పోలీసులకు నేరాలను నిరోధించే అధికారం ఉంది. నిందితులను విచారించే బాధ్యత ఉంది. అవసరమైన సందర్భంలో అరెస్టు చేసే అధికారమూ ఉంది. కానీ ఈ అధికారాలన్నీ రాజ్యాంగం, చట్టం, న్యాయస్థానాల ఆదేశాలకు లోబడే ఉండాలి. ఎవరి ఒత్తిడో, ఎవరి ఆదేశమో, కేసు తీవ్రత పేరుతోనో చట్టం నిర్దేశించిన హద్దులను దాటడానికి పోలీసులకు స్వేచ్ఛ లేదు. తెలంగాణ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఈ ప్రాథమిక సూత్రాన్ని మరోసారి బలంగా గుర్తుచేసింది. ఒక వరకట్న మరణం కేసులో నిందితుడికి హైకోర్టు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించింది. ఏప్రిల్ 21న ఇచ్చిన రక్షణను ఆ తర్వాత రెండుసార్లు పొడిగించింది. అయినప్పటికీ ఏప్రిల్ 28న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు హైకోర్టు రక్షణ ఉత్తర్వులు అమల్లో ఉన్న విషయం వెల్లడికావడంతో రిమాండ్‌ను తిరస్కరించి విడుదల చేయాల్సి వొచ్చింది. ఈ వ్యవహారంపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో సంబంధిత పోలీసు అధికారికి తెలంగాణ హైకోర్టు నెల రోజుల జైలు శిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధించింది. అప్పీల్ చేసుకునేందుకు శిక్ష అమలును నాలుగు వారాలు నిలిపివేసింది.
ఇక్కడ నిందితుడిపై ఉన్న కేసు తీవ్రతను తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. వరకట్న మరణం వంటి ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. బాధితులకు న్యాయం జరగాలి. నిష్పాక్షిక దర్యాప్తు జరగాలి. నేరం రుజువైతే చట్టప్రకారం శిక్ష పడాలి. కానీ తీవ్రమైన ఆరోపణ ఉన్న వ్యక్తికీ చట్టం కల్పించిన హక్కులు ఉంటాయి. న్యాయస్థానం ఇచ్చిన రక్షణను పోలీసులు తమకు అనుకూలంగా అర్థం చేసుకోవడానికి వీల్లేదు. ఈ కేసులో అధికారి చేసిన వాదన మరింత కీలకమైన ప్రశ్నను ముందుకు తెచ్చింది. మధ్యంతర రక్షణ పొడిగించిన విషయం తనకు తెలియదని, అరెస్టు చేయాలనే ఒత్తిడి ఉందని ఆయన వివరణ ఇచ్చారు. కానీ మొదటి కోర్టు ఉత్తర్వు తెలిసిన అధికారికి దాని తదుపరి స్థితిని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను సంప్రదించవొచ్చు; హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో ఉత్తర్వును పరిశీలించవొచ్చు. ఆ కనీస జాగ్రత్త తీసుకోకుండా వ్యక్తి స్వేచ్ఛను హరించడం సమర్థనీయం కాదన్నదే తీర్పు సారాంశం.
అన్నింటికంటే “అరెస్టు చేయాలనే ఒత్తిడి ఉంది” అనే వివరణే మన పోలీసింగ్ వ్యవస్థపై పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది. ఆ ఒత్తిడి ఎక్కడి నుంచి వొచ్చింది? రాజకీయ నాయకత్వం నుంచా? ఉన్నతాధికారుల నుంచా? ప్రజాభిప్రాయం నుంచా? కేసు తీవ్రత వల్ల ఏర్పడిన పరిస్థితుల నుంచా? ఏదైనా సరే—చట్టబద్ధమైన పోలీసింగ్‌లో సమాధానం ఒక్కటే ఉండాలి: ఒత్తిడి కంటే చట్టమే ప్రధానం. అరెస్టు అనేది సాధారణ పరిపాలనా చర్య కాదు. అది ఒక వ్యక్తి స్వేచ్ఛను ప్రభుత్వం తన అధికారంతో పరిమితం చేసే అత్యంత తీవ్రమైన చర్య. అందుకే అరెస్టు చేసే అధికారంతోపాటు దానిని బాధ్యతాయుతంగా ఉపయోగించాల్సిన కర్తవ్యమూ పోలీసులకు ఉంటుంది. ఎఫ్ ఐ ఆర్ నమోదైంది కాబట్టి అరెస్టు చేయడం, పై నుంచి చెప్పారని అదుపులోకి తీసుకోవడం, కోర్టు ఆదేశం తమకు అందలేదని చెప్పడం—ఇలాంటి పద్ధతులకు ప్రజాస్వామ్య వ్యవస్థలో చోటుండకూడదు.
ఈ తీర్పును ఒక పోలీసు అధికారికి విధించిన శిక్షగా మాత్రమే చూడకూడదు. మొత్తం పోలీసు వ్యవస్థకు వ్యవస్థ పాఠంగా గా తీసుకోవాలి. ప్రతి పోలీస్ స్టేషన్‌లో అరెస్టుకు ముందు సంబంధిత వ్యక్తికి బెయిల్ లేదా కోర్టు రక్షణ ఉందా అనే విషయాన్ని నిర్ధారించే డిజిటల్ వెరిఫికేషన్ వ్యవస్థ ఉండాలి. అరెస్ట్ చెక్ లిస్ట్ లో కౌంటర్ ఆర్డర్ వెరిఫికేషన్ ను తప్పనిసరి చేయాలి. హైకోర్టు ఉత్తర్వులు, ప్రాసిక్యూషన్ విభాగం, పోలీసు కేసు పర్యవేక్షణ వ్యవస్థలను సాంకేతికంగా అనుసంధానించాలి. “తెలియదు” అనే సమాధానానికి అవకాశమే లేకుండా చేయాలి.
అదే సమయంలో పోలీసు అధికారులపై చట్టవిరుద్ధమైన ఒత్తిడి ఉంటే దానిని తిరస్కరించగల సంస్థాగత రక్షణ కూడా అవసరం. పోలీసు అధికారి చట్టాన్నిపాటించినందుకు రాజకీయంగా లేదా పరిపాలనాపరంగా ఇబ్బందిపడే పరిస్థితి ఉండకూడదు. పోలీసు స్వతంత్రత అంటే జవాబుదారీతనం లేని అధికారం కాదు; చట్టానికి మాత్రమే జవాబుదారీగా పనిచేసే స్వేచ్ఛ. కోర్టు ఉత్తర్వులను గౌరవించడం న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ కోసం మాత్రమే కాదు. ఆఖరుకు అది సామాన్య పౌరుడి స్వేచ్ఛకు రక్షణ కవచం. ప్రభుత్వం ఎంత బలమైనదైనా, పోలీసులకు ఎంత అధికారం ఉన్నా, వ్యక్తికి ఎంత తీవ్రమైన ఆరోపణ ఎదురైనా—అందరికంటే పైన చట్టమే ఉండాలి. అందుకే తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సందేశం స్పష్టం: సంకెళ్లు వేయడానికి పోలీసులకు అధికారం ఉండవచ్చు… కానీ చట్టాన్ని దాటడానికి ఎవరికీ అధికారం లేదు.





