కల నెరవేరి పదేళ్లు పూర్తి

– నాటి గోడ మీద రాతలే నేడు నిజయమ్యాయి
– జిల్లా కోసం ఎన్టీఆర్ కు వినతిపత్రం ఇచ్చిన కేసీఆర్
– అదే కేసీఆర్ సీఎంగా సిద్దిపేట జిల్లా ఏర్పాటు
– రైలు, గోదావరి జలాలు సిద్దిపేటకు వచ్చాయి
– సిద్దిపేట దశాబ్ది ఉత్సవాల్లో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు 

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 9:  సిద్దిపేట జిల్లాగా ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన 10కె రన్ ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు  జెండా ఊపి ప్రారంభించారు. ఉదయాన్నే ఆహ్లాదకరమైన వాతావరణంలో వేలాదిమంది యువతీయువకులు, క్రీడాకారులు, విద్యార్థులు, పట్టణ ప్రముఖులు ఈ పరుగులో ఉత్సాహంగా పాల్గొన్నారు. హరీశ్ రావు కూడా 10కె రన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా అనేది ఒక దశాబ్దాల కల. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దిపేట జిల్లా చేస్తామని 30 ఏళ్లు, 40 ఏళ్లు గోడల మీద రాతలు, ఎన్నికల నినాదాలు, కరపత్రాలు చూశాం. కానీ ఆ కలను నిజం చేసుకున్న రోజు 2016 అక్టోబర్ 11 అని గుర్తు చేశారు. 2026 అక్టోబర్ 11నాటికి మన సిద్దిపేట జిల్లాకు 10 ఏళ్లు నిండుతున్నాయి. పదేళ్లు నిండుతున్న పండుగలో మీరందరూ ఈ 10కె రన్‌లో పాల్గొనడానికి రావడం చాలా సంతోషమన్నారు. ఈ రన్ ఎంత వేగంగా జరుగుతుందో మన సిద్దిపేట జిల్లా కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఇన్ని స్పోర్ట్స్ క్లబ్స్ వచ్చాయంటే, ఇంత గొప్ప క్రీడా మైదానాలు ఇక్కడ ఏర్పడ్డాయంటే, ఇన్ని జిల్లా కార్యాలయాలు ఇక్కడ వచ్చాయంటే, సిద్దిపేట ఇంత వేగంగా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం జిల్లా ఏర్పడడం వల్లే సాధ్యమైందన్నారు. ఇక్కడ తమ పీఈటీ టీచర్లు కనబడుతున్నారు, స్పోర్ట్స్ క్లబ్స్ వాళ్లు కనబడుతున్నారు.. ఆ రోజుల్లో ఉపాధ్యాయుల బదిలీలు ఉంటే పొద్దున్నే 5 గంటలకు బస్సెక్కి సంగారెడ్డి పోయి ఎన్ని రకాల బాధలు పడ్డారో నాకంటే ఎక్కువ అనుభవించిన వాళ్లకే బాగా తెలుసన్నారు. నాడు కానిస్టేబుల్ పరీక్ష రాయడానికి సంగారెడ్డిలో పొద్దున్నే 8 గంటలకు రన్నింగ్ టెస్ట్, హై జంప్, లాంగ్ జంప్ టెస్ట్ ఉంటే రాత్రి పోయి బస్టాండ్‌లో పడుకుని, దోమలు కుడుతుంటే ఎంతో ఇబ్బంది పడి ఉదయం రన్నింగ్‌లో పాల్గొన్నామని మొన్న ఒక కానిస్టేబుల్ తనతో చెప్పారన్నారు. ఇవాళ జిల్లా ఏర్పడ్డ తర్వాత అది ఎంసెట్ పరీక్ష అయినా, ఇంకే పరీక్షలైనా సిద్దిపేటలోనే మనం చేసుకోగలుగుతున్నామన్నారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా, సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లా ఇలా ప్రజలకు ఎన్నో కోరికలు ఉండేవి. ఆ 33 జిల్లాల కలను నిజం చేసి 33 అభివృద్ధి కేంద్రాలను తీర్చిదిద్దిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది. జిల్లా ఏర్పడకముందు సిద్దిపేట ఎట్లా ఉండేది? జిల్లా ఏర్పడ్డ తర్వాత ఎట్లా మారింది? రేపటి సిద్దిపేట ఎలా ఉండాలో కల కనాలి.. ఆ కలను నిజం చేసుకోవడం కోసం మనమందరం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏదైనా ఆకాంక్ష లేకపోతే దానికి ఒక రూపం ఉండదు. జిల్లా కావాలనే ఆకాంక్ష 1983లోనే మొదలైంది. 1983లో అప్పట్లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సిద్దిపేటకు వచ్చారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా సిద్దిపేటకు వస్తే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి దరఖాస్తును ఎన్టీఆర్ కు ఇచ్చారు. ఏ చేత్తోనైతే ఎన్టీఆర్ కు దరఖాస్తు ఇచ్చారో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అదే చేత్తో సంతకం పెట్టి కేసీఆర్ సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. 1983 నుంచి 2016 అంటే 30 ఏళ్ల తర్వాత తానే ముఖ్యమంత్రిగా ఈ జిల్లాను ఏర్పాటు చేశారన్నారు. ఒకప్పుడు మనకు మూడు నినాదాలు ఉండేవి.. సిద్దిపేట జిల్లా కావాలి, సిద్దిపేటకు రైలు రావాలి, సిద్దిపేటకు గోదావరి జలాలు రావాలి. ఈ మూడు కూడా ఇవాళ కళ్లముందు నిజమైనాయి కదా. కళ్లముందు రంగనాయక సాగర్‌లో గోదావరి జలాలు కనబడుతున్నాయి. ఇటు నర్సాపూర్ వైపు చూస్తే పొద్దున్నే చుక్ చుక్ రైలు కనబడుతుంది. ఇటు సిద్దిపేట జిల్లా ఏర్పడి కలెక్టర్, సీపీ, జిల్లా కార్యాలయాలతో అద్భుతమైన సిద్దిపేటను మనం ఆవిష్కరించుకోగలిగాం అని చెప్పారు. మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, పారామెడికల్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, బీ-ఫార్మసీ కాలేజ్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్, మేనేజ్‌మెంట్ కాలేజ్.. ఇట్లా ఎన్నెన్నో కాలేజీలు తెచ్చుకున్నాం. రేపటి సిద్దిపేటలో ఒక యూనివర్సిటీ రావాలి.. ఇదొక్కటే ఇక మనకు తక్కువ ఉన్నది. ఆ యూనివర్సిటీని కూడా తప్పకుండా సాధించుకుందాం.. ఆ దిశగా మనం అడుగులు వేద్దాం, ఆ దిశగా ప్రయాణిద్దాం, ఆ దిశగా మన పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును ఆవిష్కరించుకుందాం అని హ‌రీష్‌రావు అన్నారు.న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *