గాయాలకి కవిత్వ లేపనం -సిహెచ్. ఉషారాణి

వస్తువుకి ప్రాణం పోస్తే, అక్షరానికి ఆత్మను ఇస్తే కవిత్వం అవుతుంది. ఇతడు కవిత్వంతో సావాసం చేస్తాడు. కవిత్వానికి ప్రాణం రాసిస్తాడు. కవిత్వం చుట్టూ, కవిత్వంతో అతని మనసు పెనవేసుకుపోయింది .అందుకే కవిత్వం ఎక్కడ ఉంటే అక్కడ తన మనసును రాసిస్తాడు. ఈ కవి రోజూ ఉదయం నుండి సాయంత్రం వరకూ పుస్తక ధ్యానం చేసేవాడు. పుస్తకాలతో ముచ్చట్లు పెట్టేవాడు. పుస్తకాలు అతని చేతికి అలవాటైన అలంకారాలు. గ్రంథాలయంలో పని చేయడంవల్ల అనేక సమయాలను కవిత్వంలోకి ఒంపుకున్నాడు. వఝల శివకుమార్ తన మనోగ్రంధాలయంలో ఆవిష్కరించిన “గోగుపువ్వు”, “పాలకంకుల కల”, “దాఖలా”, “కలల సాగు”, “వేళ్ళ రహస్యం” మిత్రులతో కలసి “లయ” సంకలనం, “ఫ్రీజోన్”, దీర్ఘ కవితవంటి సంపుటాలు ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇస్తూ అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. తనదైన గొంతుకతో, చైతన్యవంతమైన కవిత్వంతో ఉత్సాహాన్ని నింపారు. సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనడమే కాదు, ఎన్నో కొత్త కలాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు.

ప్రజల్లో పేరుకుపోయిన విశ్వాసాలను పాలకులు ఎలా బ్రష్టు పట్టించి సొంత లాభాలకు వాడుకొని, మనుషులను పరస్పరం ఉసిగొలిపి రాజ్యాధికారం కోసం పాకులాడుతారు చెప్పే కవిత “ఎడ్డి కాలం” “వాడు నమ్మకాన్ని బట్టి/ ఉమ్ము నీరు కొలుస్తున్నాడు/ మాయ ముంతల ఆనవాళ్లు/ చూపమంటున్నాడు” మనిషి పుట్టుకని అనుమానిస్తున్న ఈ కొత్తరకపు విద్వేషబీజం దేశం ముఖంమీద కొత్తగా ఏర్పడ్డ కక్షపూరిత ముఖ చిత్రం. విద్వేష మంటలను ఎగదోసి, ప్రజల రక్తపాతంతో ఆనందిస్తారు. ప్రజల శిరస్సులు తెగిపడడం, రక్తం నేలను తడిపితేతప్ప తృప్తిపడని పిశాచగణాలు రాజ్యమేలుతున్న కాలంలో మనలో మనమే మానసికంగా, భౌతికంగా నరుక్కొని చస్తున్న విషాదకాలాన్ని శివకుమార్ బాధతో చెబుతున్నారు

“కలబడి ఎగబడి నరుక్కుందాం/ గొడ్డలి మన చేతికి ఇచ్చాక/ వాడి పని సులువయింది” ఒకేప్రాణంగా కలిసిమెలిసి ఉన్న సోదర స్వభావపు సంబంధాలను ఎవరు నిప్పు పెట్టి కాల్చేస్తున్నారు? ఒకే కుటుంబం లాంటి దేశం ముక్కలవుతున్న దృశ్యాన్ని గుండెను పట్టేసే విధంగా చెబుతారు శివకుమార్. “ఒకే చెట్టుగా బతికిన గతం/ ఇప్పుడు నేలకూలుతున్న వర్తమానం”. విద్వేషాలను మన తలలోకి ఇంజెక్ట్ చేసి మనం విషపూరితమైన విషయం కూడా మనకు తెలియనంతగా కోమాలోకి తోసి తెలియకుండానే మనలను హంతకులుగా మార్చే విషనాగుల పన్నాగం అర్థంకాదు. “ఎంతగా భుజిస్తున్న/ ఎలా పూజిస్తున్న/ మనిషిని విభజించే వాదాలకు/ పల్లకి బోయులు ఎవరన్నదే ప్రశ్న/ నిషా తలకెక్కనంతవరకే/ ఎక్కిందా/ అది విషయం/ ఇప్పుడు తల నుంచి తోకదాకా మోస్తున్న/ పగవాడి పాచిక”

అధికారపీఠాలు, పదవీవ్యామోహాల కోసం ఎంతటి నికృష్టపనులకైనా ఒడిగట్టే రాజకీయ నాయకుల పట్ల నిరసనభావం ఆయన కవిత్వంలో చాలాచోట్ల ఎదురవుతుంది. “పావురాలు గుమ్ముటాలను ప్రేమిస్తాయి/ గోపురాలను ప్రేమిస్తాయి/ ఒక్క రాబందులే అధికారం కోసం/ మనిషిని విభజిస్తాయి/ కోయిలలు పాటలని ప్రేమిస్తాయి/ రంగురంగుల తోటలని ప్రేమిస్తాయి/ ఒక్క గుడ్లగూబలే/ రెక్కల కింద ముడిచిపెట్టుకుని/ చీకటి కూతలకు తెరతీస్తాయి”. అడుగడుగునా మనుషుల జీవితాల్లో రాజకీయం సృష్టించే విధ్వంసాన్ని ఆయన తేటతెల్లంగా తేల్చేస్తారు. మనిషికి ఎప్పుడూ గతించినకాలం తీపిజ్ఞాపకమే. అది యవ్వనమైనా, కౌమరమైనా, బాల్యమైనా మనిషి మనోఫలకంపై నిత్యయవ్వనంగా ఉంటాయి. ఆ జ్ఞాపకాల మధురస్మతుల తవ్విపోతలు సంభాషణ కవితలో వల్లెవేస్తాడు “బయట సముద్రం/ లోనహోరు/ నీటిపొరల్లో మూలాల్ని/ తడుముతున్నప్పుడు/ అడ్డుకున్న పరిమళం/ నేను జారవిడుచుకున్నదే/ శంఖులు, గవ్వలు/ ముక్కలైన స్వప్నాలు/ ఏరుకుంటున్న ఆ కేరింతల/ పసితనం నాదే”

ఎన్ని వసంతాలు దాటిపోయినా, చర్మ ముడతల్లో వయసు పొరల దొంతరులు పేరుకు పోతున్నా ఇంకా ఏదో మిగిలిపోయిందనే భావన మనుషుల్లో ఒక నిరాశను నాటుతుంది. “ఎంత చెప్పుకున్నా/ తీరంతో మాట్లాడాల్సింది/ ఇంకా మిగిలి ఉంది/ ఇప్పుడప్పుడే వదిలి రాలేను/ పుస్తకం పుటల్ని వెనక్కి తిప్పుకుంటూ మరెన్నో అలల్ని చదువుకోవాలి”. గతంలోకి వెళ్లి సేదతీరడం అనే గొప్ప పురాజ్ఞాపక ఉత్సవం, ఆ గత జ్ఞాపకాల పైన గొప్ప అనుభూతిని విస్తరించుకోవడం మనిషి లోపలి పొరల్లో చేసి ఒక ఆనందతాండవం “ఒంటరితనం చుట్టూ ముసురుకున్న/ జేగురురంగు ఆశల్ని/ తీరం మీద ఆరేసుకోవాలి/ భవసాగరంలో కాకులు ఎత్తుకుపోయిన తీరికంతా/ ఇక్కడే దొరికినట్టు సంబరం/ ఏకాంతాన్ని వొంపుకుంటూ/ ధ్వనిగా రూపాంతరం చెందుతున్న చర్య.” “కొలిమి “ కవితలో “గాజులచేతులయితేనేం/ గాల్లోకి సమ్మెటెత్తి కొట్టాల్సిందే/ నిప్పుల మీద కాలి ఎరుపెక్కిన/ కొడవలికొన పదునెక్కాల్సిందే”, “వేలాడుతున్న జోలెలోంచి/ చేతులాడిస్తున్న పసికందూ/ కొంగెగదట్టి దరువేస్తున్న తల్లీ’’ 1999 లలో “పాలకంకుల కల “ అనే కవితా సంపుటిలోనిది ఈ కవిత.

తెలంగాణ బతుకుచిత్రం “కొలిమి “ కవిత. ఒక పోరాట చిత్రానికి ప్రతీకాత్మకంగా సాగిన కవిత. “కలల సాగు’’ అనే కవిత- “రెప్పల దొన్నెల్లో అలల అలికిడి/ ద్వారకాతిరుమల అనుభవాల సలపరింత/ “చెరువుల ఒడిపట్టిన నేల దేహంమీద/ వెన్నెల వర్షం కురవనీ- తెలంగాణ రైతు గోస ఈ కవిత. వానలు లేక, నదులు ఉన్నా తనను దాటిపోతున్న వైనం. రైతు గుండెతడి మనముందు దృశ్యమై పారుతుంది. “ఊరితడి’’ ఈ తడి తాకని హృదయం లేదు.ఈతడి మనిషి చివరివరకూ తనలోకి లాక్కొనే అందమైన, అమాయకమైన బాల్యం. అతనిని మనిషిగా, కవిగా తీర్చిన ఊరు అది.

“నాదైన నడకకు/ ఊపిరి పోసిన ఊహల ఉయ్యాల/ పన్నెండేళ్లకే పద్యంజేసి/ అక్షరయానం నేర్పిన ఆదిగురువు” అట్లాంటి ఊరు ఇప్పుడు “ఆవిరైన కన్నీటి పొర”గా మారిన కవితను ప్రతి మనసును తడుముతుంది. “జమ్మిచెట్టు అక్కడే ఉంది’’, “మనకోసం కళ్ళల్లో వస్తులేసుకుని/ ఎక్కిళ్లు పడుతున్న/ తల్లివేరు తండ్లాటల్లోకి/ పద అడుగేద్దాం/ మనూరి దసరా సరదాల్లోకి” స్తబ్ధత నిండిన జీవితాలు, చైతన్యం మరిచిన కాలంలో బతుకుతున్న ప్రతి మనిషికి ఇదొక పిలుపు. వఝల కవిత్వంలో జ్ఞాపకాలు,తాత్వికత, నర్మగర్భత, కప్పిచెపుతూనే చురుకలు వేయడం ఇతని ప్రత్యేకత. కాలానికి తగినట్టుగా తనను మలుచుకుంటూ కవితానిర్మాణం సాగించడం, ఒక కవితను చదివినప్పుడు అందులో బోధనలు, సందేశాలు, నినాదాలు ఉండవు. ఒక వాస్తవచిత్రణ, అస్తిత్వపు తండ్లాట ఉంటుంది. మానవత్వాన్ని కోల్పోయినతనాన్ని గుర్తుచేస్తాడు. కాలంచేసిన గాయాలకు కవిత్వలేపనం అవుతాడు.

(వఝల శివకుమార్- నవంబర్ 28 వ తేదీన ‘ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సాహితీ పురస్కారం’ అందుకుంటున్న సందర్భంగా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *