మెరుపు తీగెలు
-బమ్మిడి జగదీశ్వరరావు
“ప్రతిసారీ అవే మార్కులా?, సిగ్గు లేదారా నీకు…” కస్సుమంది తల్లి.
మూడేళ్ళుగా చూస్తున్నా, యేమీ ప్రొగ్రెస్ లేదు, తెచ్చిన మార్కులే తెచ్చుకుంటున్నావ్…” భగ్గుమన్నాడు తండ్రి.
పిల్లాడు అలా నోరు తెరచుకు చూస్తున్నాడు.
“డాడీ యేం చెప్పారు?” తల్లి అడిగితే, చాలా చెప్పడం వల్ల అందులో యేం చెప్పాలో తెలీక అయోమయంగా చూశాడు పిల్లాడు.
“నిన్నటికంటే బెటర్‌గా వుండాలి…” తండ్రి చెప్పబోతే, “నిన్నటికంటే బెటర్‌గా వుండాలి… హెల్త్‌లో వెల్త్‌లో నాలెడ్జ్‌లో…” అందుకున్నట్టుగా రోజూ విన్నదే కాబట్టి మర్చిపోకుండా చెపుతున్నాడు పిల్లాడు. “ఇంకా?” చెపుతుంటే ఆగలేక మధ్యలో దూరి అడిగాడు తండ్రి.
“చదువులో… మార్కుల్లో… ర్యాంకుల్లో…” అన్నాడు పిల్లాడు కనుగుడ్లలో నీళ్ళు తిప్పుకుంటూ.
“నీ చదువుకు యెంత ఖర్చు అవుతుందో తెలుసా? నీ మీద యెన్ని ఆశలు పెట్టుకున్నామో తెలుసా? ఏమన్నా అంటే యేడుపు వస్తుందేం నీకు? ఎప్పుడూ ఏ ప్లస్ ప్లస్ ప్లస్ అంటావ్…” అంది తల్లి. “ఈ కాలంలో అందరికీ వస్తాయిరా యీ మార్కులు… నీకొక్కడికే కాదు… నువ్వొక్కడివే కష్టపడిపోవడం లేదు…” అన్నాడు తండ్రి తీసి పడేస్తూ.
కళ్ళు తుడుచుకుంటూ సీరియస్సుగా చూశాడు పిల్లాడు.
“ఆ చూపేంట్రా? ఆ…” కళ్ళు నిలేసి చూశాడు తండ్రి.
“వందకు వంద మార్కులే యేస్తారు డాడీ… అంతకన్నా వెయ్యరు…” గింజుకుంటూ అన్నాడు పిల్లాడు, పుస్తకాల బ్యాగుతో తలమీద కొట్టుకుంటూ.





