చెమ్మ : వారాల ఆనంద్
మాలతీ చందూర్ సాహిత్య ప్రయాణం స్త్రీ జీవితాల్లోని సంఘర్షణ, వారి అంతరంగాల ఆవిష్కరణల నుంచి మొదలుపెట్టి ప్రపంచ సాహిత్యపు విశాలత దాకా సాగింది. తెలుగుసాహిత్యచరిత్రలో- తన రచనలతోపాటు ఒకతరం ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసిన రచయిత్రిగా ఆమె చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె నవలా రచయిత్రి మాత్రమేకాదు. కథకురాలు, అనువాదకురాలు, సాహిత్య పరిచయకర్త, కాలమిస్టు, మహిళల జీవితసమస్యలకు ఆత్మీయంగా స్పందించిన మార్గదర్శి. తెలుగుపాఠకుల ఇళ్లలోకి తెలుగు ప్రపంచ సాహిత్యాల్ని తీసుకెళ్లిన అరుదైన రచయిత్రి. మాలతీ చందూర్ సాహిత్య వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే ముఖ్యంగా మూడు ప్రధానపార్శ్వాలు కనిపిస్తాయి. ఆ కాలంనాటి స్త్రీ జీవితాన్ని అర్థం చేసుకున్న సృజనాత్మకదృష్టి, ప్రపంచసాహిత్యాన్ని తెలుగువారికి చేరువ చేసిన అనువాద ప్రతిభ, సామాజిక జీవితంతో నిరంతర సంభాషణ సాగించిన కాలమిస్టు వ్యక్తిత్వం. ఈ మూడుపార్శ్వాల సమ్మేళనమే ఆమెను తెలుగు సాహిత్యంలో ప్రత్యేకస్థానంలో నిలబెట్టింది. 1949 నుంచి రచనావ్యాసంగం ప్రారంభమైంది. ‘రవ్వలడ్డులు’ అనే కథతో కథ రచయిత్రిగా గుర్తింపు పొందారు.
మాలతీ చందూర్ రాసిన నవలలను పరిశీలిస్తే ఆమెకు సమాజం పట్ల ఉన్న పరిశీలనా దృష్టి, ముఖ్యంగా స్త్రీ జీవితంలోని సంఘర్షణల పట్ల ఉన్న అవగాహన స్పష్టమవుతాయి. ఆమె నవలల్లో స్త్రీ కేవలం కుటుంబ వ్యవస్థలోని ఒక పాత్రకాదు. ఆమెకు వ్యక్తిత్వం ఉంది. ఆలోచనలు ఉన్నాయి. ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయి. ఆత్మగౌరవం ఉంది. తన జీవితాన్ని తాను నిర్ణయించుకోవాలనే ఆకాంక్ష ఉంది. కుటుంబం, వివాహం, ఉద్యోగం, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలను ఆమె తన రచనల్లో చర్చకు తీసుకొచ్చారు. ‘చంపకం–చీడపురుగులు’, ‘ఆలోచించు’, ‘సద్యోగం’, ‘హృదయనేత్రి’, ‘శిశిర వసంతం’, ‘మనసులోని మనసు’, ‘భూమిపుత్రి’, ‘కాంచనమృగం’, ‘వైశాఖి’ వంటి రచనలు ఆమె సృజనాత్మక ప్రయాణంలో ముఖ్యమయినవి. ఆమె సుమారు 26 నవలలు రాసారు. వాటిల్లో స్త్రీ జీవిత సమస్యలను కేవలం కన్నీటికథలుగా కాకుండా సామాజిక, మానసిక కోణాల్లో విశ్లేషించే ప్రయత్నం కనిపిస్తుంది. మాలతీ చందూర్ నవలల్లో ‘కలల వెలుగు’లో పద్మలత, ‘సద్యోగం’లో సుమిత్ర, ‘ఆలోచించు’లో లలిత, ‘కాంచన మృగం’లో సుందరమ్మలాంటి గొప్పపాత్రల్ని సృజించారు. మాలతీ చందూర్ స్త్రీవాదదృక్పథం నినాదాల మీద ఆధారపడింది కాదు. స్త్రీ తన జీవితాన్ని తాను అర్థం చేసుకోవాలి, తన నిర్ణయాల పట్ల బాధ్యత వహించాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి అనే ఆలోచన ఆమె రచనల్లో అంతర్లీనంగా కనిపిస్తుంది. స్త్రీ విముక్తి అంటే కుటుంబాన్ని నిరాకరించడం మాత్రమే కాదు, కుటుంబంలోనూ సమాజంలోనూ తన వ్యక్తిత్వానికి గౌరవాన్ని సాధించుకోవడం అనే విస్తృతమైన అవగాహన ఆమె రచనల్లో కనిపిస్తుంది.
మాలతీ చందూర్ సాహిత్య జీవితంలో అత్యంత విశిష్టమైన అధ్యాయం ‘ప్రమదావనం’. ఆంధ్రప్రభ వారపత్రికలో దాదాపు 47 సంవత్సరాల పాటు కొనసాగిన ఈ శీర్షిక ఒక సాధారణ పత్రికా కాలమ్ కాదు. అది అనేకమంది మహిళల వ్యక్తిగత జీవితాలకు ఆత్మీయవేదిక. పాఠకులు తమ కుటుంబసమస్యలను, వైవాహిక జీవితంలోని సంఘర్షణలను, ఉద్యోగసమస్యలను, పిల్లల పెంపకంలో ఎదురయ్యే ఇబ్బందులను, మానసిక సందిగ్ధతలను ఆమె ముందుంచేవారు. వాటికి ఇచ్చిన సమాధానాల్లో అనుభవం, వివేకం, ఆచరణాత్మకత కనిపించేవి. ఎదుటివారి సమస్యను వినడం, దానివెనుక ఉన్న సామాజిక పరిస్థితిని అర్థం చేసుకోవడం, సాధ్యమైన పరిష్కారాన్ని సూచించడం ఆమె ప్రత్యేకత. ఆ కాలంలో మహిళలు తమ వ్యక్తిగత సమస్యలను బహిరంగంగా ఎవరితోనయినా చర్చించుకునే అవకాశాలు తక్కువ. అలాంటి సమయంలో మాలతీ చందూర్ సాహిత్య సలహాదారుగా, ఆత్మీయ సంభాషణకర్తగా మారారు. ఇక్కడ ఆమె పాఠకులను కేవలం కాలక్షేప పాఠకులుగా చూడలేదు. వారిని ఆలోచించే వ్యక్తులుగా, తమ జీవితాల పట్ల నిర్ణయాలు తీసుకోగల మనుషులుగా భావించారు గౌరవించారు. ఒక రచయిత్రి తనకలంతో సమాజంతో ఇంత సుదీర్ఘమైన సంబంధాన్ని కొనసాగించడం అరుదైన విషయం.
మాలతీ చందూర్ ప్రతిభలో మరో అద్భుతకోణం ‘అనువాదం’. ప్రపంచ సాహిత్యంలోని గొప్పరచనలను తెలుగు పాఠకులకు పరిచయం చేయాలనే తపన ఆమెను అనువాద రంగంలోకి నడిపించింది. ముఖ్యంగా స్వాతి మాసపత్రికలో ‘పాత కెరటాలు’ శీర్షిక ద్వారా ప్రపంచ నవలాసాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. వాటిని పత్రికలోంచి కట్ చేసి బైండింగ్ పుస్తకాలుగా చేసుకున్నవారు నాతో సహా అనేకమంది వున్నారు. జేన్ ఆస్టిన్ నుంచి సమకాలీన రచయితల వరకు విస్తరించిన ఈ సాహిత్య పరిచయాలు తెలుగు పాఠకుల పఠన ప్రపంచాన్ని విస్తరించాయి. అవి ‘నవలా పరిచయాలు’ పేరుతో ఐదు సంపుటాలుగా వెలువడ్డాయి. మాలతీ చందూర్ బహుముఖప్రజ్ఞకు మరో నిదర్శనం ‘వంటలు–పిండివంటలు’ పుస్తకం. 1953లో వెలువడిన ఈ పుస్తకం గొప్ప ఆదరణ పొందింది.
మాలతీ చందూర్ కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు. చిన్నతనం నుంచే పుస్తకాలు, చదవడం, సాహిత్య పరిచయాల పట్ల ఆమెకు ఆసక్తి. ఏలూరులో చదువుకున్నరోజుల్లోనే సాహిత్య వాతావరణంతో పెరిగింది. అప్పుడే శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ వంటి ప్రముఖుల సాహిత్య ప్రపంచాన్ని దగ్గరగా చూసే అవకాశం కూడా లభించింది. తను 1947లో చందూర్ నాగేశ్వరరావును వివాహం చేసుకుని మద్రాసులో స్థిరపడ్డారు. నాగేశ్వరరావు ప్రముఖ పాత్రికేయుడు, రచయిత. ఆయనతో ఏర్పడిన సాహిత్య వాతావరణం మాలతీ చందూర్ రచనా ప్రయాణానికి మరింత ప్రేరణనిచ్చింది. మాలతీ చందూర్ రచనలకు అనేక పురస్కారాలు లభించాయి. ‘హృదయనేత్రి’ నవలకు 1987లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, 1992లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇంకా భారతీయ భాషా పరిషత్ పురస్కారం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ పురస్కారం లభించాయి. ఆమె కేంద్ర సెన్సార్ బోర్డులో సభ్యురాలిగా కూడా పనిచేశారు. సినిమా, సాహిత్యం, సమాజం పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి ఆమె బహుముఖ ప్రజ్ఞను తెలియజేస్తుంది.





