అనుబంధాల అస్తిత్వం శాంతిశ్రీ బెనర్జీ

ఏకాకి వంటరితనం
కళ్ళకు కనబడే దృశ్యం

కలిసి ఉండే ఇరువురి
వ్యక్తుల మధ్య ఒంటరితనం
తెరవెనుక అదృశ్యంగా
దాగుడుమూతలాడే అతేజం!

మాటలుంటాయి
మనస్సులు పంచుకునే
అన్యోన్య సంభాషణలుండవు

అవసరాలకు పరిమితమవుతాయి
రోజువారీ సంవాదాలు

శుభోదయాలు శుభరాత్రులు
పుట్టినరోజు శుభాకాంక్షలు
పెళ్లిరోజు వేడుకలు
వాలెంటైన్ గ్రీటింగ్స్
ఇచ్చిపుచ్చుకునే కానుకలు
యధాతధంగా సాగపోతుంటాయి
అలవాటుగా మారిపోతాయి

సాంగత్యం మవుతుంది కేవలం
యాంత్రిక సహజీవనం

అందుకే

హృదయాలకు కావాలి
మృదుత్వమనే లేపనం

నిరంతర శ్రద్ధే
బాంధవ్యాలకు బలం

అధికమించాలి క్షమ అహాన్ని
అంతమవ్వాలి ఒకరిపై ఒకరి ఆధిపత్యం

సామాన్య దినచర్యలో
ఇద్దరికి ప్రత్యేకమైన
చిన్న చిన్న ఆనందాలను
ఆస్వాదిస్తూ పోవాలి

సాంగత్యమనే  ప్రస్థానంలో
అసలైన ఆత్మీయ అనుబంధాల
అస్తిత్వాన్ని పట్టుకోగలగాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *