అనేక మొబైల్ రిటైలర్ల నికర లాభ మార్జిన్ కేవలం 0.75 నుంచి 1.5 శాతం వరకు ఉంది. FMCG, కిరాణా వ్యాపారాల్లో నికర మార్జిన్ సుమారు 1.5 నుంచి 2 శాతం వరకు పెట్రోల్ పంపుల మార్జిన్ దాదాపు 0.5 శాతం మాత్రమే ఉంటుంది. ఇలాంటి రంగాల్లో, రూ.10,000 యూపీఐ చెల్లింపుపై రూ.40 ఎండీఆర్ (0.4%) అంటే లాభంలో గణనీయమైన శాతం నేరుగా కత్తిరించినట్లే. అందుకే మధ్యప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల పెట్రోల్ డీలర్లు రూ.2,000 దాటిన యూపీఐ చెల్లింపులను స్వీకరించమని ప్రకటిస్తున్నారు. ఆర్థిక శాస్త్రంలోని సత్యం ఏమిటంటే, వ్యాపారి మీద పడే ప్రతి ఖర్చు చివరికి వినియోగదారుడుపై మోపబడుతుంది. ఎండిఆర్ చార్జీలతో వస్తువుల ధరలు పెరగడం లేదా యూపీఐని నిరుత్సాహపరచి, క్యాష్ లేదా ఇతర మార్గాల వైపు మళ్లించడం జరుగుతుంది. అందుకే, “వినియోగదారుడిపై భారం లేదు” అనే అధికారిక వాదన వాస్తవానికి సరిపోదు.

డిజిటల్ విప్లవానికి ఎదురుదెబ్బ

నోట్ల రద్దు తరువాత ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను బలంగా ప్రోత్సహించింది.రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా సులభంగా చెల్లింపులు చేయగలగడం వల్ల చిన్న వ్యాపారులు, వీధి విక్రేతలు, సాధారణ ప్రజలు పెద్దగానే లాభపడ్డారు.ఇప్పుడు అదే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై రుసుములు విధించడం, ఆ విప్లవానికి వెనకడుగులా మారే ప్రమాదం ఉంది . రుసుములు విధిస్తే వినియోగదారులు డిజిటల్ నుంచి తిరిగి నగదు వైపు మళ్ళుతారు. వ్యాపారులు ఈ 0.4% రుసుమును జీర్ణించుకోలేక, ధరలను 2% నుంచి 4% వరకు పెంచే అవకాశం ఉంది. దాంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగి ప్రజల్లో అసంతృప్తి ఏర్పడుతుంది. రాజకీయ ఉద్యమాలు సైతం సంభవించవచ్చు.ఇవి అన్నీ కలిపి చూస్తే, యూపీఐపై ఎండీఆర్ విధించడం దేశం గత 6–8 ఏళ్లుగా కష్టపడి నిర్మించిన డిజిటల్ చెల్లింపుల సంస్కృతికి స్పష్టమైన దెబ్బగా కనిపిస్తోంది.

 

గ్లోబల్, కార్పొరేట్ ఒత్తిళ్లు

యూపీఐని ఉచితంగా ఉంచడాన్ని గ్లోబల్ కార్డ్ నెట్‌వర్క్‌లు, పెద్ద టెక్ ప్లాట్‌ఫారమ్‌లు జీర్ణించుకోలేక పోతున్నాయి. వీసా, మాస్టర్ కార్డ్ వంటి విదేశీ కార్డ్ కంపెనీల వ్యాపారానికి ఉచిత యూపీఐ గట్టి పోటీగా మారింది.గూగుల్ పే, ఫోన్‌పే వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పటికే డేటా మైనింగ్, ప్రకటనల ద్వారా లాభాలు పొందుతున్నప్పటికీ, ఇంకా మరింత మోనిటైజేషన్ అవకాశాలను కోరుతున్నాయి. భారత్–అమెరికా వాణిజ్య చర్చల్లో, యూపీఐని ఉచితంగా నడపడం “సబ్సిడీ”గా చిత్రీకరించి, అమెరికా కార్పొరేట్ ప్రయోజనాల కోసం భారత్‌పై అధిక టారిఫ్ లు మోపే అవకాశం ఉంది. విదేశీ ఒత్తిడిల కారణంగా గత 14 ఏళ్లలో భారతదేశం ప్రపంచ స్థాయిలో సాధించిన అతిపెద్ద సాంకేతిక విజయం ప్రశ్నార్థకంగా మారుతుంది. యూపీఐ లాంటి విజయ ప్రయోగాన్ని కొన్ని వేల కోట్ల ఆదాయం కోసం ఛార్జీలతో బలహీనపరచడం, భారత ఫిన్ టెక్ నాయకత్వానికే ముప్పు‌గా మారుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూపీఐని ఉచితంగా ఉంచడం అంటే కేవలం దేశీయ వినియోగదారికి సౌకర్యం కాదు, అది భారతదేశం తన సాంకేతిక సార్వభౌమత్వాన్ని, గ్లోబల్ లీడర్‌షిప్‌ను కాపాడుకునే నిర్ణయం కూడా.

యూపీఐని “పబ్లిక్ గుడ్”గా, పూర్తి ఉచితంగా కొనసాగించాలి

యూపీఐ వృద్ధికి ఉచితత్వం మూలస్తంభం. లావాదేవీల విలువ 5 ఏళ్లలో దాదాపు 12 రెట్లు పెరగడం, నెలకు లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరగడం, ఇవన్నీ “జీరో ఎండీఆర్” వల్ల సాధ్యమయ్యాయి.యూపీఐ నిర్వహణ ఖర్చు, ఆర్బిఐ మరియు బ్యాంకుల లాభాలతో పోలిస్తే చాలా చిన్నది. ఆర్బిఐ ఒక్కటే సంవత్సరానికి రూ.3 లక్షల కోట్ల మిగులు ప్రభుత్వానికి ఇస్తున్నప్పుడు, బ్యాంకులు లక్షల కోట్ల లాభాలు ఆర్జిస్తున్నప్పుడు, సంవత్సరానికి కొన్ని వేల కోట్ల యూపీఐ వ్యయాన్ని “భరించలేం, కాబట్టి ఛార్జీలు తప్పవు” అనడం ఆర్థికంగా న్యాయ సంగతం కాదు.ఎండీఆర్ భారం చివరికి వినియోగదారుడిపైనే పడుతుంది, డిజిటల్ విప్లవానికి ప్రమాదం. తక్కువ లాభ మార్జిన్ ఉన్న వ్యాపారులు ఈ రుసుమును భరించలేరు, కాబట్టి ధరలు పెరుగుతాయి. ప్రజలు క్యాష్ వైపు మళ్ళీతే నోట్ల రద్దు ప్రయోజనం అర్థరహితం అవుతుంది. ఈ నేపథ్యంలో, యూపీఐని పూర్తిగా ఉచితంగా ఉంచడం అవసరం. ఆర్థికంగా ఇది సాధ్యమే.సామాజిక న్యాయ పరంగా సముచితం. అందుకే సాంకేతికంగా, వ్యూహాత్మకంగా భారత ప్రయోజనాలకు అనుగుణంగా యూపీఐని “పబ్లిక్ గుడ్”గా భావించి, P2P గానీ, వ్యాపార లావాదేవీలుగానీ, అన్నింటికీ పూర్తిగా ఉచితంగా కొనసాగించడం దేశానికి శ్రేయస్కరంగా ఉంటుంది.

నోముల శ్రీనివాస్ రెడ్డి (అడ్వకేట్) 

9441357274

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *