సింథటిక్ మాంజా విక్రయిస్తే లైసెన్సు రద్దు

– పాల పిట్టల రక్షణకు పటిష్ట చర్యలు
– అటవీ దళాల అధిపతి వినయ్‌కుమార్

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : సింథటిక్ మాంజా విక్రయాలు, వినియోగాన్ని అరికట్టడంతో పాటు పాలపిట్టలు, ఇతర వన్యప్రాణుల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అటవీ దళాల అధిపతి వినయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. నిషేధిత మాంజా విక్రయించే దుకాణాల లైసెన్సుల రద్దుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశాలపై అరణ్య భవన్‌లో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింథటిక్ మాంజా ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చే సరఫరాలపై నిఘా పెంచాలని సూచించారు. ఈ మాంజా విక్రయించరాదని దుకాణాల యజమానులకు జీహెచఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ వేదికల ద్వారా చైనా మాంజా విక్రయాలు జరగకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో సింథటిక్ మాంజా విక్రయాలను గుర్తించి వాటిని అరికట్టేందుకు సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ మాంజా నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాలు సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. చైనా మాంజా వినియోగం వల్ల మనుషులు, పక్షులకు కలిగే ప్రమాదాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పాఠశాల విద్యాశాఖ అవగాహన కల్పించాలని తెలిపారు. బస్సుల్లో సింథటిక్ మాంజా అక్రమ రవాణా లేదా పాలపిట్టలు, ఇతర వన్యప్రాణుల తరలింపును గుర్తిస్తే అటవీ శాఖ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించేలా బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు సూచనలు ఇవ్వాలన్నారు.

కైట్ ఫెస్టివల్‌లో అనుమతించొద్దు

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కైట్ ఫెస్టివల్‌లో చైనా మాంజా వినియోగంపై స్వచ్ఛంద సంస్థల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని సమావేశంలో ప్రస్తావించారు. ఈసారి ఉత్సవాల్లో సింథటిక్ మాంజాను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని, గుర్తించిన వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పాలపిట్టలను పంజరాల్లో ఉంచొద్దు

దుర్గా మండపాల వద్ద పాలపిట్టలను పంజరాల్లో ఉంచి ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని వినయ్‌కుమార్ ఆదేశించారు. దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఆలయాల వద్ద ఈ ఆదేశాలు అమలయ్యేలా చూడాలన్నారు. వన్యప్రాణుల రక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో సీసీఎఫ్‌లు ప్రియాంక వర్గీస్, క్షితిజ, సీఎఫ్ ప్రసాద్ పోలీసు, జీహెచఎంసీ, హెచఎండీఏ, పాఠశాల విద్య, సినిమాటోగ్రఫీ, సమాచార ప్రసార, విద్యుత్తు, కాలుష్య నియంత్రణ మండలి, పర్యాటక శాఖలతోపాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *